విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న భూమన కరుణాకర రెడ్డి
సాక్షి ప్రతినిధి, తిరుపతి :
ఓటుకు కోట్లు కేసు నుంచి సీఎం చంద్రబాబును బయట పడేసేందుకే కేంద్రమంత్రులు సుజనా, వెంకయ్యనాయుడు మంగళవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమిత్ షాను కలిసి రహస్యపు మంతనాలు జరిపారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. భయం నీడన బిక్కుబిక్కుమంటోన్న బాబు ఆదేశాల మేరకే వీరిద్దరూ అమిత్ షాతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు వెళ్లారని భూమన ఆరోపించారు. బుధవారం సాయంత్రం తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో భూమన కరుణాకర్‌రెడ్డి మరోసారి టీడీపీ ఎత్తుగడలపై ధ్వజమెత్తారు.
స్వాతంత్య్ర పోరాట సమయంలో ‘వందేమాతరం, ఇంక్విలాబ్ జిందాబాద్’ వంటి నినాదాలు ఎంత ప్రాచుర్యంలోకి వచ్చాయో, అదేవిధంగా చంద్రబాబు పుణ్యమాని ఇప్పుడు ‘ఓటుకు కోట్లు’ మాట జనం నోళ్లల్లో నానుతోందన్నారు. ఈ వ్యవహారంలో అడ్డంగా దొరికిన సీఎం చంద్రబాబు తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందన్నారు. మంగళవారం కేంద్రంలో ఉన్న మంత్రులు సుజనా చౌదరి, వెంకయ్యనాయుడులు బీజేపీ నేత అమిత్ షా కాళ్లావేళ్లా పడి బాబును కేసు నుంచి బయటకు లాగే ప్రయత్నం చేశారన్నారు. అయితే చర్చలు ముగిశాక బయటకు వచ్చి మాత్రం ప్రత్యేక హోదా గురించి మాట్లాడామని చెప్పారన్నారు. హోదా అన్నది అధికారిక అంశం కాగా, అమిత్ షాతో చర్చలేంటని భూమన ప్రశ్నించారు. అంతటితో ఆగని నేతలు బుధవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారనీ, బాబు అనైతిక రాజకీయాల కారణంగా గవర్నర్ మర్యాదను కూడా రోడ్డున వేస్తున్నారని విమర్శించారు. అసలు రాజ్‌భవన్‌లో వీరిద్దరూ గవర్నర్‌తో ఏం చర్చించారో అధికారిక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా అంశంపై మొదటి నుంచీ మాట్లాడుతున్న కేంద్రమంత్రి మరొకరుండగా, సుజనా చౌదరి ఎవరని ప్రశ్నించారు. సుజనా గానీ, ఆయన మంత్రి పదవిగానీ కేంద్రంలో మేకగడ్డం కింద వేలాడే ‘అజాగళ స్తనాల’వంటివని ఎద్దేవా చేశారు. ‘ఓటుకునోటు కేసులో బాబును హరిహరాదులు కూడా రక్షించలేరని మొదట్లో బీరాలు పలికిన కేసీఆర్ నోరు మూగబోయిందేమని ప్రశ్నించారు. తొలి విడతగా రూ.500 కోట్ల ముడుపులు పుచ్చుకున్నందుకా? అన్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉందన్నారు. వైఎస్‌ఆర్ హయాంలో 22 అభియోగాలు తనపై మోపితే కడిగిన ముత్యంలా బయట పడ్డానంటోన్న చంద్రబాబుకు ఏ కోర్టు కడిగిన ముత్యమని తీర్పు చెప్పిందో తెలపాలన్నారు. ఓటుకు కోట్లు కేసు ఏసీబీ పరిధిలోనిది కాదని ఓ టీడీపీ నేత మంగళవారం మీడియా సమావేశంలో ఉటంకించడాన్ని ప్రస్తావించిన భూమన.. టీడీపీ నేతలు తమకోసం ప్రత్యేక న్యాయ, పోలీస్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారా అని ప్రశ్నించారు. ‘వీరప్పన్ కూడా ఇరవయ్యేళ్లు దొర మాదిరి తిరిగాడు, ఆపైన పోలీసులకు దొరికాడు. బిన్‌లాడెన్ రెండున్నర దశాబ్దాల పాటు ప్రపంచాన్ని గడగడలాడించాడు. చివరకు పోలీసులకు దొరకక తప్పలేదు. దుర్మార్గులకు అవకాశాలు లభించినా, అంతిమ విజయం మాత్రమే ధర్మానిదే. బాబు ఇప్పటివరకూ దొరకకపోయి ఉండొచ్చు. సమయం వచ్చినపుడు మాత్రం దొరక్కపోడు’ అని భూమన అన్నారు. తనకు కావాల్సిన ప్రసార మాధ్యమాల్లో ఈ అంశం కేసే కాదంటూ రాయించుకున్నంత మాత్రాన విషయం చక్కబడిపోదన్నారు. ఇప్పటివరకూ ‘ఆ గొంతు’ తనది కాదని చంద్రబాబు ప్రకటించలేదని భూమన పేర్కొన్నారు. ఒకప్పుడు తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేస్తుందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు వైఎస్సార్‌సీపీ నేతల ఫోన్లన్నీ ట్యాపింగ్ చేస్తుందని ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసులో లాలూచీ పడ్డ సీఎంలు ఇద్దరూ అసలు విషయాన్ని ఒప్పుకోకపోతే ప్రజలందరి హృదయాల్లో తోడు దొంగలుగా మిగిలిపోతారని భూమన పేర్కొన్నారు.