నేడే ‘అనంత’కు రాహుల్
►ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పరామర్శ
►అన్నదాతలు, కూలీలు, చేనేత కార్మికుల వద్దకు..
►భారీగా జనసమీకరణకు కాంగ్రెస్ కసరత్తు
►నిరసనలకు పిలుపునిచ్చిన టీడీపీ
పుట్టపర్తి నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: కేంద్రంలో, రాష్ర్టంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారు. రాహుల్ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓబుళ దేవర చెరువు(ఓడీసీ) నుంచి కొండకమర్ల గ్రామం వరకు రాహుల్ గాంధీ శుక్రవారం పాదయాత్ర నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. పాదయాత్రను విజయవంతం చేయడమే లక్ష్యంగా శ్రమిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితోపాటు కేంద్ర మాజీ మంత్రులు కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి, కిల్లి కృపారాణి, పల్లంరాజు, పార్టీ నేతలు గిడుగు రుద్రరాజు, సాకే శైలజానాథ్ తదితరులు రెండు మూడు రోజులుగా అనంతపురం జిల్లాలో మకాం వేశారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పాదయాత్ర జరిగే గ్రామాల్లో కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. రాహుల్ చేపడుతున్న యాత్రకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కాంగ్రెస్ ముఖ్య నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నారు.
రాహుల్ పర్యటన ఇలా..
రాహుల్ గాంధీ శుక్రవారం ఉదయం 6.30 గంటలకు బెంగుళూరు నుంచి బయల్దేరి 7.15 గంటలకు రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కొడికొండ చెక్‌పోస్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 8 గంటలకు ఓబుళ దేవర చెరువుకు చేరుకొని 8.05 గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారు. మార్గమధ్యలో అంబేద్కర్, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి ప్రసంగిస్తారు. ఓబుళ దేవర చెరువు గ్రామంలో రైతులు, చేనేత కార్మికులతో 45 నిమిషాల పాటు మాట్లాడుతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం 10 నిమిషాలపాటు విద్యార్థులతో ముచ్చటిస్తారు. 9.45 గంటలకు మామిళ్లకుంటపల్లికి చేరుకుంటారు.
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న హరినాథరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. 11 గంటలకు డబురవారిపల్లికి చేరుకొని డ్వాక్రా గ్రూపు సభ్యులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కొండకమర్లకు వెళ్లి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలతో మాట్లాడుతారు. తర్వాత అక్కడి నుంచి వాహనంలో బయల్దేరి పుట్టపర్తికి చేరుకుంటారు. స్థానికుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారు. అనంతరం పార్టీ నేతలతో సమావేశమవుతారు. సాయిబాబా మహా సమాధిని దర్శించుకుంటారు. ఓబుళ దేవర చెరువు నుంచి కొండకమర్ల గ్రామం వరకు రాహుల్ గాంధీ దాదాపు 10 కిలోమీటర్ల మేర నడవనున్నారు.
రాష్ట్ర విభజనకు కారకుడైన రాహుల్ గాంధీకి అనంతపురం జిల్లాలో పర్యటించే అర్హత లేదని టీడీపీ ఆరోపించింది. ఆయన రాకను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని జిల్లాకు చెందిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పెనుకొండ, తాడిపత్రి ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, జేసీ ప్రభాకరరెడ్డి తదితరులు ఇప్పటికే ప్రకటించారు. టీడీపీ నేతల సూచన మేరకు రాహుల్ పర్యటనను నిరసిస్తూ పుట్తపర్తి, అనంతపురం, పెనుకొండ, కదిరి నియోజకవర్గాల్లోని పలు పాఠశాలల విద్యార్థులు నల్లబ్యాడ్జీలు ధరించి తరగతులకు హాజరయ్యారు.
కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు
రాహుల్‌గాంధీ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పుట్టపర్తి, ఓడీసీ, గోరంట్ల తదితర ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. 10 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 60 మంది ఎస్‌ఐలు, 600 మంది కానిస్టేబుళ్లను బందోబస్తు నిమిత్తం నియమించారు.