నేడు ఒంటిమిట్ట రామయ్య కల్యాణోత్సవం
♦ చలువ పందిళ్లతో కళకళలాడుతున్న ఉత్సవ ప్రాంగణం
♦ ఏర్పాట్లు కట్టుదిట్టం.. భారీగా పోలీసుల మోహరింపు
ఒంటిమిట్ట: వైఎస్‌ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం రాత్రి 8-10 గంటల మధ్య కల్యాణం నిర్వహించడానికి వేదికను సుందరంగా ముస్తాబు చేశారు. 70 ఎకరాల సువిశాల ప్రాంగణంలో చలువ పందిళ్లు, కార్పెట్‌లు సిద్ధం చేశారు. కల్యాణోత్సవాన్ని భక్తులందరూ తిలకించేందుకు వీలుగా భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఆహారం, మజ్జిగ, మంచి నీరు అందించేందుకు 40 కౌంటర్లు ఏర్పాటు చేశారు. కల్యాణోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ హాజరవుతుండటంతో 2 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, టీటీడీ ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఆలయంలో పూజా విధానాలను పరిశీలించారు. స్వామివారి కల్యాణం నిర్వహించే విధానం, ఏర్పాట్ల గురించి అర్చకులతో చర్చించారు.
మోహిని అలంకారంలో రామయ్య
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం ఒంటిమిట్ట కోదండరాముడు మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారిని మోహిని అలంకారంలో సుందరంగా అలంకరించిన అర్చకులు పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. స్వామి వారు రాత్రి గరుడ వాహనంపై ఊరేగారు.