
సందడే.. సందడి
♦ మున్సిపాలిటీలో నామినేటెడ్ పర్వం
♦ కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు రంగం సిద్ధం
♦ దరఖాస్తుకు రేపటివరకు గడువు
♦ పెరగనున్న ఆశావహుల సంఖ్య
♦ మంత్రి ప్రసన్నం కోసం మొదలైన అభ్యర్థుల ప్రయత్నాలు
సిద్దిపేట జోన్: సిద్దిపేట మున్సిపాలిటీలో మరోమారు రాజకీయ సందడి నెలకొంది. కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేయడంతో రాజకీయ వేడి మొదలైంది. మూడు కోఆప్షన్ స్థానాలకు సభ్యుల ఎన్నిక కోసం దరఖాస్తుకు శుక్రవారం వరకు గడువు ఉంది. ఆశావహులు ఎవరికి వారు దరఖాస్తు చేయడంలో మునిగిపోయారు. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి హరీశ్‌రావు ఆశీస్సుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.
సిద్దిపేట మున్సిపాలిటీలో 34 మంది కౌన్సిల్ సభ్యులున్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం సంఖ్యాపరంగా ముగ్గురిని కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకునే అవకాశం ఉంది. రెండు నెలల క్రితమే కొత్త పాలక వర్గం కొలువుదీని విషయం తెల్సిందే. నిర్ణీత గడువులోగా కోఆప్షన్ సభ్యుల ఎంపికను నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో అధికారులు మూడు స్థానాల కోసం ఈనెల 16న నోటిఫికేషన్ జారీ చేశారు. దరఖాస్తుల దాఖలుకు శుక్రవారం వరకు ఉంది. కౌన్సిలర్ అభ్యర్థిత్వానికి ఉన్న నిబంధనలనే కోఆప్షన్ ఎన్నికకు అమలు చేయనున్నారు. మూడింటిలో రెండింటిని మైనార్టీలకు, మరోటి ఇతరులకు కేటాయిస్తారు.
దరఖాస్తుకు ఎవరు అర్హులు..?
మున్సిపల్ మాజీ చైర్మన్, మాజీ కౌన్సిలర్, మాజీ సర్పంచ్‌ల అర్హతను, ఐదేళ్ల రాజకీయ అనుభవాన్ని ప్రమాణికంగా తీసుకొని దరఖాస్తుకు అర్హులుగా ప్రకటించారు. వీరితోపాటు మూడేళ్లపాటు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్‌గా పనిచేసిన వారు అర్హులే. అదీగాక మున్సిపల్ రిటైర్డ్ ఉద్యోగులు, ఆర్‌అండ్‌బీ, టౌన్‌ప్లానింగ్, వాటర్ సప్లయ్, పబ్లిక్ హెల్త్ వంటి మున్సిపల్ అనుబంధ విభాగాల్లో ఉద్యోగులుగా ప్రత్యేక అనుభవం కలిగిన వారు కో ఆప్షన్ సభ్యత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అ భ్యర్థిత్వాన్ని ఆశించే వారు సిద్దిపేట పట్టణంలో ని ఏదైన వార్డుకు చెందిన ఓటరై ఉండాలి. వా రిపై క్రిమినల్ కేసులు ఉండరాదు. ముగ్గురు పిల్లల నిబంధనను అమలు చేస్తున్నారు.
దరఖాస్తుల వెల్లువ..
కోఆప్షన్ సభ్యత్వానికి దరఖాస్తుల సమర్పణకు అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. మాజీ కౌన్సిలర్లు, తదితరులు గత మూడు రోజులుగా దరఖాస్తు ఫారాల స్వీకరణ, సంబంధిత ధ్రువీకరణ పత్రాల తయారీ, దరఖాస్తుల సమర్పణ వంటి ప్రక్రియల్లో నిమగ్నమయ్యారు. బుధవారం సాయంత్రం నాటికి మున్సిపల్ అధికారుల నుంచి దాదాపు 20 దరఖాస్తు ఫారాలను తీసుకెళ్లినట్టు సమాచారం. ఇందులో ఆరు దరఖాస్తులు అధికారులకు అందినట్టు తెలిసింది. మరో రెండు రోజులు గడువు ఉండడంతో దరఖాస్తులు వెల్లువెత్తే అవకాశం ఉంది. ఏదేమైనా కోఆప్షన్ రూపంలో మున్సిపాలిటీలో రాజకీయ సందడి నెలకొంది. ఓవైపు దరఖాస్తు చేయడంలో మునిగిపోతూనే మరోవైపు మంత్రి హరీశ్‌రావు ఆశీస్సుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.