
నేడు కృష్ణా జిల్లాకు జగన్
బందరు పోర్టు బాధితులతో ముఖాముఖి
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. మచిలీపట్నం (బందరు) పోర్టు కోసం టీడీపీ ప్రభుత్వం ఏకపక్షంగా రైతుల పచ్చటి పొలాలను లాక్కుంటున్న ప్రాంతాలను జగన్ సందర్శిస్తారు. బందరు మండలంలోని బుద్దాలవారి పాలెం, కోన గ్రామాలలో ఆయన పర్యటిస్తారు. బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుతో భూములు కోల్పోనున్న బాధిత రైతులతో ఆయన మాట్లాడతారని, వారినుద్దేశించి బహిరంగసభలో కూడా ప్రసంగిస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
జగన్ గురువారం ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో మచిలీపట్నం బైపాస్ మీదుగా బుద్దాలవారిపాలెం చేరుకుంటారు. అక్కడ రైతులతో మాట్లాడతారు. అనంతరం అక్కడి నుంచి కోన గ్రామానికి చేరుకుని బాధిత రైతులతో ముఖాముఖి నిర్వహించి.. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
పులివెందులలో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, కడప : ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ వైఎస్‌ఆర్ జిల్లా పులివెందులలో బుధవారం ప్రజలతో మమేకమయ్యారు. రెండో రోజు కూడా స్వగృహంలో ఉదయం పలువురు రైతులు, కార్యకర్తలు, నేతలు, మహిళలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారు అనేక సమస్యలను జగన్‌కు విన్నవించారు. జగన్ పర్యటన ముగించుకొని బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు.