దడ పుట్టించిన ధర కిలో చేపలు.. రూ. 1000
నిరాశ మిగిల్చిన మృగశిర తీవ్ర వర్షాభావమే కారణం
మెదక్/నర్సాపూర్ రూరల్: మృగశిరకార్తె రోజున కొర్రమీను తినాలనుకునే చేపల ప్రియులకు నిరాశే మిగిలింది. చేపల ధరలు ఒక్కసారిగా ఆకాశానంటాయి. కార్తె ప్రారంభం రోజున చేపలు తినడం ఆనవాయితీ. చేపలు తింటే ఏ జబ్బు దరిచేరదని అపారనమ్మకం. దీనిని ఆసరా చేసుకున్న వ్యాపారులు.. ధరలను అమాంతం పెంచేశారు. జిల్లాలో కిలో కొర్రమీను.. రూ. 800 నుంచి రూ. 1000 వరకు పలికింది. తెల్ల చేపలు రూ.200 నుంచి 300వరకు, బంగారుతీగ, మార్పులు తదితర రకాల చేపలు కిలోకు రూ. 350 నుంచి రూ. 450 వరకు విక్రయించారు.
ఆయా చెరువులతోపాటు హైదరాబాద్, తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చేపలు తీసుకువచ్చి విక్రయించారు. ధరలు చూసి చాలా మంది ఇంటి మొఖం పట్టారు. మరికొందరు తెల్ల చేపలు కొనేందుకు మొగ్గు చూపారు. ఇంకొందరు చికెన్, కోడిగుడ్లతో కార్తెను జరుపుకున్నారు. ఈ విషయమై చేపల వ్యాపారులను వివరణ కోరగా గత ఖరీఫ్‌సీజన్‌లో సరైన వర్షాలు కురవక చెరువులు, కుంటలు ఎండిపోయాయన్నారు. ఫలితంగా చేపలకు డిమాండ్ ఏర్పడిందన్నారు. స్థానికంగా చేపలు లేకపోవడంతో హైదరాబాద్, తదితర మార్కెట్‌ల నుంచి తీసుకువచ్చి విక్రయించామన్నారు. ఖర్చులు పోను పెద్దగా మిగిలిందేమి లేదన్నారు.