Panels
-
ఐపీవోల హవా
రోజుకో కొత్త గరిష్టాన్ని తాకుతున్న సెకండరీ మార్కెట్ల బాటలో ప్రైమరీ మార్కెట్లు సైతం భారీ సంఖ్యలో ఇష్యూలతో కదం తొక్కుతున్నాయి. తాజాగా రెండు కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరో రెండు కంపెనీలు ఐపీవో సన్నాహాల్లో ఉన్నాయి. వివరాలు ఇలా.. –సాక్షి, బిజినెస్డెస్క్ఐపీవో చేపట్టేందుకు సోలార్ ప్యానళ్ల తయారీ కంపెనీ వారీ ఇంజినీర్స్.. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి పొందింది. ఇదేవిధంగా డిజిటల్ పేమెంట్ల సంస్థ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూకి సైతం సెబీ ఆమోదముద్ర వేసింది. వారీ సెబీకి 2023 డిసెంబర్లో, మొబిక్విక్ 2024 జనవరిలో దరఖాస్తు చేశాయి. వారీ ఇంజినీర్స్.. రూ. 3,000 కోట్లకుపైగా వారీ ఇంజినీర్స్ ఐపీవోలో భాగంగా రూ. 3,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా 32 లక్షల షేర్లను ప్రమోటర్‌తోపాటు ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను ఒడిషాలో 6 గిగావాట్ల ఇన్గాట్ వేఫర్, సోలార్ సెల్, సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ ప్లాంటు ఏర్పాటుకు వెచి్చంచనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ 2023 జూన్‌కల్లా 12 గిగావాట్ల పీవీ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మొబిక్విక్.. రూ. 700 కోట్లు తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా మొబిక్విక్ రూ. 700 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సై అంటోంది. ఐపీవో నిధుల్లో రూ. 250 కోట్లు ఫైనాన్షియల్ సర్వీసుల బిజినెస్ వృద్ధికి వినియోగించనుంది. రూ. 135 కోట్లు పేమెంట్ సరీ్వసుల బిజినెస్‌కు దన్నుగా వెచ్చించనుంది. మరో రూ. 135 కోట్లు డేటా, మెషీన్ లెర్నింగ్, ఏఐ, ప్రొడక్ట్ టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేయనుంది. ఈ బాటలో పేమెంట్ పరికరాలపై రూ. 70 కోట్లు పెట్టుబడి వ్యయాలుగా కేటాయించనుంది. రూ. 10,000 కోట్లపై కన్ను విద్యుత్ రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎన్టీపీసీ అనుబంధ కంపెనీ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ భారీ ఐపీవోకు సిద్ధపడుతోంది. ఇందుకు అనుగుణంగా గత వారమే సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. తద్వారా నవంబర్ తొలి వారంలో ఐపీవోకు వచ్చే వీలున్నట్లు తెలుస్తోంది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవో ద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ముంబైసహా.. సింగపూర్ తదితర దేశాలలో రోడ్‌షోలకు ప్రణాళికలు వేసింది.ఇష్యూ నిధుల్లో రూ. 7,500 కోట్లు అనుబంధ సంస్థ ఎన్టీపీసీ రెనెవబుల్ ఎనర్జీ రుణ చెల్లింపులతోపాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఈ మహారత్న కంపెనీ 2024 ఆగస్ట్‌కల్లా 3,071 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు, 100 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను కలిగి ఉంది. ఈ ఏడాది ఇప్పటికే 60 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచి్చన నేపథ్యంలోనూ మరిన్ని కంపెనీలు ఇందుకు తెరతీస్తుండటం విశేషం! ఇదే బాటలో లీలా ప్యాలెస్ లీలా ప్యాలెస్ హోటళ్ల నిర్వాహక సంస్థ ష్లాస్ బెంగళూరు లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. వెరసి దేశీ ఆతిథ్య రంగంలో అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది. కాగా.. ఇష్యూలో భాగంగా లీలా ప్యాలెస్ రూ. 3,000 కోట్ల తాజా ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ సంస్థ డీఐఎఫ్సీ రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ దన్నుగల ష్లాస్ బెంగళూరు వెల్లడించింది. 2024 మార్చికల్లా కంపెనీ రుణ భారం రూ. 4,053 కోట్లుగా నమోదైంది. ద లీలా బ్రాండ్‌తో కంపెనీ విలాసవంత హోటళ్లను నిర్వహిస్తున్న విషయం విదితమే. మొత్తం 3,382 గదులను కలిగి ఉంది.రూ. 1,100 కోట్ల సమీకరణరియల్టీ కంపెనీ కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తెరతీసింది. ఇందుకు వీలుగా సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ. 1,100 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధులను కంపెనీతోపాటు అనుబంధ సంస్థల రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కాసాగ్రాండ్ బ్రాండుతో కంపెనీ రియల్టీ అభివృద్ధి కార్యకలాపాలు చేపడుతోంది. 2023–24లో రూ. 2,614 కోట్ల ఆదాయం, రూ. 257 కోట్ల నికర లాభం ఆర్జించింది.14ఏళ్లలో సెప్టెంబర్ బిజీ..బిజీ ఐపీవోలకు 28 కంపెనీలు ఈ నెల(సెప్టెంబర్) 14 ఏళ్ల తదుపరి సరికొత్త రికార్డుకు వేదిక కానుంది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) వివరాల ప్రకారం సెపె్టంబర్లో ఇప్పటివరకూ 28 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. మెయిన్ బోర్డ్, ఎస్ఎంఈలు కలిపి ఇప్పటికే 28 కంపెనీలు లిస్టింగ్‌కు తెరతీశాయి. ఫైనాన్షియల్ మార్కెట్లు పరివర్తనలో ఉన్నట్లు ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన సెపె్టంబర్ బులెటిన్‌లో ఆర్బీఐ పేర్కొంది. ప్రైమరీ ఈక్విటీ మార్కెట్లో చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈలు)సహా భారీ సందడి నెలకొన్నట్లు తెలియజేసింది. వెరసి 14 ఏళ్ల తరువాత ఈ సెప్టెంబర్ అత్యంత రద్దీగా మారినట్లు వ్యాఖ్యానించింది. దేశీ మ్యూచువల్ ఫండ్స్ తదితర ఇన్వెస్టర్ల ద్వారా ఇష్యూలు భారీస్థాయిలో సబ్‌్రస్కయిబ్ అవుతున్నట్లు వివరించింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిశీలన ప్రకారం ఐపీవోలలో లభించిన షేర్లలో 54 శాతాన్ని ఇన్వెస్టర్లు లిస్టయిన వారం రోజుల్లోనే విక్రయించారు. 2024లో ఐపీవోల ద్వారా నిధుల సమీకరణ జోరు చూపుతున్నట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొంది. ఈ బాటలో తొలి అర్ధభాగానికల్లా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఐపీవోలు వెలువడిన దేశంగా భారత్ నిలిచినట్లు తెలియజేసింది. ఇందుకు ఎస్ఎంఈలు ప్రధానంగా దోహదపడినట్లు వెల్లడించింది. -
బంగారు పూతతో తొలి సోలార్ ప్యానెల్.. 140 ఏళ్ల చరిత్ర
-
వేగంగా ‘సెంచురీ ప్యానల్స్’ నిర్మాణ పనులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా గోపవరం వద్ద 482 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న సెంచురీ ప్యానల్స్ తయారీ యూనిట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ యూనిట్ ఏర్పాటుకు పర్యావరణ, అటవీ అనుమతులు మంజూరు కావడంతో సెంచురీ ఫ్లై సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించింది. సుమారు రూ.1,600 కోట్లతో ఏర్పాటుచేస్తున్న ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 2,000 మందికి పరోక్షంగా 4,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2021, డిసెంబర్ 24న భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఈ యూనిట్ తొలి దశ పనులను 2024 డిసెంబర్ నాటికి పూర్తిచేసి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలుత తమిళనాడులో ఈ యూనిట్‌ను నెలకొల్పాలని భావించామని, కానీ ఏపీ ప్రభుత్వం వేగంగా అనుమతులు మంజూరు చేస్తుండటంతో గోపవరం వద్ద ఏర్పాటుచేస్తున్నట్లు సెంచురీ ప్లై చైర్మన్ సజ్జన్ భజాంకా శంకుస్థాపన సమయంలో ప్రకటించారు. తొలుత రూ.600 కోట్లతో యూనిట్ ఏర్పాటుచేయాలని భావించామని, కానీ ఇప్పుడు రూ.1,600 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన గోపవరం వద్ద ఈ యూనిట్ ఏర్పాటు వల్ల కలప ఆధారిత అనుబంధ పరిశ్రమలు మరిన్ని వస్తాయని, తద్వారా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: మరోసారి అలజడికి టీడీపీ నేతల యత్నం -
విక్రమ్ సోలార్ ఐపీవోకు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: దేశీ మాడ్యూల్ తయారీ కంపెనీ విక్రమ్ సోలార్ పబ్లిక్ ఇష్యూకి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అను మతి లభించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 50 లక్షల షేర్లను వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. స్టాక్ ఎక్స్చేంజీల లిస్టింగ్‌కు వీలుగా కంపెనీ మార్చిలో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. కంపెనీ సోలార్ ఫొటోవోల్టాయిక్ మాడ్యూల్స్ తయారీసహా.. సమీకృత సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్ అందిస్తోంది. ఈక్విటీ జారీ నిధులను 2,000 మెగావాట్ల సామర్థ్యంగల సమీకృత సోలార్ సెల్, సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు వినియోగించనుంది. 2021 డిసెంబర్‌కల్లా రూ. 4,870 కోట్ల విలువైన ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉంది. -
గుడ్ న్యూస్.. అదే జరిగితే ఫోన్ రేట్లు తగ్గడం ఖాయం!
సాధారణంగా స్మార్ట్ ఫోన్ తయారీలో డిస్ప్లే, కొన్ని ప్యానెల్స్ క్వాలిటీ విషయంలో ఫోన్ మేకర్లు కాంప్రమైజ్ అవ్వరు. ఇండియమ్ అనే అరుదైన ఎలిమెంట్‌ను ఇందుకోసం ఉపయోగిస్తుంటారు. ఇది చాలా కాస్ట్లీ వ్యవహారం. అయితే ఇండియమ్ ప్లేస్‌లో మరో మెటీరియల్‌ను తీసుకొస్తే.. తమ భారం తగ్గుతుందని, తద్వారా ఫోన్ల రేట్లు తగ్గించి మార్కెట్ పెంచుకోవాలని దశాబ్ధం పైగా కొన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో గుడ్ న్యూస్ చెప్పారు యూకే రీసెర్చర్లు. భూమ్మీద దొరికే తొమ్మిది అరుదైన మూలకాల్లో Indium మూలకం ఒకటి. ఇండియంతో(Indium Tin Oxide రూపంలో) ఓఎల్ఈడీ(organic light-emitting diode) టచ్ స్క్రీన్లను, ఇతర ప్యానెల్స్‌ను తయారు చేస్తుంటారు. మొబైల్స్‌తో పాటు కంప్యూటర్, పీసీలు, టీవీలు, సోలార్ ప్యానెల్స్, ఎల్ఈడీ లైట్స్ తయారీలో సైతం ఈ మూలకాన్ని ఉపయోగిస్తుంటారు. ఇది చాలా చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఫోన్ ధరల విషయంలో కొన్ని కంపెనీలు అస్సలు కాంప్రమైజ్ అవ్వవు. అయితే ఈ మెటీరియల్ ప్లేస్‌లోకి గ్రాఫిన్‌ను గనుక తీసుకొస్తే.. ఫోన్ మేకర్స్‌కి భారీ ఉపశమనం దొరుకుతుందనే ప్రయోగాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో.. యూకేకి చెందిన పేరాగ్రాఫ్ కంపెనీ, లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీలు సంయుక్తంగా చేసిన పరిశోధనలో ప్రత్యామ్నాయ మెటీరియల్ విషయంలో స్పష్టత వచ్చింది. గ్రాఫిన్‌తో తయారు చేసిన ఓఎల్ఈడీ డిస్ప్లే, ప్యానెల్స్‌ను.. డెమోను విజయవంతంగా చూపించారు పరిశోధకులు. తద్వారా ఇండియమ్‌కు గ్రాఫిన్ సరైన ప్రత్యామ్నాయమనే విషయాన్ని ఇన్నాళ్లకు ప్రపంచానికి చాటి చెప్పారు. ఇండియమ్ ప్యానెల్ వాస్తవానికి ఇండియమ్‌కు ఆల్టర్నేట్ కోసం చాలా కాలంగా పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. కానీ, ఏదీ ఇండియమ్ ఇచ్చినంత అవుట్‌పుట్ ఇవ్వలేకపోయింది. ఈ తరుణంలో గ్రాఫిన్ రీప్లేస్ చేస్తుందన్న వార్త ఫోన్ మేకర్స్‌కు శుభవార్తే అని చెప్పొచ్చు. ఇక Grapheneను వండర్ మెటీరియల్ అని అభివర్ణిస్తుంటారు. ఇండియమ్‌తో పోలిస్తే దీనికి అయ్యే ఖర్చు చాలా చాలా తక్కువ. సింగిల్ లేయర్ కార్బన్ అణువులు, తేనెపట్టులాంటి నిర్మాణంను పోలి ఉండే గ్రాఫిన్‌ను.. భూమ్మీద దొరికే బలమైన మెటీరియల్స్‌లో ఒకటిగా చెప్తుంటారు. కానీ, అవసరానికి అనుగుణంగా ఆకారాన్ని మార్చుకోవచ్చు.. పైగా కాపర్ కంటే మంచి విద్యుత్ వాహకంగా పని చేస్తుంది కూడా. మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్స్ తయారీలో ఇప్పటిదాకా గ్రాఫిన్‌ను వాడింది లేదు. కాబట్టి.. తొలి అడుగు పడడానికి కొంచెం టైం పట్టొచ్చు(అన్నీ కుదిరితే 2023 తొలి భాగం అనేది ఒక అంచనా). అదే జరిగితే స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాదు.. కంప్యూటర్లు, టీవీల తయారీ ఖర్చు..మార్కెట్లో కొన్ని బ్రాండెడ్ ఫోన్ ధరలు కూడా తగ్గే అవకాశం లేకపోలేదు. చదవండి: జీమెయిల్ మెమెరీ ఫుల్ కాకుండా ఉండాలంటే.. ఇలా చేస్తే సరి -
టీవీ రేట్లకు రెక్కలు..!!
న్యూఢిల్లీ: టీవీలకు కూడా కరోనా వైరస్ (కోవిడ్–19) సెగ తగలనుంది. టీవీల్లో కీలకమైన ఓపెన్ సెల్ టెలివిజన్ ప్యానళ్ల సరఫరా తగ్గి, కొరత పెరిగిపోతుండటంతో మార్చి నుంచి రేట్లు 10 శాతం దాకా ఎగియనున్నాయి. ప్రధానమైన ఈ భాగాన్ని దేశీ సంస్థలు ఎక్కువగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. టీవీ యూనిట్ రేటులో దాదాపు 60 శాతం భాగం టీవీ ప్యానళ్లదే ఉంటుంది. చైనా కొత్త సంవత్సరం సెలవులను దృష్టిలో ఉంచుకుని చాలామటుకు కంపెనీలు ముందస్తుగానే వీటిని నిల్వ చేసుకున్నాయి. కానీ ఊహించని విధంగా కరోనా వైరస్ ప్రబలడం, ఉత్పత్తి.. సరఫరా దెబ్బతినడంతో ప్యానళ్ల కొరత ఏర్పడింది. చైనాలో కొన్ని ఫ్యాక్టరీలు తిరిగి తెరుచుకున్నప్పటికీ, అర కొర సిబ్బందితోనే పనిచేస్తున్నాయి. దీంతో ప్యానళ్ల ధరలు దాదాపు 20 శాతం దాకా పెరిగినట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. ‘చైనాలో కరోనా వైరస్ సంక్షోభం వల్ల ముడిసరుకులకు భారీ కొరత నెలకొంది. ఓపెన్ సెల్ ప్యానళ్ళ ధరలు ఏకంగా 20 శాతం ఎగిశాయి. దీంతో మార్చి నాటికి టీవీల ధరలు 10 శాతం మేర పెరగనున్నాయి‘ అని ఎస్పీపీఎల్ సీఈవో అవ్నీత్ సింగ్ మార్వా చెప్పారు. భారత్‌లో థామ్సన్ టీవీలకు ఈ సంస్థ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ లైసెన్సీగా వ్యవహరిస్తోంది. టీవీ ప్యానళ్ల కొరత కారణంగా టీవీల రేట్లూ పెరగవచ్చని పానాసోనిక్ ఇండియా సీఈవో మనీష్ శర్మ తెలిపారు. ‘పరిస్థితి మెరుగుపడితే ఏప్రిల్ నుంచి రేట్లు స్థిరంగానైనా ఉండవచ్చు లేదా ఇదే ధోరణి కొనసాగితే 3–5% దాకా పెరగవచ్చు‘ అని చెప్పారు. ఫ్రిజ్‌లు.. ఏసీలు కూడా.. రాబోయే వారాల్లో ఫ్రిజ్‌లు, ఏసీల ధరలు కూడా పెరుగుతాయని హయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా చెప్పారు. ‘మార్చి ప్రారంభం నుంచి టీవీల రేట్లు పెరుగుతాయి. ఆ తర్వాత ఫ్రిజ్‌లు, ఏసీల ధరలూ పెరుగుతాయి. డీప్ ఫ్రీజర్ల రేట్లు ఇప్పటికే 2.5 శాతం పెరిగాయి‘ అని ఆయన చెప్పారు. చాలా కంపెనీలు ఏసీ, రిఫ్రిజిరేటర్లకు అవసరమైన కంప్రెసర్లను ఎక్కువగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. మరో 3 నెలల్లో సాధారణ స్థాయికి... ఉత్పత్తి, సరఫరా మళ్లీ సాధారణ స్థాయికి రావాలంటే కనీసం ఒక త్రైమాసికమైనా పడుతుందని మార్వా వివరించారు. కన్సల్టెన్సీ సంస్థ ఫ్రాస్ట్ అండ్ సలివాన్, పరిశ్రమ సమాఖ్య సీఈఏఎంఏ అధ్యయనం ప్రకారం.. 2018–19లో 1.75 కోట్ల యూనిట్లుగా ఉన్న టీవీ మార్కెట్ 2024–25 నాటికి 2.84 కోట్లకు చేరగలదని అంచనా. టీవీలో కీలకమైన ఓపెన్ సెల్ ప్యానల్, చిప్స్ ప్రధానంగా చైనాతో పాటు తైవాన్, థాయ్‌లాండ్, వియత్నాం వంటి మార్కెట్ల నుంచి దిగుమతవుతున్నాయి. భారత్‌లో అసెంబ్లింగ్ మాత్రమే జరుగుతోంది. దేశీ తయారీని ప్రోత్సహించేందుకు, టీవీల ఖరీదును తగ్గించేందుకు ఓపెన్ సెల్ ప్యానళ్లపై కేంద్రం దిగుమతి సుంకాలను తొలగించిందని నివేదిక వివరించింది. -
తేలికైన సౌరఫలకాలు..
సౌరశక్తిని విస్తృత స్థాయిలో వాడకపోయేందుకు కారణాలేంటో తెలుసా? బరువు ఎక్కువగా ఉండటం.. కావాల్సినట్లు మడతపెట్టే అవకాశం లేకపోవడం వంటివి రెండు కారణాలు. ఈ సమస్యను అధిగమించేందుకు ఆస్ట్రేలియాలోని సన్మ్యాన్ ఎనర్జీ సంస్థ వినూత్నమైన సౌర ఫలకలను అభివృద్ధి చేసింది. తేలికగా, గాజు లేకుండా తయారు చేసింది. ఫలితంగా వీటిని ఎలా అంటే అలా మడతపెట్టి వాడుకోవచ్చు. దీంతో వంపులున్న భవనాల్లోనూ ఎక్కువ సంఖ్యలో సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుదుత్పత్తి పెంచుకోవచ్చు. ఈ–ఆర్చ్ అని పిలుస్తున్న ఈ సోలార్‌ప్యానెల్ ఒకొక్క దాంట్లో దాదాపు వంద వరకు ఘటకాలు ఉంటాయి. రెండు మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉండే ఈ ప్యానెల్‌ను కావాల్సిన ఆకారంలో మార్చుకునే అవకాశం ఉంది. సంప్రదాయ సోలార్ ప్యానెల్స్ ఒకొక్కటి 20 కిలోల బరువు ఉంటే ఈ ఆర్చ్ 2.4 కిలోలు మాత్రమే ఉంటుంది. భవనాల కిటికీలతో పాటు పైకప్పులపై కూడా ఇవి తేలిగ్గా ఇమిడిపోతాయని సన్మ్యాన్ ఎనర్జీ సీఈవో డారెన్మిల్లర్ తెలిపారు. -
చుక్కలు చూపించిన విమానం!
న్యూయార్క్ః విమాన ప్రయాణం అంటేనే ఇటీవల వణుకు పుట్టే పరిస్థితి వస్తోంది. సాంకేతిక లోపాలు ఏర్పడటం, పక్షులు అడ్డు పడటం, ల్యాండింగ్ లో పొరపాట్లు జరగడం వంటి సంఘటనలు మామూలైపోయింది. తాజాగా న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై ల్యాండ్ అవ్వాల్సిన బోయింగ్ విమానం ఒక్క ఉదుటున ఎగిరి పడటంతో ప్రయాణీకులు అదిరి పడ్డారు. ప్రాణాలు గుప్పెట్టో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. న్యూయార్క్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వాల్సిన బోయింగ్ 767 ప్యాసింజర్ విమానం ప్రయాణీకులకు చుక్కలు చూపించింది. ల్యాండ్ అయ్యే ముందు పైలట్ మనసు మార్చుకోవడంతో రన్ వే పై బౌన్స్ కొట్టి, తిరిగి టేకాఫ్ అయ్యింది. పైలట్ రఫ్ రైడింగ్ తో విమానంలోని ప్యానెల్స్, మెకానికల్ బాక్స్ లు ఇతర చిన్న చిన్న వస్తువులు ప్రయాణీకులపై పడ్డాయి. హోస్టన్ నుంచి 214 మంది ప్రయాణీకులతో బయల్దేరిన 557 విమానం ల్యాండింగ్ విషయంలో ఏర్పడ్డ అస్థవ్యస్థ స్థితికి ప్రయాణీకులు వణికిపోయారు. ల్యాండ్ అయ్యేందుకు రన్ వే పైకి వచ్చిన విమానం స్కిప్ అవ్వడంతో పైలట్ తిరిగి టేకాఫ్ చేశాడని, తిరిగి ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించగా విమానం తిప్పలు పెట్టడంతో మరోసారి టేకాఫ్ చేశాడని ఇలా పలుమార్లు ల్యాండింగ్ కు ప్రయత్నించడం, టేకాఫ్ అవ్వడం ప్రయాణీకులను తీవ్ర ఆందోళనకు గురి చేసిందని ఓ ప్రత్యక్ష సాక్షి... ప్రయాణీకుడు తెలిపాడు. చివరిసారి ల్యాండ్ అయ్యేందుకు ముందు ఆకాశంలో పైటట్ కనీసం 30 సార్లు చక్కర్లు కొట్టించినట్లు తెలిపిన ప్రయాణీకుడు.. ఎట్టకేలకు ల్యాండ్ చేయడంతో ప్రయాణీకుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసినట్లు చెప్పాడు. అయితే విమానం చివరికి సేఫ్ గా ల్యాండ్ అయ్యిందని, ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు తగల్లేదని ఎయిర్ లైన్స్ వెల్లడించింది. అయితే అంతటి సందిగ్ధావస్థలోనూ ఓ వ్యక్తి వీడియోను తీసి సిబ్బందికి అందించడం విశేషం. -
సౌర విద్యుత్తుకు లేదు పౌర మద్దతు
సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖకు ప్రధాన నగరాల నుంచి అందిన దరఖాస్తులు వేలల్లో... తడిసి మోపెడవుతున్న విద్యుత్ బిల్లులతో విసిగి వేసారిపోతున్న హైదరాబాద్ వాసులకు తమ భవంతులపై సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ప్యానల్స్ అమర్చుకోవడం ద్వారా చౌక విద్యుత్‌ను వాడుకోవచ్చన్న ప్రచారం పెద్ద ఆసక్తినే రేపింది. అయితే, సోలార్ ప్యానల్స్‌కు అయ్యే ఖర్చు భారీగా ఉండటంతో ఔత్సాహికులు నీరుగారి పోయారు. ఈ పరికరాలు అందుబాటులోకి వచ్చి ఏళ్లు దాటింది. కేంద్రం మాత్రం రెండేళ్ల క్రితం దీనిని ఓ విధానంగా ప్రకటించి సబ్సిడీ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ రెండేళ్లలో హైదరాబాద్‌లో ఒక్కరు కూడా తమ భవంతిపై సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ముందుకు రాలేదు. సోలార్ ప్యానల్స్ అమర్చడానికి కనిష్టంగా రూ.3.25 లక్షలు, గరిష్టంగా 5.75 లక్షలు ఖర్చు అవుతుంది. దేశంలోనే ఐదో అతి పెద్ద నగరమైన హైదరాబాద్‌లో సంపన్నులకు కొదవ లేదు. ఇటీవలే నిర్వహించిన ఓ సర్వే ప్రకారం పెద్ద నగరాల్లో నివసిస్తున్న సంపన్నుల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. అలాంటిది సంపన్నులే ముందుకు రాకపోవడంతో మధ్యతరగతి వారూ సోలార్ విద్యుత్‌కు ఆసక్తి చూపడం లేదు. ‘ఇది ఖరీదైన వ్యవహారమే. అందువల్లే కేంద్రం సబ్సిడీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోతే ఈ విధానం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అంత తేలికైన వ్యవహారం కాద’ని సోలార్ విద్యుత్ పరికరాల తయారీలో పేరుగాంచిన సంస్థ ప్రతినిధి చెప్పారు. ముందుకు రాని అపార్టుమెంట్లు.. హైదరాబాద్‌లో కొద్ది మంది ధనవంతులు, బహుళ అంతస్తుల అపార్టుమెంట్లు అసోసియేషన్ల ప్రతినిధులను కలిసి వారి భవంతులపై సోలార్ విద్యుత్ ప్యానళ్ల ఏర్పాటుపై ఓ సంస్థ ప్రతినిధులు చర్చించారు. ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా పరికరాల ఖరీదులో 15 శాతం తగ్గించేందుకు అంగీకరించారు. అయితే, ఏ ఒక్కరూ ముందుకు రాలేదనీ, ప్యానల్స్ అమర్చుకోవడం, విద్యుత్ తయారీ, వినియోగం, బదిలీ వంటి అంశాల్లో అనుమానాలు ఉండటమే దీనికి కారణమనీ ఆ సంస్థ ప్రతినిధి వివరించారు. కేంద్రం ఈ విధానాన్ని అమలు చేసినప్పుడు హైదరాబాద్ సహా ఉమ్మడి రాష్ట్రంలోని (విభజనకు ముందు) అన్ని పట్టణాల్లో భవంతులపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు కొంత ప్రయత్నం చేసినా ఆ తరువాత అది మరుగున పడింది. ఇప్పుడు సోలార్ ప్యానల్స్ తయారీ సంస్థలు రంగంలోకి దిగి కొద్ది మందిని ఒప్పించినా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఓ విధానాన్ని ప్రకటించకపోవడంతో నీరు గారుతోంది. 2022 నాటికి 40 వేల మెగావాట్లు నగరాలు, పట్టణాల్లో భవంతులపై సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ పెద్ద ప్రణాళికనే రూపొందించింది. 2022 నాటికి భవంతులపై సోలార్ విద్యుత్ పరికరాలను అమర్చడం ద్వారా 40 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, ఇప్పటికీ ఆ శాఖకు దేశవ్యాప్తంగా వచ్చిన ప్రతిపాదనల మొత్తం 358 మెగావాట్లకు మాత్రమే. అందులో 42 మెగావాట్ల విద్యుత్‌కు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. వీటిలో అత్యధికం దేశ వాణిజ్య రాజధాని ముంబైకి చెందినవే. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నుంచి దరఖాస్తులు ఉన్నాయి. అయితే హైదరాబాద్ నుంచి ఒక్క ప్రతిపాదన కూడా రాలేదు. ‘ఆసక్తి ఉన్న వాళ్లు కొద్ది మంది వచ్చి అడిగితే వివరాలు ఇచ్చాము. ఎందుకో వారు మళ్లీ రాలేదు’ అని ఇంధన శాఖ అధికారి ఒకరు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా హైదరాబాద్‌లో 288 మంది తమ భవంతులపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్నారు. అవి పాక్షిక అవసరాలకు ఉద్దేశించినవి మాత్రమేనని ఆ అధికారి చెప్పారు. పెరుగుతున్న విద్యుత్ బిల్లులకు విరుగుడు ఇదే నివాస, వాణిజ్య భవనాలపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుంటే ఏటేటా పెరుగుతున్న విద్యుత్ బిల్లులో సగమైనా తగ్గించుకునేందుకు వీలు కలుగుతుందని నిపుణులు అంటున్నారు. మరీ ముఖ్యంగా వాణిజ్య సముదాయాలపై ఇది మంచి ఫలితాలను ఇస్తుందని చెపుతున్నారు. ఒక ప్రైవేట్ సర్వే వెల్లడించిన సమాచారం మేరకు హైదరాబాద్‌లో రమారమి 48 వేల భవనాలు సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయి. వీటిలో 85 శాతం మంది మధ్యతరగతి వర్గానికి చెందిన వారే. సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడానికి కేంద్రం సబ్సిడీ ఇస్తుందన్న సంగతి వారిలో అత్యధికులకు తెలియదు. అయితే, కేంద్రం నేరుగా వచ్చే దరఖాస్తులను స్వీకరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు స్పాన్సర్ చేస్తేనే వాటిని పరిశీలనకు తీసుకుని సబ్సిడీ ఇస్తారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దీనిని పట్టించుకోని ఫలితంగా కేంద్ర సబ్సిడీ కోసం ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సరైన ప్రచారం జరగని విషయం వాస్తవమని సంబంధిత అధికారి ఒకరు అంగీకరించారు. పెద్ద పెద్ద నగరాలు, పట్టణాల్లో భవంతులపై సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ పెద్ద ప్రణాళికనే రూపొందించింది. 2022 నాటికి భవంతులపై సోలార్ విద్యుత్ పరికరాలను అమర్చడం ద్వారా 40 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ నగరంలో రమారమి 48 వేల భవనాలు సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయి. వీటిలో 85 శాతం మంది మధ్యతరగతి వర్గానికి చెందిన వారే. ►భవంతులపై సోలార్ ప్యానల్స్ అమర్చడానికి కనిష్టంగా రూ.3.25 లక్షలు, గరిష్టంగా 5.75 లక్షలు ఖర్చు అవుతుంది. ►ఈ రెండేళ్లలో హైదరాబాద్‌లో ఒక్కరు కూడా తమ భవంతిపై సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ముందుకు రాలేదు. ►సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్న సంగతి అత్యధికులకు తెలియదు.