
నేడు రోడ్ల దిగ్బంధం
- బ్యాంకులు, ఏటీఎంలు, అత్యవసర సర్వీసులకు మినహాయింపు
- వామపక్ష పార్టీల నాయకులు
అనంతపురం అర్బన్ : కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టకుండా పెద్దనోట్లను రద్దు చేసి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేయడానికి నిరసనగా సోమవారం రోడ్ల దిగ్బంధం చేపట్టామని, ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుని జయప్రదం చేయాలని వామపక్షాల నాయకులు విజ్ఞప్తి చేశారు. బ్యాంకులు, ఏటీఎంలు, అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, సీపీఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి సి.పెద్దన్న, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సి.జాఫర్ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి రాస్తారోకో, ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
యాబై రోజుల్లో పరిస్థితి మెరుగవుతుందని ప్రధాని చెబుతున్నప్పటికీ ఆర్థిక నిపుణులు మాత్రం ఆరు నెలలు గడిచినా సాధారణ స్థితి కొనసాగవచ్చని అంచనాలు వేస్తున్నారని అన్నారు. త్వరలో ఎన్నికలున్న ఐదు రాష్ట్రాలలో ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు పెద్దనోట్లను రద్దు చేసిన మోదీ ఎత్తుగడ తిరగబడిందన్నారు. ఈ చర్యతో ప్రధానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. విదేశీ బ్యాంకుల్లోని రూ.80 లక్షల కోట్ల నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన మోదీ ఆ దిశగా చర్యలు చేపట్టకుండా సంపన్నులు, కార్పొరేట్ దిగ్గజాలకు కొమ్ముకాస్తున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో సీపీఐ సహాయ కార్యదర్శి నారాయణస్వామి, ఎస్‌యూసీఐ(సీ) నాయకులు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.