జిల్లా కేంద్రంలోని రహెమానియా ఈద్గా
నేడు బక్రీద్
Published Mon, Sep 12 2016 9:22 PM | Last Updated on Thu, Jul 11 2019 6:18 PM
మహబూబ్‌నగర్ అర్బన్: ముస్లింలు జిల్లావ్యాప్తంగా మంగళవారం బక్రీద్ పండగను ఘనంగా జరుపుకోనున్నారు. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం చివరి మాసమైన జిల్‌హిజ్జా 10తేదీన జరుపుకునే ఈ పండగను ‘ఈద్–ఉల్–జహా గా’ వ్యవహరిస్తారు. ముస్లింలు సామూహికంగా ఈద్గాకు వెళ్లి ప్రత్యేక నమాజు చేయడం రివాజు. బక్రీద్ పండగను జరుపుకుని, లోక కల్యాణం కోసం నమాజు చేసి ప్రార్థనలు చేస్తారు. పేదలు, ధనికుల తేడా లేకుండా అందరూ ఆనందోత్సహాలతో పండగను జరుపుకుంటారు. స్థానిక జామియ మసీదు నుంచి ఉదయం 8 గంటలకు ముస్లింలు సామూహికంగా గడియారం చౌరస్తా మీదుగా స్థానిక రహెమానియ ఈద్గా వద్దకు చేరుకుని 9గంటలకు ప్రత్యేక నమాజ్ చేస్తారని ఈద్గా కమిటీ ఉపాధ్యక్షుడు మహ్మద్ జకీ తెలిపారు.
బక్రీద్ ప్రాశస్త్యం..
ఇబ్రహీం ఖలీలుల్లా రజియల్లాహు తాలా అనే పైగంబర్ దంపతులు చేపట్టిన నియమనిష్టల ఫలితంగా వారికి ఇస్మాయిల్ జబీవుల్లా అనే ఏకైక కొడుకు ఉన్నాడు. అయితే వారి భక్తిని, త్యాగాన్ని పరీక్షించడానికి అల్లా తన కొడుకును బలి ఇవ్వాల్సిందిగా ఇబ్రహీం కలలో కనిపించి ఆజ్ఞాపిస్తాడు. దైవ నిర్ణయాన్ని శిరసావహించడమే మార్గదర్శకంగా భావించిన ఆ దంపతులు తమ కుమారుడిని బలి ఇవ్వడానికి నిర్ణయించి, అతడిని సిద్ధం చేస్తారు. దైవాదేశం మేరకు ఆ బాలుడిని సుదూర ప్రాంతమైన అడవుల్లోకి తీసుకెళ్లి బలిపీఠంపై పీక కోయడానికి తండ్రి సిద్ధమవుతుండగా.. ఆ ఖుర్బానీ ప్రక్రియను ఆపి వేయాలని దైవవాణి వినిపిస్తుంది. దైవ వాక్కు వృథాగా పోవద్దని, ఇస్మాయిల్ జబీవుల్లాస్థానంలో అటుగా వచ్చిన ఓ పొట్టెలును బలి ఇవ్వాలని ఆదేశిస్తుంది. లోకకల్యాణం కోసమే ఈ సంఘటన జరిగిందని, తమ సంతానానికి ఎలాంటి కీడు జరగరాదనే భావించి ముస్లింలు ఆ నాటి నుంచి బక్రీద్ నెలలో పొట్టెళ్లతో పాటు పలు రకాల జంతువులను ఖుర్బానీ ఇవ్వడం పరిపాటిగా మారింది.
ఖౌమీ ఏకతా కమిటీ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు
ఈద్ ముబారక్ చెప్పడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు ఈద్గా వద్దకు చేరుకుని పట్టణ ఖౌమీ ఏకతా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే శిబిరం వద్ద ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలపనున్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ టీకే శ్రీదేవి, ఎస్పీ రెమా రాజేశ్వరితోపాటు ఆయా పార్టీల నేతలు వేడుకల్లో పాల్గొనున్నారు. ఈద్ నమాజ్ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ఊపందుకున్న పొట్టెళ్ల విక్రయాలు
స్టేషన్ మహబూబ్‌నగర్: బక్రీద్‌కు ఖుర్బానీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. మూడు రోజులపాటు పొట్టెళ్ల మాంసాన్ని పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలో వారంరోజుల నుంచే పొట్టెళ్ల విక్రయకేంద్రాలు వెలిశాయి. జిల్లా కేంద్రంలోని న్యూటౌన్, వన్‌టౌన్, క్లాక్‌టవర్, మార్కెట్, మదీనా మజీద్, షాసాబ్‌గుట్ట, రామచూర్ రోడ్ తదితర ప్రాంతాల్లో పొటెళ్ల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతేడాది కంటే ఈ సారి పొటెళ్ల ధర అమాంతం పెరిగింది. పొట్టెళ్ల బరువును బట్టి రూ.7 వేల నుంచి రూ.12వేల వరకు అమ్ముతున్నారు.
Advertisement
Advertisement