విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం కడియం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ర్యాంకుల ను గురువారం (26న) విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు తెలిపారు. సచివాలయంలోని ‘డి’ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ ర్యాంకులను విడుదల చేస్తారని చెప్పారు. ర్యాంకులను విద్యార్థులు www.sakshieducation.com, http://www.tseamcet.in వెబ్‌సైట్ల ద్వారా పొందవచ్చు. విద్యార్థులు ఎంసెట్‌లో సాధించిన మార్కులతోపాటు ఇంటర్ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీ కలిపి తుది ర్యాంకుల వివరాలను వెల్లడిస్తారు.
ఈ నెల 15న జరిగిన ఎంసెట్ రాసేందుకు 2,46,522 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా అందులో ఇంజనీరింగ్ పరీక్ష కోసం 1,44,510 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష కోసం 1,02,012 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో ఇంజనీరింగ్ పరీక్షకు 1,33,442 మంది హాజరవగా అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 89,792 మంది హాజరయ్యారు. కాగా, ఫలితాల విడుదల అనంతరం ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియను జూన్ 10 నుంచి ప్రారంభించే అవకాశం ఉంది.
రేపు ఎంసెట్ ర్యాంకులు
Published Wed, May 25 2016 4:32 AM | Last Updated on Mon, Sep 4 2017 12:50 AM
Advertisement
Advertisement