జనహితం .. సత్యసాయి అభిమతం! | today sathyasai birth anniversary | Sakshi
Sakshi News home page

జనహితం .. సత్యసాయి అభిమతం!

Published Tue, Nov 22 2016 11:13 PM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM

జనహితం .. సత్యసాయి అభిమతం!

జనహితం .. సత్యసాయి అభిమతం!

నేడు బాబా జయంతి
పుట్టపర్తి టౌన్‌ : సమత..మమత..మానవత్వం ఈ మూడు కలగలిపిన స్వరూపమే సత్యసాయి బాబా. సత్యం, ధర్మం, శాంతి ప్రేమ..అనే విలువలను బోధిస్తూ మనిషిలో దాగి ఉన్న మానవత్వాన్ని నిద్రలేపిన సత్యసాయి.. ధీనులకు నిస్వార్థ సేవలు అందించి సేవకు ప్రతి రూపంగా నిలిచారు. ఆధ్యాత్మిక బోధనలతో తన భక్త కోటిని ముక్తిమార్గం వైపు పయనింపజేసి, భగవత్‌ స్వరూపుడయ్యారు.దాహం కేకలు పెడుతున్న కరువు సీమ ప్రజల దాహార్తి తీర్చి అపరభగీరథుడయ్యారు. పేదరికం ఓ వైపు.. రోగాలు మరోవైపు.. చుట్టుముట్టి పేదలు
వైద్యానికీ నోచుకోని వారికి ఖరీదైన వైద్యం అందిస్తూ ‘వైద్యో నారాయణుడు’ అయ్యారు.
ప్రకృతి విలయం ధాటికి ‘గూడు’ చెదిరిన ఎందరో నిరాశ్రయులను చేరదీసి అను‘గృహం’ కల్పించి, వారిపాలిట ఆపద్బాంధవుడిగా నిలిచారు. విలువలతో కూడిన విలువైన విద్యను కేజీ టు పీజీ వరకు ఉచితంగా అందిస్తూ వేలాది కుటుంబాల్లో అక్షరజ్యోతులు వెలిగించారు. ‘మానవ సేవయే ..మాధవ సేవ’ అన్న నినాదంతో మానవాళి శ్రేయస్సు కోసం సత్యసాయి అందించిన సేవలు అజరామరం.. అజేయం.
అభాగ్యుల ఆరోగ్య ప్ర‘దాత’  :
    వైద్యసేవలకు నోచుకోని పుట్టపర్తి ప్రాంత ప్రజలకు ‘వైద్యం’ అందించే లక్ష్యంతో సత్యసాయి తన 30వ ఏట 1956 ఆక్టోబర్‌ 4న ఉచితంగా వైద్యం అందించే జనరల్‌ ఆస్పత్రిని నిర్మించారు. ఇందులో 94 పడకలు, 2 అపరేషన్‌ థియేటర్లు, 8 వార్డులు, జనరల్‌ మెడిసిన్, సర్జన్‌కు సంబంధించి చిన్నిపిల్లల విభాగం, కన్ను, ముక్కు, చెవి, దంతవైద్యం, స్త్రీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందిస్తున్నారు.  

సిమ్స్‌ ద్వారా ఖరీదైన వైద్యసేవలు
వైద్యం వ్యాపార వస్తువుగా మారిన ఈ రోజుల్లో నయాపైసా తీసుకోకుండా అన్ని వైద్యసేవలు అందించే ఆసుపత్రి ఉందంటే సంభ్రమాశ్చర్యాలకు గురికాకతప్పదు. ఇంతటి గొప్ప ఖ్యాతిని పుట్టపర్తి సమీపంలోని ప్రశాంతి గ్రాం వద్ద నిర్మించిన సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ సత్యసాయి 91వ జయంత్యుత్సవాల్లో  సిమ్స్‌ రజతోత్సవం వైభవంగా జరుపుకుంది.  

-    సత్యసాయి 1991 నవంబర్‌ 22న ప్రశాంతి గ్రాం వద్ద ఉచితంగా ఆధునిక సౌకర్యాలతో వైద్యసేవలు అందించే లక్ష్యంతో   సత్యసాయి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ మెడికల్‌ సైన్సెస్‌ను నిర్మించారు. దీన్ని అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు చేతులు మీదుగా ప్రారంభింపజేశారు.
-    300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆస్పత్రిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 8 అపరేషన్‌ థియేటర్లు, ఆధునిక వైద్యపరికరాలు అందుబాటులో ఉన్నాయి. గెండె, కిడ్నీలు, కంటి జబ్బులు, ఎముకల శస్త్ర చికిత్సలు, అత్యవసర వైద్యం , ప్లాస్టిక్‌ సర్జరీ, రేడియాలజీ తదితర విభాగాల్లో శస్త్ర చికిత్సలు అందిస్తున్నారు.
-    ఈ ఆస్పత్రి ద్వారా ఇప్పటికి 43 లక్షల మందికి వైద్య చికిత్సలు అందించారు. ఇందులో 3.2 లక్షల మందికి శస్త్ర చికిత్సలు చేశారు.
-    బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌  సత్యసాయి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ మెడికల్‌ సైన్సెస్‌ పేరిట 306 పడకల సూపర్‌స్సెషాలిటీ ఆస్పత్రి నెలకొల్పారు. 2001లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఆస్పత్రిని ప్రారంభించారు.
-    బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో మహిళలు, పిల్లలకు సేవలు అందించేందుకు మరో జనరల్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. తొలుత 30 పడకలు ఉండగా ప్రస్తుతం 50 పడకలుగా అభివృద్ధి చేశారు.

సత్యసాయి ‘సంచార’ వైద్యం  :
మారుమూల ప్రాంతాలకు సరైన రోడ్డు సౌకర్యాలు లేక ఆస్పత్రులకు రాలేక వైద్యసేవలు పొందలేకపోతున్న విషయాన్ని గ్రహించిన సత్యసాయి.. సత్యసాయి సంచార వైద్యసేవల పేరిట వైద్యసేవలు అందిస్తున్నారు. 2006 మార్చి 30న సత్యసాయి సంచార వైద్య సేవలను సత్యసాయి  ప్రారంభించారు. ఆధునిక వసతులున్న మొబైల్‌ వాహనం  పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు, ఓడీసీ, చెన్నేకొత్తపల్లి, నల్లమాడ మండలాల్లో 12 నోడల్‌ పాయింట్ల ద్వారా 63 గ్రామాల ప్రజలకు ఉచిత వైద్యసేవలను అందిస్తున్నారు. అదేవిధంగా మరో 400 గ్రామాల ప్రజలు వైద్యసేవలు పొందుతున్నారు. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 12 నోడల్‌ పాయింట్లకు వెళ్లి  మొబైల్‌ వాహనం వెళ్తుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 16 జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సైతం సంచార వైద్యసేవలు అందిస్తున్నారు.

 అపర భగీరథుడు సత్యసాయి :
    వరుస కరువు, ఫ్లోరైడ్‌ రక్కసి వెరసి గుక్కెడు నీళ్లు దొరక్క గొంతెండిన
అనంతపురం జిల్లా వాసుల దాహం తీర్చేందుకు రూ.500 కోట్ల వ్యయంతో సత్యసాయి తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. సత్యసాయి తాగునీటి పథకం ద్వారా జిల్లాలోని 1447 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా సుమారు 3,200 కిలో మీటర్లు మేర పైప్‌లైన్‌ వేయించారు.

బాబా తన 75వ జన్మదినం కానుకగా అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులమీదుగా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో 18 బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లు,136 గ్రౌండ్‌ లెవెల్‌ రిజర్వాయర్లు, 2350 ఓవర్‌హెడ్‌ ట్యాంకులను నిర్మించారు. అదేవిధంగా మహబూబ్‌ నగర్‌ జిల్లాలో సైతం 141 గ్రామాలకు, మెదక్‌ జిల్లాలో 179 గ్రామాలకు, తూర్పుగోదావరిలో 220, పశ్చిమగోదావరి జిల్లాలో 230 గ్రామాలకు రక్షిత మంచినీరు అందిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాజధాని చెన్నై నగరం దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన తెలుగుగంగ, కండలేరు కాలువల నిర్మాణానికి సత్యసాయి రూ.250 కోట్ల సహాయం అందించారు.

‘పర్తి’ ప్రాంతానికి ‘వరం’ సత్యసాయి తాగునీటి పథకం :
పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు గ్రామాలకు వరం సత్యసాయి తాగునీటి పథకం సత్యసాయి నిర్యాణం అనంతరం సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ ఆయన ఆశయాలను కొనసాగింపుగా పుట్టపర్తి, కొత్తచెరవు, బుక్కపట్నం మండలాల పరిధిలో మరో 126 గ్రామాలకు  తాగునీరు అందించేందుకు   రూ.90 కోట్ల పైబడి వ్యయంతో తాగునీటి పథకాన్ని ప్రారంభించారు.  

వేలాది కుటుంబాల్లో ‘విద్యాజ్యోతులు’ :
సత్యసాయి వేలాది కుటుంబాల్లో విద్యాజ్యోతులు వెలిగిస్తున్నారు. కేజీ నుంచి పీజీ వరకు విలువలతో కూడిన ఉచిత విద్యను అందించాలన్న లక్ష్యంతో సత్యసాయి 1981లో సత్యసాయి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లర్నింగ్‌ను ఏర్పాటు చేశారు.ఈ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రశాంతి నిలయం  క్యాంపస్, అనంతపురంలో సత్యసాయి మహిళా క్యాంపస్, బెంగళూరులోని బృందావన్‌ క్యాంపస్, మద్దనహళ్లి క్యాంపస్‌ల ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. ఏడు విభాగాల్లో  అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ), ఐదు విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ (పీజీ), మూడు  ప్రొఫెషనల్‌ కోర్సులు యూనివర్శిటీ ద్వారా అందిస్తున్నారు. మానవతా విలువలు, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను, జీవనోపాధులు మెరుగు పరిచేందుకు ప్రాచీన గురుకుల విద్యావిధానంలో విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. సత్యసాయి యునివర్శిటీకి 1986లో ఇండియన్‌ యూనివర్శిటీ అసోసియేషన్‌లో శాశ్వత సభ్యత్వం లభించింది. 2008లో సత్యసాయి డీమ్డ్‌ యునివర్శిటీ సత్యసాయి యునివర్శిటీగా అవతరించింది. ఆధునిక ఆలయాలను పోలిన నిర్మాణంలో సత్యసాయి యునివర్శిటీ భవనం పుట్టపర్తిలో ఎద్దుల కొండపై దర్శనమిస్తుంది.   

నిరాశ్రయులకు ఆపన్న హస్తం :
ప్రపంచంలో ఏ మూల ప్రకృతి విపత్తులు  సంభవించినా అక్కడ సత్యసాయి సేవాసంస్థలు వాలిపోయి సేవా కార్యక్రమాలను  చేపడుతున్నాయి.  సత్యసాయి ట్రస్ట్‌ ద్వారా వరద బాధితులకు ఆపన్నహస్తం అందించారు. 2008లో ఒడిశాలో భారీ వరదలు రావటంతో పలువురు నిరాశ్రయులుగా మిగిలారు. ఆపదలో చిక్కుకున్న వారికి అండగా నిలుస్తూ సత్యసాయి ట్రస్ట్‌ నాలుగు జిల్లాల్లో 750 మందికి పక్కాగృహాలను నిర్మించింది. సుమారు ఒక్కో  గృహానికి రూ.1.30 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. దేశంలో జరిగిన గుజరాత్‌ భూకంప, ఉత్తరాఖండ్‌ వరదలతోపాటు, ఇటీవల రాష్ట్రంలో సంభవించిన హుదూద్‌ తుఫాను విలయం సమయంలనూ సత్యసాయి సేవాదళ్‌  సేవలను అందించారు. దేశంలోనే కాకుండా ఇండోనేషియా, జపాన్‌లలో సునామీలు సంభవించిన సమయంలో   సత్యసాయి సేవాదళ్‌ బాధితులకు సేవలను అందించారు.

గ్రామసేసే.. రామ సేవ :
సామాజిక అవసరాలైన కూడు, గుడ్డకు నోచుకోలేని వారికి ఒక్క పూటైనా ‘అన్నం’ పెట్టాలన్న మానవతాహృదయంతో ‘
 సత్యసాయి గ్రామసేవ’  2000లో ప్రారంభించారు. ప్రతి ఏటా దసరా పర్వధిన వేడుకలను పురస్కరించుకుని పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలకు చెందిన 150 గ్రామాల్లో సుమారు 55 వేల కుటుంబాలకు అన్నప్రసాదాలు , నూతన వస్త్రాలను అందిస్తున్నారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులలో సేవాభావాన్ని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమంలో వారిని భాగం చేస్తూ నిర్వహించడం విశేషం. 16 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్విగ్నంగా సాగుతోంది. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు 50 వాహనాల్లో వెళ్లి గ్రామీణులకు అన్నప్రసాదాలు అందజేస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement