నేడు కొవ్వొత్తుల ప్రదర్శన
– గౌరు వెంకటరెడ్డి
కర్నూలు(ఓల్డ్‌సిటీ): వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు గురువారం నగరంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ ప్రత్యేక హోదాపై పోరాటం సాగిస్తోందన్నారు. ఐదుకోట్ల ఆంధ్రుల మనోభీష్టం మేరకు హోదా సాధనే లక్ష్యంగా జగన్ నాయకత్వంలో నిత్యం పోరాటాలు చేస్తుంటే, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వార్థ ప్రయోజనాల కోసం హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీ మేలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
జల్లికట్టు సంఘటన స్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదాపై కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం సాయంత్రం 5 గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి మొదలు రాజ్‌విహార్ సెంటర్ వరకు, తిరిగి జిల్లా పరిషత్ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన చేపడతామన్నారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా కలిసికట్టుగా నిరసనలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.