జగన్ సభను జయప్రదం చేయండి
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : ద్వారకాతిరుమలలో ఈ నెల 29న వైఎసార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించతలపెట్టిన బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని పిలుపునిచ్చారు. శుక్రవారం ఏలూరులోని తన నివాసంలో నాని విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం ఆది నుంచి వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ఆయన వైపే ప్రజలూ చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా గళం బలంగా వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలో జరగనున్న ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని నాని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సభలో జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడు, దివంగత కోటగిరి విద్యాధరరావు కుమారుడు శ్రీధర్‌బాబు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారని, పార్టీ శ్రేణులు ఆయనకు సాదర స్వాగతం పలకాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జగన్‌మోహన్‌రెడ్డి రాజమండ్రి చేరుకుంటారని, అక్కడి నుంచి 3.30 గంటలకు ద్వారకాతిరుమల చేరుకుని స్వామిని దర్శించుకుంటారని పేర్కొన్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్రంలో జరిగిన పరిణామాలను చూసి ఐదు కోట్ల మంది ప్రజలు తీవ్ర మనోవేదనకు గురయ్యారని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమం ఏ ఒక్క పార్టీకో చెందింది కాదని, రాష్ట్ర ప్రజలే ఈ ఉద్యమానికి సారథులని, తమ పార్టీ అధినేత వారికి అండగా నిలిచి మద్దతు తెలుపుతున్నారని, వారి గళాన్ని బలంగా వినిపిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాన్ని అణగదొక్కడమే లక్ష్యంగా చంద్రబాబు చేసిన నీచ రాజకీయాలపై ప్రజలందరూ మండిపడుతున్నారని వివరించారు. ఒక ప్రతిపక్ష నాయకుని గంటలపాటు ఎయిర్‌పోర్టులో నిర్భంధించడం అనాగరికమన్నారు. ఎన్ని త్యాగాలకోర్చి అయినా ప్రత్యేక హోదా సాధించి తీరతామన్నారు. టీడీపీ నాయకులు ఇటీవల అవాకులు, చవాకులు పేలడం పరిపాటిగా మారిందని, వారు తమ నోటిని అదుపులో పెట్టుకోవడం ఉత్తమమని నాని హితవు పలికారు. హోదా ఉద్యమంపై కేంద్రమంత్రి సుజనాచౌదరి వ్యాఖ్యలు అనుచితమని విమర్శించారు. ఇటీవల రాష్ట్ర మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కూడా హోదాపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, గత ఎన్నికల సమయంలో తిరుపతి సభలో మోదీ రాష్ట్రానికి పదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని ఎలా ప్రకటించారో తెలుసుకోవాలని హితవు పలికారు. కోటగిరి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిపాలనలో అనుభవం లేదని, కేవలం రాజకీయాలు చేయడంలోనే అనుభవం గడించారని ఎద్దేవా చేశారు. గాలివాటంగా గెలిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలంతా మద్దతుగా ఉన్నారని భ్రమ పడుతున్నారని, ఆ భ్రమలు త్వరలోనే తొలగిపోతాయన్నారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు తెల్లం బాలరాజు, కొఠారు రామచంద్రరావు, పుప్పాల వాసుబాబు, తలారి వెంకట్రావు, దయాల నవీన్‌బాబు, మధ్యాహ్నపు బలరామ్ పాల్గొన్నారు.