పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై ఆరా
విశాఖలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటన
వివిధ సంస్థల సందర్శన
బృందంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం : కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖకు అనుబంధంగా ఉండే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రెండ్రోజుల పర్యటనకు విశాఖకు వచ్చింది. ఎంపీ ప్రహ్లాద్‌జోషి నేతృత్వంలోని ఈ కమిటీలో రాష్ట్రానికి చెందిన వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, తెలంగాణకు చెందిన వి.లక్ష్మికాంతారావుతోపాటు మరో 16 మంది ఎంపీలు ఉన్నారు. ఉదయం 9.30 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కమిటీ మధ్యాహ్నం హెచ్‌పీసీఎల్‌ను సందర్శించింది. ఆయిల్ రిఫైనరీల నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై కమిటీ హెచ్‌పీసీఎల్ అధికారులతో చర్చించింది. అనంతరం ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వు లిమిటెడ్‌ను కూడా సందర్శి భద్రత, వ్యూహాత్మక నిల్వల ప్రాధాన్యంపై అధికారులతో కమిటీ చర్చించింది.
ఆర్థిక నిర్వహణ, ప్రైవేటు చమురు సంస్థలతో సంయుక్త భాగస్వామ్యాలపై పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖాధికారులతో సమీక్షించింది. హెచ్‌పీసీఎల్‌కు వచ్చిన కమిటీ సభ్యులు తొలుత సంస్థ పరిపాలన భవనం వద్దకు వెళ్లి అక్కడ డైరెక్టర్‌లు, చీఫ్ మేనేజర్, తదితర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న సంస్థ విస్తరణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంస్థ ఆవరణలో పలు విభాగాలు సందర్శించారు. సింధియా సమీపంలో గల ఐఎస్‌సీఆర్‌సీ (భూగర్భంలో గ్యాస్ నిలువ ఉంచే ప్రదేశం)ని కూడా కమిటీ సందర్శించింది. ఇక్కడ గ్యాస్, చమురు నిక్షేపాలను ఏ పరిమాణం వరకు నిల్వ చేసే అవకాశం ఉంది... తీసుకుంటున్న భద్రతా ప్రమాణాలు, జాగ్రత్తల చర్యలను అడిగి తెలుసుకున్నారు. పార్లమెంట్ కమిటీ రాకను దృష్టిలో పెట్టుకుని మల్కాపురం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేటి కార్యక్రమాలు
కమిటీ మంగళవారం ఉదయం 9 గంటలకు ఆయిల్ ఫీల్డ్ సర్వీసెస్ ప్లానింగ్, డెవలప్‌మెంట్, నియంత్రణలపై చమురు మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతో కమిటీ భేటీ కానుంది. అనంతరం కేజీ బేసిన్‌లోని ఓఎన్‌జీసీ చమురు క్షేత్రాలను సందర్శించనుంది.