సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా గోపవరం వద్ద 482 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న సెంచురీ ప్యానల్స్ తయారీ యూనిట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ యూనిట్ ఏర్పాటుకు పర్యావరణ, అటవీ అనుమతులు మంజూరు కావడంతో సెంచురీ ఫ్లై సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించింది. సుమారు రూ.1,600 కోట్లతో ఏర్పాటుచేస్తున్న ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 2,000 మందికి పరోక్షంగా 4,000 మందికి ఉపాధి లభించనుంది.
ఈ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2021, డిసెంబర్ 24న భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఈ యూనిట్ తొలి దశ పనులను 2024 డిసెంబర్ నాటికి పూర్తిచేసి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలుత తమిళనాడులో ఈ యూనిట్‌ను నెలకొల్పాలని భావించామని, కానీ ఏపీ ప్రభుత్వం వేగంగా అనుమతులు మంజూరు చేస్తుండటంతో గోపవరం వద్ద ఏర్పాటుచేస్తున్నట్లు సెంచురీ ప్లై చైర్మన్ సజ్జన్ భజాంకా శంకుస్థాపన సమయంలో ప్రకటించారు.
తొలుత రూ.600 కోట్లతో యూనిట్ ఏర్పాటుచేయాలని భావించామని, కానీ ఇప్పుడు రూ.1,600 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన గోపవరం వద్ద ఈ యూనిట్ ఏర్పాటు వల్ల కలప ఆధారిత అనుబంధ పరిశ్రమలు మరిన్ని వస్తాయని, తద్వారా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: మరోసారి అలజడికి టీడీపీ నేతల యత్నం
Comments
Please login to add a commentAdd a comment