
మాట్లాడుతున్న జేసీ దివ్య
- మూడు సర్పంచ్, ఏడు వార్డులు, ఒక ఎంపీటీసీ స్థానానికి ఎన్నికలు
- ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్
ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలో ఖాళీ ఏర్పడిన మూడు సర్పంచ్, ఏడు వార్డులు, ఒక ఎంపీటీసీ స్థానాలకు నేడు ఉప ఎన్నిక జపరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మ«ధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ఉంటుంది. జిల్లాలో నాలుగు 4 సర్పంచ్, 24 వార్డులు, ఒక ఎంపీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో ఒక సర్పంచ్, 17 వార్డు స్థానాల ఎన్నిక ఏకగీవ్రమైంది. ఉప ఎన్నికలకు మొత్తం 29 ఈవీఎంలను, 95 మంది సిబ్బందిని ఎన్నికల సంఘం కేటాయించింది. వీరిలో 19 మంది పీఓలు, 57 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. మూడు సర్పంచ్ స్థానాలకు ఎనిమిదిమంది, ఏడు వార్డు స్థానాలకు 15 మంది, ఒక ఎంపీటీసీ స్థానానికి ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎంపీటీసీ స్థానం ఓట్ల లెక్కింపు ఈ నెల 10న ఉంటుంది. ఎన్నికల అధికారులు, సిబ్బందికి బుధవారం జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ డి.దివ్య శిక్షణ ఇచ్చారు. కలెక్టరేట్‌లోని డీఆర్వో క్యాంప్ కార్యాలయం నుంచి పోలింగ్ సామాగ్రితో అధికారులు, సిబ్బంది పోలీస్ బందోబస్తుతో వెళ్ళారు. పోలింగ్ ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసివేయించాలని ఎక్సైజ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల రోజున ఆయా ప్రాంతాల్లో స్థానిక సెలవు దినం ప్రకటించారు.
పంచాయతీ ఎన్నికలకు తొలిసారిగా ఈవీఎంలు
పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా ఈవీఎంలను ఉపయోగిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ దివ్య తెలిపారు. పోలింగ్‌కు ముందు మాక్ పోలింగ్ నిర్వహించి క్లోజ్, రిజల్ట్ , క్లియర్ బటన్లు సరిచేసి ఏజెంట్లకు చూపాలని ఎన్నికల అధికారులు, సిబ్బందితో చెప్పారు. ఓటర్లు తప్పనిసరిగా ఎన్నికల సంఘం నిర్దేశించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి వెంట తెచ్చుకోవాలన్నారు.
ఎన్నికలు జరిగే స్థానాలు ఇవే
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
మండలం గ్రామం స్థానం వార్డు
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
చింతకాని చింతకాని సర్పంచ్ –
రఘునాధంపాలెం చిమ్మపూడి సర్పంచ్ –
టేకులపల్లి బద్దుతండా సర్పంచ్ –
బయ్యారం ఉప్పలపాడు వార్డు 1 వ
బయ్యారం ఉప్పలపాడు వార్డు 9వ
చండ్రుగొండ పెంట్ల వార్డు 2వ
కొత్తగూడెం సుజాతనగర్ వార్డు 9వ
ముదిగొండ అమ్మపేట వార్డు 7 వ
సింగరేణి రేలకాయలపల్లి వార్డు 7 వ
టేకులపల్లి టేకులపల్లి వార్డు 7 వ