కరపత్రం ఆవిష్కరిస్తున్న రైతులు
మిరుదొడ్డి: జన్యుమార్పిడి ద్వారా ఆహార పంటలను పండించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆడ్డుకోవాలని సీసీసీ (కేరింగ్ సిటిజన్ కలెక్టివ్) జిల్లా కో-ఆర్డినేటర్ సూకూరి ప్రవీణ్ అన్నారు. జన్యుమార్పిడి ఆహార పంటలను ఆపాలని డిమాండ్ చేస్తూ మండల పరిధిలోని చెప్యాల గ్రామ పంచాయతీ మదిర గ్రామం లింగుపల్లి రైతులతో కలిసి శనివారం కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఆహార వ్యవస్థకు గొడ్డలి పెట్టులా మారిన జన్యు మార్పిడి పంటలను ఆపాలని డిమాండ్ చేశారు. జన్యు మార్పిడి పంటలతో భూ సారం తగ్గడం, కలుపు మొక్కలు విపరీతంగా పెరగడం, మొక్కలలో నపుంసకత్వం, తేనెటీగలు అంతరించడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదాలు చోటు చేసుకుంటాయన్నారు. ప్రకృతికి విరుద్ధంగా ఒక జీవజాతి నుండి జన్యువులు తీసుకుని మరొక జీవజాతిలోకి చొప్పించి పంటల మార్పిడి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఇదే జరిగితే జన్యు మార్పిడి జరిగిన ఆహార పదార్థాలను తింటే ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. పంటల మార్పిడి అయిన పంటలను పశు పక్ష్యాదులకు సైతం ప్రాణ హాని జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. ఆహార పంటలలో జన్యు మార్పిడి వద్దే వద్దని గ్రామ గ్రామాన రైతులకు ఆవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.