పెళ్లి ట్రాక్టర్‌కు ప్రమాదం
పెంచలకోనకు వెళుతుండగా మార్గమధ్యంలో ఘటన
పెళ్లి కుమార్తె సహా 22 మందికి స్వల్ప గాయాలు
గోపవరం: కడప–నెల్లూరు సరిహద్దులో గురువారం తెల్లవారుజామున పెళ్లి బృందంతో వెళుతున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న పెళ్లి కుమార్తె సహా 22 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురు తీవ్రంగా గాయపడటంతో కడప రిమ్స్‌కు, ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. బద్వేలు మండలం పుట్టాయపల్లె దళితవాడకు చెందిన కాసుల మల్లేశ్వరమ్మ కుమార్తె నాగవేణి వివాహం నెల్లూరు జిల్లా పెంచలకోన నరసింహస్వామి సన్నిధిలో గురువారం ఉదయం జరగాల్సి ఉండింది. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో పెళ్లి కుమార్తె సహా దళితవాడకు చెందిన సుమారు 30 మంది ట్రాక్టర్‌లో పెంచలకోనకు బయలుదేరారు. అయితే గోపవరం మండలం పీ.పీ.కుంట దాటిన తర్వాత జిల్లా సరిహద్దుకు సమీపంలో డ్రైవర్ ట్రాక్టర్‌ను అతివేగంగా నడుపుతుండగా ముందున్న మోరీని గమనించకపోవడంతో ఒక్కసారిగా పెద్దగోతిలోకి దిగిపోయింది. అసలే అర్ధరాత్రి సమయం కావడం, ప్రమాదం జరిగిన చోటు అటవీ ప్రాంతం కావడంతో చెట్లు తగిలి కొంత మంది గాయపడగా మరికొందరు ఒకరిపై ఒకరు పడటంతో స్వల్పంగా గాయపడ్డారు. పెళ్లి కుమార్తె సహా 22 మంది గాయపడగా వీరిలో 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని బద్వేలు సీమాంక్ ఆసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన వారు స్వగ్రామానికి వెళ్లి పోయారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని కడప రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌కు తరలించిన వారిలో కొండయ్య, రామయ్య, నరసింహ, డ్రైవర్ సుబ్బరాయుడు తదితరులు ఉన్నారు. కాగా ట్రాక్టర్ బోల్తాపడి ఉంటే పెద్ద ప్రాణనష్టం జరిగి ఉండేది. కాగా పెళ్లి కుమార్తెను మరొక వాహనంలో పెంచలకోనకు తీసుకెళ్లి అనుకున్న సమయానికన్నా ఆలస్యంగా వివాహం జరిపించినట్లు సమాచారం. బద్వేలు రూరల్ ఎస్‌ఐ నరసింహారెడ్డి కేసు నమోదు చేశారు.