- దిగుమతి చేసుకున్నవారికే ప్రాధాన్యం
- లోకల్ టాలెంట్‌కు దక్కని చోటు
- స్థానిక కళాకారుల అసంతృప్తి
- బీచ్ ఫెస్టివల్‌పై విమర్శలు
అంతా నాన్‌లోకల్
Published Mon, Jan 16 2017 11:12 PM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM
నేను పక్కా లోకల్ .. అంటూ ఈ రోజుల్లో అంతా లోకల్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నారు. చివరకు ‘నేను లోకల్’ పేరుతో విడుదలకు సిద్ధమైన చిత్రం ఆడియో ఫంక్ష¯ŒS కూడా లోకల్‌గానే చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం సంక్రాంతి పండగ సందర్భంగా కాకినాడ సాగర తీరంలో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్‌లో లోకల్ టాలెంట్‌ను గుర్తించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, ముంబై తదితర నగరాల నుంచి తీసుకువచ్చినవారికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంపై స్థానిక కళాకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
జిల్లా సంస్కృతీసంప్రదాయాలకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ‘సాగర సంబరాల’కు 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీని నిర్వహణకు అప్పటి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ప్రత్యేక చొరవతో ప్రభుత్వం నుంచి నిధులు సమకూర్చారు. స్థానిక కళాకారులకు, సంప్రదాయాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. గత మూడేళ్లుగా కూడా సాగరసంబరాల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొంది, కనుమరుగవుతున్న కళలను ప్రోత్సహించేందుకు కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఈసారి బీచ్ ఫెస్టివల్‌లో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. స్థానికేతరులకు ఇచ్చిన ప్రాధాన్యంలో కనీసం 10 శాతం కూడా స్థానిక కళలకు, కళాకారులకు, సంప్రదాయాలకు ఇవ్వలేదని పలువురు విమర్శిస్తున్నారు.
అన్నీ ఉన్నా.. దక్కని ప్రాధాన్యం
రాష్ట్రంలో మరే జిల్లాకూ లేనటువంటి భౌగోళిక స్థితిగతులు మన జిల్లాకు సొంతం. ఒకపక్క మెట్ట ప్రాంతం, మరోవైపు డెల్టా, ఇంకోవైపు ఏజెన్సీ ప్రాంతం, సాగరతీరం ఇలా భిన్న సంస్కృతులు, వాతావరణాలు కనిపిస్తాయి. ఏ ప్రాంతానికా ప్రాంతం ఒక్కో ప్రత్యేకతను మూటగట్టుకుని ఉన్నాయి. సాగర సంబరాల సందర్భంగా వాటికి ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేసి ఉంటే బాగుండేదని పలువురు అంటున్నారు.
∙కాకినాడ జమునానగర్, సర్పవరం ప్రాంతాల్లో వందల సంఖ్యలో తోలుబొమ్మలాట కళాకారులున్నారు. కోనసీమతోపాటు పలు ప్రాంతాల్లో హరికథ, బుర్రకథ కళాకారులున్నా వారిలో ఒక్కరికి కూడా సాగర సంబరాల్లో అవకాశం దక్కలేదు.
∙సంప్రదాయ నృత్యాలకూ జిల్లాలో కొదవలేదు. గత సాగరసంబరాల్లో గిరిజనుల నృత్యప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈసారి వాటికి చోటు కల్పించలేదు.
∙గతంలో జిల్లాలోని 10 ముఖ్య దేవస్థానాల నమూనా ఆలయాలు ఏర్పాటు చేయగా ఈసారి అన్నవరంతోపాటు శ్రీశైలం నమూనా ఆలయాలకే పరిమితమయ్యారు.
∙ద్రాక్షారామ భీమేశ్వరస్వామి, అయినవిల్లి సిద్ధి వినాయకుడు, అంతర్వేది లక్షీ్మనరసింహస్వామి, పిఠాపురం పాదగయ.. ఇలా ప్రసిద్ధి చెందిన అనేక ఆలయాలున్నా వాటికి కూడా సాగర సంబరాల్లో కనీసం కూడా అవకాశం లేకుండా పోయింది.
∙గతంలో సైకత శిల్పాలను ప్రోత్సహించగా ఈ ఏడాది దానికి అనుకున్నంత ప్రోత్సాహం కనిపించలేదు.
∙పాడి పరిశ్రమ, వ్యవసాయం, గిరిజన ఉత్పత్తులకు కూడా సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు.
∙గతంలో జరిగిన సంబరాల్లో జిల్లా నలుమూలల నుంచీ 100కు పైగా పాఠశాలలు, కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు పాల్గొనేవారు. అదేవిధంగా ఈసారి పాఠశాలల విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం కల్పిస్తారని అంతా ఆశించారు. కానీ, ఐదారు పాఠశాలలకు మించి విద్యార్థులు హాజరు కాలేదు.
భాగ్యనగర్ బడా సంస్థకే అంతా..
∙ఈ ఏడాది సాగర సంబరాలకు పర్యాటక శాఖ రూ.2.5 కోట్లు మంజూరు చేసింది. వీటితోపాటు పరిశ్రమలు, జిల్లాలోని వివిధ సంఘాల నుంచి విరాళాలు కూడా సమకూరాయి. మొత్తమ్మీద సాగర సంబరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్ల వరకూ ఖర్చు చేసేందుకు గ్రీ¯ŒSసిగ్నల్ ఇచ్చింది.
∙ఈ నేపథ్యంలో సాగర సంబరాల మొత్తం నిర్వహణను అధికారులు ఈసారి హైదరాబాద్‌కు చెందిన ఒక బడా సంస్థకు అప్పగించారు. ప్రధాన వేదికతోపాటు లైటింగ్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటును కూడా ఆ సంస్థకే అప్పగించారు. ఇదే వేదికపై ‘నేను లోకల్’ సినిమా ఆడియో రిలీజ్ కూడా నిర్వహించారు. గత ఏడాది రూ.22 లక్షలు వెచ్చించి ముంబై నుంచి ఒక సింగర్‌ను తీసుకొచ్చారు. ఆ ప్రోగ్రాం రెండు గంటలు కూడా లేదంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ ఏడాది కూడా ముంబైకే చెందిన కేకే అనే సింగర్‌ను రూ.24 లక్షలు వెచ్చించి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. హైదరాబాద్, చెన్నై, ముంబై నుంచి కళాశారులను దిగుమతి చేశారే తప్ప జిల్లా కళాకారులను ప్రోత్సహించినది లేదంటూ పలువురు విమర్శిస్తున్నారు.
Advertisement
Advertisement