gopavaram
-
దారుణం: యువతిపై అత్యాచారం.. ఆపై పెట్రోల్ పోసి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా గోపవరం అటవీ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. అడవిలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి హత్యాయత్నం చేశారు. అయితే మంటల్లో కాలుతూ యువతి కేకలు వేయడంతో గమనించిన స్థానికులు.. ఆమెను కాపాడారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువతిని కడప రిమ్స్‌కు తరలించారు.యువతికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా తనకు మాయ మాటలు చెప్పి తన ఇంటి సమీపంలో ఉన్న విగ్నేష్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. మూడు నెలల క్రితమే విఘ్నేష్‌కు వివాహం జరిగిందని, అతని భార్య గర్భిణీగా పేర్కొంది. దీంతో పోలీసులు నిందితుడు విఘ్నేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
మాకు ఉద్యోగాలొచ్చాయ్...ఏపీకి తరలివస్తున్న ప్రముఖ కంపెనీలు
-
ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..
-
వేగంగా ‘సెంచురీ ప్యానల్స్’ నిర్మాణ పనులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా గోపవరం వద్ద 482 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న సెంచురీ ప్యానల్స్ తయారీ యూనిట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ యూనిట్ ఏర్పాటుకు పర్యావరణ, అటవీ అనుమతులు మంజూరు కావడంతో సెంచురీ ఫ్లై సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించింది. సుమారు రూ.1,600 కోట్లతో ఏర్పాటుచేస్తున్న ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 2,000 మందికి పరోక్షంగా 4,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2021, డిసెంబర్ 24న భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఈ యూనిట్ తొలి దశ పనులను 2024 డిసెంబర్ నాటికి పూర్తిచేసి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలుత తమిళనాడులో ఈ యూనిట్‌ను నెలకొల్పాలని భావించామని, కానీ ఏపీ ప్రభుత్వం వేగంగా అనుమతులు మంజూరు చేస్తుండటంతో గోపవరం వద్ద ఏర్పాటుచేస్తున్నట్లు సెంచురీ ప్లై చైర్మన్ సజ్జన్ భజాంకా శంకుస్థాపన సమయంలో ప్రకటించారు. తొలుత రూ.600 కోట్లతో యూనిట్ ఏర్పాటుచేయాలని భావించామని, కానీ ఇప్పుడు రూ.1,600 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన గోపవరం వద్ద ఈ యూనిట్ ఏర్పాటు వల్ల కలప ఆధారిత అనుబంధ పరిశ్రమలు మరిన్ని వస్తాయని, తద్వారా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: మరోసారి అలజడికి టీడీపీ నేతల యత్నం -
శరవేగంగా సెంచురీ ప్లైబోర్డ్స్ పరిశ్రమ పనులు
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలోని గోపవరం వద్ద ఏర్పాటు చేస్తున్న సెంచురీ ప్లైబోర్డ్స్ పరిశ్రమ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2021 డిసెంబరు 23న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఈ పరిశ్రమకు శంకుస్థాపన చేయగా, 2023 ఏప్రిల్ నాటికి పరిశ్రమ మొదటిదశ నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. తర్వాత అదే ఏడాది అక్టోబరు నాటికి రెండవ దశ పనులు సైతం పూర్తి చేసి ఉత్పత్తులను ప్రారంభించనున్నారు. 589.23 ఎకరాల్లో బద్వేలు నియోజకవర్గంలోని కృష్ణపట్నం–బళ్లారి ప్రధాన రహదారిలో గోపవరం వద్ద రూ. 956 కోట్లతో సెంచురీ ప్లైబోర్డ్స్ పరిశ్రమను నెలకొల్పుతున్నారు. ఈ పరిశ్రమలో ఎండీఎఫ్ (మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్స్), హెచ్పీఎల్ (హై ప్రెజర్ ల్యామినేట్స్) ఉత్పత్తులను తయారు చేయనున్నారు. సుబాబుల్, జామాయిల్, సర్వి తదితర కర్ర ద్వారా ఈ ఉత్పత్తులను ఉత్పత్తి చేయనున్నారు. పరిశ్రమను ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ జిల్లా, నెల్లూరు జిల్లాల సరిహద్దుతోపాటు అటు ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో జామాయిల్, సుబాబుల్, సర్వి కర్రను రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో జామాయిల్ సాగు ఉండగా, 30 వేల ఎకరాల్లో సుబాబుల్ కర్ర సాగు ఉంది. వైఎస్సార్ జిల్లాలో 30 వేల ఎకరాలకు పైగా సుబాబుల్, జామాయిల్ సాగు ఉంది. నెల్లూరు జిల్లాలో 60 వేల ఎకరాల్లో సుబాబుల్, జామాయిల్‌ను రైతులు సాగు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోనూ 20 వేల ఎకరాల్లో సాగు ఉంది. దీంతోపాటు పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లో లక్షా 21 వేల ఎకరాల్లో జామాయిల్‌ను సాగు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒక్క శ్రీకాళహిస్తిలో గ్రీన్ ప్లైవుడ్‌కు సంబంధించి చిన్న పరిశ్రమ ఉండగా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు వద్ద మరో చిన్న పరిశ్రమ మాత్రమే ఉంది. పై ఆరు జిల్లాల్లో సాగవుతున్న జామాయిల్, సుబాబుల్ కర్ర వినియోగానికి ఈ పరిశ్రమల స్థాయి సరిపోవడం లేదు. దీంతో రాజమండ్రి వద్ద ఉన్న ఏపీ పేపర్ మిల్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లోని మిల్లులకు ఈ ప్రాంతాల నుంచి కర్ర తరలించాల్సి వస్తోంది. డిమాండ్ లేకపోవడంతో రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. దీంతో ఏడాదికేడాదికి జామాయిల్, సుబాబుల్ సాగును రైతులు తగ్గిస్తున్నారు. గోపవరం వద్ద భారీ పరిశ్రమ ఏర్పాటు అవుతుండడంతో ఆరు జిల్లాల పరిధిలో సాగవుతున్న కర్రను స్థానికంగానే వినియోగించుకునే అవకాశం కలగనుంది. దీంతో రైతులకు గిట్టుబాటు ధర కూడా లభించనుంది. రోజుకు 4 వేల టన్నుల కర్ర వినియోగం ఈ సెంచురీ ప్లైబోర్డ్స్ పరిశ్రమకు మొదటి ఫేజ్‌లో ప్రతిరోజు 2 వేల టన్నుల కర్ర అవసరం కాగా, రెండవ ఫేజ్ నాటికి 4 వేల టన్నుల కర్ర అవసరమవుతుంది. ఈ ప్రాంతంలో కర్రసాగు అధికంగా ఉండడంతో యాజమాన్యం ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పరిశ్రమల ఏర్పాటుతో 2266 మంది చదువుకున్న నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించనున్నారు. దీంతోపాటు కర్రసాగు ద్వారా దాదాపు 10 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఇప్పటికే 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశ్రమను నిర్మిస్తుండగా, పరిశ్రమ నిర్మాణానికి సంబంధించి 30 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. పరిశ్రమకు విద్యుత్, నీటి సరఫరా పనులకు సంబంధించి టెండర్లు పూర్తి కాగా, ఇప్పటికే పనులు మొదలయ్యాయి. వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ పనులన్నీ పూర్తి కానున్నాయి. ఏప్రిల్ నాటికి మొదటి దశ పనులు సెంచురీ ప్లైబోర్డ్స్ పరిశ్రమ పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. విద్యుత్, నీటి సరఫరాకు సంబంధించిన పనులను ఏపీఐఐసీ మరింత వేగంగా చేపట్టింది. వచ్చే ఏప్రిల్ నాటికి మొదటి ఫేజ్ పనులను పూర్తి చేయబోతున్నాం. పనులు పూర్తయిన వెంటనే ఉత్పత్తులు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత అక్టోబరు నాటికి రెండవ ఫేజ్ పనులు పూర్తవుతాయి. – రమేష్‌కుమార్‌రెడ్డి, జీఎం, సెంచురీ ప్లైబోర్డ్స్ సీఎం చొరవతో పరిశ్రమ ఏర్పాటు వెనుకబడిన బద్వేలు ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ చూపించి కృషి చేస్తున్నారు. ఇప్పటికే బ్రహ్మంసాగర్ ద్వారా నియోజకవర్గంలోని మొత్తం ఆయకట్టుకు సాగునీటితోపాటు ప్రజలకు తాగునీటిని అందిస్తున్న ముఖ్యమంత్రి గోపవరం వద్ద పరిశ్రమను నెలకొల్పి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా సంతోషదాయకం. – డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ పరిశ్రమ ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గోపవరం వద్ద పరిశ్రమ ఏర్పాటు చేయడంతో నియోజకవర్గ వ్యాప్తంగా చదువుకున్న యువతకు ఉద్యోగాలు లభించడమే కాకుండా వేలాది మంది రైతులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ పరిశ్రమతో జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో సుబాబుల్, జామాయిల్ కర్ర సాగు చేస్తున్న రైతులకు స్థానికంగానే గిట్టుబాటు ధర లభించనుంది. – డాక్టర్ దాసరి సుధ, ఎమ్మెల్యే, బద్వేలు -
లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
గోపవరం: మండలంలోని పి.పి.కుంట సమీపంలో నెల్లూరు– ముంబై (ఎన్‌హెచ్–67) జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది, ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. బళ్లారి నుంచి నెల్లూరు వెళుతున్న పీఎస్ఆర్ ప్రైవేటు ట్రావెల్స్æ బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొట్టడంతో బస్సు నుజ్జునుజ్జయింది. బస్సు ముందు భాగంలో ఉన్న రాజస్థాన్‌కు చెందిన సురేకుమార్(30) అనే వ్యక్తి అదుపు తప్పి కిందపడటంతో టైరు ఎక్కి అక్కడికక్కడే మృతి చెందాడు. రాజస్థాన్‌కు చెందిన జగదీ‹Ù, మల్లికార్జున, వాకాడుకు చెందిన పద్మావతి, కుసుమ, అనంతపురానికి చెందిన విజయబాబులు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది గాయపడిన వారిని బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు అతివేగంగా వెళుతుండటం, డ్రైవర్ నిద్రలోకి జారడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి పరారయ్యారు. మరో రెండు నిమిషాల్లో గమ్యం చేరేలోపే.. కాగా మృతి చెందిన సురేకుమార్ పి.పి.కుంట వద్ద గాలిమిషన్‌లో కూలీ పని చేసుకుంటున్నారు. ఇటీవల స్వగ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా మరో రెండు నిమిషాల్లో పి.పి.కుంట స్టేజీ వద్ద దిగేందుకు పుట్‌బోర్డు మీదకు చేరుకున్న సురేకుమార్ ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో కిందపడి బస్సు టైరు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బద్వేలు రూరల్ ఏఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని టైరు కింద ఇరుక్కుపోయిన మృతదేహాన్ని బయటికి తీశారు. బస్సు ఢీకొన్న లారీ సిమెంట్ లోడుతో వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే లారీ మాత్రం ఆగకుండా వెళ్లిపోయింది. సురేష్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిరుపయోగంగా మొల్ల హరిత రెస్టారెంట్
గోపవరం : మండల కాంప్లెక్స్ సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి మొల్ల హరిత రెస్టారెంట్ ఏడాదన్నర కాలం నుంచి నిరుపయోగంగా ఉంది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొల్ల జన్మస్థలమైన గోపవరంను అన్నివిధాలా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మొట్టమొదట రూ.1.17 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఆ నిధులతో జాతీయ రహదారి పక్కనే మొల్ల పేరుతో హరిత రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మొల్ల అభివృద్ధి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. హరిత రెస్టారెంట్‌ను స్వయంగా పర్యాటకశాఖ కొనసాగిస్తూ వచ్చారు. 2015 డిసెంబర్లో విశాఖపట్నంకు చెందిన కాంట్రాక్టర్ టెండర్ ద్వారా హరిత రెస్టారెంట్‌ను లీజుకు తీసుకోవడం జరిగింది. దీంతో ఉన్నఫలంగా గతేడాది జనవరిలో పర్యాటకశాఖ హోటల్‌ను ఖాళీ చేశారు. అయితే టెండర్ ద్వారా లీజుకు దక్కించుకున్నవారు ఇప్పటి వరకూ రాకపోవడంతో హరిత హోటల్ నిరుపయోగంగా ఉంది. ఏ కారణం చేత లీజుకు తీసుకున్నవారు హోటల్‌ను ప్రారంభించలేదన్న దిశగా పర్యాటకశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో రెస్టారెంట్ మూతపడే ఉంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి భవనాన్ని నిరుపయోగంగా వదిలివేయడంతో క్రమేనా శిథిలావస్థకు చేరుకునే అవకాశం లేకపోలేదు. గతంలో ప్రవేశపెట్టిన టెండర్‌ను రద్దు చేసి తిరిగి టెండర్ ద్వారా హరిత హోటల్‌ను లీజుకు ఇచ్చి కొనసాగించాలని మండల ప్రజలు కోరుతున్నారు. కాగా ఇదే అంశంపై ఇటీవల మొల్ల సాహితీపీఠం అధ్యక్షుడు విద్వాన్ గానుగపెంట హనుమంతరావు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లాడు. ఆ హోటల్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే మొల్ల జన్మస్థలమైన గోపవరంను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ద్వారా నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
మోస్ట్‌వాంటెడ్ స్మగ్లర్ అరెస్ట్
బద్వేలు అర్బన్: పోరుమామిళ్ల మండలం రేపల్లె గ్రామానికి చెందిన చవ్వా రమణారెడ్డి అనే మోస్ట్‌వాంటెడ్ స్మగ్లర్‌ను అరెస్ట్ చేసినట్లు మైదుకూరు డీఎస్పీ బి.ఆర్.విజయ్‌కుమార్ తెలిపారు. ఆదివారం స్థానిక సర్కిల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గత నెల 13వ తేదీన గోపవరం మండలం లక్కవారిపల్లె గ్రామ సమీపంలోని కట్టెల వరువ కాలువ అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న విషయం తెలుసుకుని సీఐ, రూరల్ ఎస్ఐలు తమ సిబ్బందితో వెళ్లి దాడులు చేసిన సమయంలో ఎం.శ్రీను మొఘల్ నాయబ్‌లు పట్టుబడగా రమణారెడ్డి పోలీసులపై గొడ్డళ్లు, రాళ్లు రువ్వుతూ పారిపోయాడు. ఈ క్రమంలో ఆదివారం గోపవరం మండలంలోని కాలువపల్లె గ్రామానికి వెళ్లే ఆర్చివద్ద రమణారెడ్డి ఉన్నట్లు సమాచారం రావడంతో వెళ్లి అరెస్టు చేసినట్లు తెలిపారు. అతన్ని విచారించగా గోపవరం మండల పరిధిలో లక్కవారిపల్లె గ్రామ సమీపంలో గల తెలుగుగంగ కాలువ వద్ద ఎర్రచందనం దుంగలు దాచి ఉంచినట్లు తెలపడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితునిపై పోరుమామిళ్ల స్టేషన్లో ఐదు కేసులు, పోరుమామిళ్ల ఫారెస్టు రేంజ్లో రెండు కేసులు , బద్వేలు ఫారెస్టు రేంజ్లో ఐదు కేసులు , బి.కోడూరు పోలీసు స్టేషన్లో రెండు కేసులు, బద్వేలు అర్బన్ స్టేషన్లో ఒక కేసు చొప్పున 15 కేసులు ఉన్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా 2015లో పోరుమామిళ్ల పోలీసులు ఇతనిపై పీడీయాక్ట్ కూడా పెట్టగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండి తిరిగి వచ్చిన తర్వాత కూడా కూలీల సహాయంతో ఎర్రచందనం చెట్లను నరికించి అంతర్జాతీయ స్మగ్లర్లకు అందజేస్తుండేవాడని విచారణలో తేలిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ రామాంజినాయక్, రూరల్ ఎస్ఐ నరసింహారెడ్డి, హెడ్‌కానిస్టేబుళ్లు మూర్తి, చెంచురామయ్య, ఫారెస్టు బీట్ ఆఫీసర్ రమణయ్య, ఏబీవో కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి ట్రాక్టర్‌కు ప్రమాదం
పెంచలకోనకు వెళుతుండగా మార్గమధ్యంలో ఘటన పెళ్లి కుమార్తె సహా 22 మందికి స్వల్ప గాయాలు గోపవరం: కడప–నెల్లూరు సరిహద్దులో గురువారం తెల్లవారుజామున పెళ్లి బృందంతో వెళుతున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న పెళ్లి కుమార్తె సహా 22 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురు తీవ్రంగా గాయపడటంతో కడప రిమ్స్‌కు, ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. బద్వేలు మండలం పుట్టాయపల్లె దళితవాడకు చెందిన కాసుల మల్లేశ్వరమ్మ కుమార్తె నాగవేణి వివాహం నెల్లూరు జిల్లా పెంచలకోన నరసింహస్వామి సన్నిధిలో గురువారం ఉదయం జరగాల్సి ఉండింది. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో పెళ్లి కుమార్తె సహా దళితవాడకు చెందిన సుమారు 30 మంది ట్రాక్టర్లో పెంచలకోనకు బయలుదేరారు. అయితే గోపవరం మండలం పీ.పీ.కుంట దాటిన తర్వాత జిల్లా సరిహద్దుకు సమీపంలో డ్రైవర్ ట్రాక్టర్‌ను అతివేగంగా నడుపుతుండగా ముందున్న మోరీని గమనించకపోవడంతో ఒక్కసారిగా పెద్దగోతిలోకి దిగిపోయింది. అసలే అర్ధరాత్రి సమయం కావడం, ప్రమాదం జరిగిన చోటు అటవీ ప్రాంతం కావడంతో చెట్లు తగిలి కొంత మంది గాయపడగా మరికొందరు ఒకరిపై ఒకరు పడటంతో స్వల్పంగా గాయపడ్డారు. పెళ్లి కుమార్తె సహా 22 మంది గాయపడగా వీరిలో 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని బద్వేలు సీమాంక్ ఆసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన వారు స్వగ్రామానికి వెళ్లి పోయారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని కడప రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌కు తరలించిన వారిలో కొండయ్య, రామయ్య, నరసింహ, డ్రైవర్ సుబ్బరాయుడు తదితరులు ఉన్నారు. కాగా ట్రాక్టర్ బోల్తాపడి ఉంటే పెద్ద ప్రాణనష్టం జరిగి ఉండేది. కాగా పెళ్లి కుమార్తెను మరొక వాహనంలో పెంచలకోనకు తీసుకెళ్లి అనుకున్న సమయానికన్నా ఆలస్యంగా వివాహం జరిపించినట్లు సమాచారం. బద్వేలు రూరల్ ఎస్ఐ నరసింహారెడ్డి కేసు నమోదు చేశారు. -
లైంగికదాడి కేసులో నిందితుడి అరెస్టు
ఉప్పలగుప్తం : బాలికపై లైంగిక దాడికి పాల్పడి, గర్భవతిని చేసిన కేసులో నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సొంత మేనమామే ఆమెను గర్భవతిని చేసినట్టు పోలీసులు గుర్తించారు. అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్య కథనం ప్రకారం.. గోపవరానికి చెందిన షేక్ మస్తాన్‌సాహెబ్ తన భార్య చనిపోవడంతో తల్లి ఇంటి వద్ద ఉంటున్నాడు. అదే గ్రామంలో మస్తాన్‌సాహెబ్ సోదరి ఉంటోంది. ఆమె కుమార్తె 14 ఏళ్ల బాలిక స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇటీవల బాలికకు నలతగా ఉండడంతో, కుటుంబ సభ్యులు అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చూపించారు. బాలికకు పరీక్షలు చేసిన వైద్యులు ఆమె ఆరు నెలల గర్భిణి అని ధ్రువీకరించారు. మేనమామ మస్తాన్‌సాహెబ్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు బాలిక చెప్పడంతో, ఈ నెల రెండున పోలీసులు కేసు నమోదు చేశారు. -
కుటుంబ కలహాలతో యువకుని ఆత్మహత్య
నూజివీడు : కృష్ణా జిల్లా ముసునూరు మండలం గోపవరం గ్రామంలో కుటుంబ కలహాలతో ఎం.రవి (20) అనే యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రుణమే మృత్యుపాశమై..
గోపవరం (ఉప్పలగుప్తం) :పదిమంది ఆకలిని తీర్చే తిండిగింజల్ని పండించేందుకు చేసిన అప్పే ఆ అన్నదాత పాలిట మృత్యుపాశమైంది. చీడపీడలు, సాగునీటి ఎద్దడితో.. ఆరుగాలం శ్రమపడి పండించిన పంట చేతికి వస్తుందో రాదోనన్న బెంగ అతడిని కృంగదీసింది. సాగు పెట్టుబడికి, కుటుంబ అవసరాలకు చేసిన అప్పులు తీర్చే దారి కానరాలేదు. ఈ పరిస్థితుల్లో తీరని మనోవ్యథకు గురైన అతడు బలవన్మరణమే శరణమనుకొని.. పురుగుల మందు తాగి తనువు చాలించాడు. ఉప్పలగుప్తం మండలం గోపవరం గ్రామంలో జరిగిన ఈ సంఘటన పలువురిని కలచివేసింది. ఆ కుటుంబంలో తీరని వేదనను మిగిల్చింది. గ్రామానికి చెందిన ఆకుల కృష్ణమూర్తి (49) వ్యవసాయ కూలీగా, కొబ్బరి ఒలుపు కార్మికుడిగా పని చేస్తూ, రెండెకరాల్లో కౌలు వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయ పెట్టుబడులతోపాటు కుటుంబ అవసరాలకు సుమారు రూ.లక్షకు పైగా అప్పు చేశాడు. ప్రతిసారీ పంట చేతికి వచ్చే దశలో తెగుళ్లు సోకడం, ఏదో ఒక నష్టం రావడంతో ఆశించిన దిగుబడి రాక వరుస నష్టాలు చవి చూస్తున్నాడు. మరోపక్క అప్పు వడ్డీల రూపంలో పెరిగిపోతోంది. రుణమాఫీలో బ్యాంకులో ఉన్న రూ.49 వేలు మాఫీ అయినప్పటికీ.. బయట తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. ప్రతిసారీ పంట దిగుబడి వచ్చిన తరువాత అప్పులు తీర్చాలనుకున్నా పరిస్థితులు కలసి రాలేదు. దీంతో ఎదిగిన పిల్లలకు పెళ్లిళ్లు చేయడం కృష్ణమూర్తికి తలకు మించిన భారంగా మారింది. అయినప్పటికీ అందరికీ పెళ్లిళ్లు చేశాడు. కుమార్తెలు అత్తారింటికి వెళ్లినా వారి మంచిచెడ్డలు చూడటం అతడికి కష్టమైంది. పెళ్లిళ్లు కావడంతో కుమారుల సంపాదన వారి కుటుంబ పోషణకే సరిపోయేది. ఈ పరిస్థితుల్లో చేసిన అప్పు తీర్చే దారి కానరాక కృష్ణమూర్తి ఆందోళనకు గురయ్యాడు. రెక్కాడితేనే కానీ డొక్కాడని పరిస్థితి కావడంతో ప్రతి రోజూ పనికి వెళ్లేవాడు. అయినప్పటికీ ఆత్మస్థైర్యం దెబ్బ తినడంతో మానసికంగా కృంగిపోయాడని కుటుంబ సభ్యులు కన్నీళ్లతో చెప్పారు. ఈ నేపథ్యంలో అతడు సోమవారం పురుగుల మందు తాగాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కృష్ణమూర్తిని కుటుంబ సభ్యులు అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మంగళవారం మృతి చెందాడు. అతడికి భార్య భాగ్యలక్ష్మి, ఇద్దరు కుమారులు నాగరాజు, గంగాధరరావు, ఇద్దరు కుమార్తెలు పార్వతీదేవి, దుర్గానాగలక్ష్మి ఉన్నారు. ఆర్థిక సమస్యలతో కుటుంబ పోషణ భారం కావడంతో తన భర్త సతమతమయ్యాడని విలపించింది. కుటుంబంలోని వారంతా వ్యవసాయ కూలీలుగా ఉన్నా తమ బతుకుల్లో మార్పు రాలేదని, మనోనిబ్బరం కోల్పోయిన భర్త క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో తమకు దూరమైపోయారని భార్య భాగ్యలక్ష్మి బోరున విలపించింది. కృష్ణమూర్తి కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు ఏఎస్సై ఎన్.నాగేశ్వరరావు కేసు నమోదు చేశారు. వీఆర్ఓ సత్యనారాయణ శవపంచనామా చేసి, మృతదేహానికి అమలాపురం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిపించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మండల రైతుసంఘ ప్రధాన కార్యదర్శి అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, తదితర నాయకులు, గోపవరం సర్పంచ్ అయితాబత్తుల జయ, ఎంపీటీసీ సభ్యురాలు కొంకి లక్ష్మి, ఉప సర్పంచ్ ఆకుల వెంకట రమణలు కృష్ణమూర్తి మృతదేహాన్ని సందర్శించారు. మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు. -
కన్నబిడ్డతో సహా కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది
గోపవరం (నిడదవోలు రూరల్), న్యూస్‌లైన్ : నవమాసాలు మోసి కన్న బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ తల్లికి జ్యోతిష్యుడు చెప్పిన మాటలు తల్లడిల్లేలా చేశాయి. బిడ్డ నష్టజాతకుడని, కుటుంబ సభ్యులకు అనర్థాలు తప్పవని చెప్పిన మాటలకు తోడు ఆ కుటుంబంలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఆ మాతృమూర్తి హృదయాన్ని కృంగదీశాయి. నష్ట జాతకుడిగా పేరుపడిన బిడ్డతో పాటు తాను కూడా తనువుచాలించాలని నిర్ణయించుకున్న ఆ తల్లి నాలుగేళ్ల కన్నబిడ్డతో సహా కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. కాలువలో కొట్టుకుపోతున్న ఆమెను చూసి స్థానికులు రక్షించగా ఆ బాలుడు గల్లంతయ్యాడు. మానవుడు భూమి నుంచి గ్రహాంతరయానం చేస్తున్న నేటి ఆధునిక యుగంలో జ్యోతిష్యుడి మాటలు విని బిడ్డతో సహా తల్లి ఆత్మహత్యకు యత్నించిన ఈ ఘటన నిడదవోలు మండలం గోపవరం సమీపంలోని మద్దూరు వంతెన వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి ఇన్నీస్‌పేటకు చెందిన దుర్గ (22) అనే మహిళ నాలుగేళ్ల కుమారుడు వర్థన్‌తో కలిసి సోమవారం ఉదయం 7.30 గంటల సమయంలో మద్దూరు వంతెన వద్దకు వచ్చింది. ముందుగా రాసుకున్న సూసైడ్ నోట్‌ను, భర్త మాధవ్, వర్ధన్ కలిసి ఉన్న ఫొటోను, హ్యాండ్ బ్యాగ్‌ను వంతెన మధ్యలో ఉన్న ఖానా వద్ద ఉంచి కుమారుడితో సహా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలోకి దూకేసింది. నీటి ప్రవాహానికి దుర్గ ఒడ్డుకు కొట్టుకురాగా అటువైపు వెళుతున్న ఆటో డ్రైవర్ ప్రసాద్, స్థానికుడు కె.బుజ్జి చూసి ఆమెను రక్షించారు. బాలుడు కాలువలో గల్లంతయ్యాడు. ఘటనాస్థలంలో ఆమె ఉంచిన సూసైడ్‌నోట్‌లోని కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్‌కు స్థానికులు సమాచారం అందించారు. కొద్దిసేపటికే అక్కడకు చేరుకున్న దుర్గ బంధువులు బాలుడి కోసం కాలువలో వెతకకుండానే ఆమెను హడావుడిగా ఆటోలో అక్కడి నుంచి తీసుకువెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్థానికులు తొలుత 108 వాహనానికి సమాచారం అందించగా వాహనం వచ్చే సరికి ఆమెను బంధువులు తీసుకువెళ్లిపోయారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. నష్ట జాతకమేనా.. ఇంకేమైనా ఉందా? కుమారుడు నష్టజాతకుడని జ్యోతిష్యుడు చెప్పడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆమె చెప్పిందని స్థానికులు తెలిపారు. ఆత్మహత్యాయత్నం నుంచి బయటపడిన అనంతరం ప్రశ్నించగా బిడ్డ పెరిగేకొద్దీ మరిన్ని అరిష్టాలు జరుగుతాయని జ్యోతిష్కుడు చెప్పాడని, ఆ ప్రకారమే కుటుంబంలో ఇటీవల రెండు, మూడు ఘటనలు జరగడంతో ఆందోళనకు గురయ్యానని, దీంతో బిడ్డతో సహా చనిపోవాలనుకున్నట్టు చెప్పిందని స్థానికులు తెలిపారు. అయితే ఈ వ్యవహారంలో ఇంకేమైనా కారణాలు కూడా ఉండివచ్చని స్థానికులు, పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజమండ్రి ఇన్నీస్‌పేటకు సిబ్బందిని పంపినట్టు సమిశ్రగూడెం పోలీసులు చెప్పారు.