గోపవరం (ఉప్పలగుప్తం) :పదిమంది ఆకలిని తీర్చే తిండిగింజల్ని పండించేందుకు చేసిన అప్పే ఆ అన్నదాత పాలిట మృత్యుపాశమైంది. చీడపీడలు, సాగునీటి ఎద్దడితో.. ఆరుగాలం శ్రమపడి పండించిన పంట చేతికి వస్తుందో రాదోనన్న బెంగ అతడిని కృంగదీసింది. సాగు పెట్టుబడికి, కుటుంబ అవసరాలకు చేసిన అప్పులు తీర్చే దారి కానరాలేదు. ఈ పరిస్థితుల్లో తీరని మనోవ్యథకు గురైన అతడు బలవన్మరణమే శరణమనుకొని.. పురుగుల మందు తాగి తనువు చాలించాడు. ఉప్పలగుప్తం మండలం గోపవరం గ్రామంలో జరిగిన ఈ సంఘటన పలువురిని కలచివేసింది. ఆ కుటుంబంలో తీరని వేదనను మిగిల్చింది. గ్రామానికి చెందిన ఆకుల కృష్ణమూర్తి (49) వ్యవసాయ కూలీగా, కొబ్బరి ఒలుపు కార్మికుడిగా పని చేస్తూ, రెండెకరాల్లో కౌలు వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయ పెట్టుబడులతోపాటు కుటుంబ అవసరాలకు సుమారు రూ.లక్షకు పైగా అప్పు చేశాడు. ప్రతిసారీ పంట చేతికి వచ్చే దశలో తెగుళ్లు సోకడం, ఏదో ఒక నష్టం రావడంతో ఆశించిన దిగుబడి రాక వరుస నష్టాలు చవి చూస్తున్నాడు.
మరోపక్క అప్పు వడ్డీల రూపంలో పెరిగిపోతోంది. రుణమాఫీలో బ్యాంకులో ఉన్న రూ.49 వేలు మాఫీ అయినప్పటికీ.. బయట తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. ప్రతిసారీ పంట దిగుబడి వచ్చిన తరువాత అప్పులు తీర్చాలనుకున్నా పరిస్థితులు కలసి రాలేదు. దీంతో ఎదిగిన పిల్లలకు పెళ్లిళ్లు చేయడం కృష్ణమూర్తికి తలకు మించిన భారంగా మారింది. అయినప్పటికీ అందరికీ పెళ్లిళ్లు చేశాడు. కుమార్తెలు అత్తారింటికి వెళ్లినా వారి మంచిచెడ్డలు చూడటం అతడికి కష్టమైంది. పెళ్లిళ్లు కావడంతో కుమారుల సంపాదన వారి కుటుంబ పోషణకే సరిపోయేది. ఈ పరిస్థితుల్లో చేసిన అప్పు తీర్చే దారి కానరాక కృష్ణమూర్తి ఆందోళనకు గురయ్యాడు. రెక్కాడితేనే కానీ డొక్కాడని పరిస్థితి కావడంతో ప్రతి రోజూ పనికి వెళ్లేవాడు. అయినప్పటికీ ఆత్మస్థైర్యం దెబ్బ తినడంతో మానసికంగా కృంగిపోయాడని కుటుంబ సభ్యులు కన్నీళ్లతో చెప్పారు. ఈ నేపథ్యంలో అతడు సోమవారం పురుగుల మందు తాగాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కృష్ణమూర్తిని కుటుంబ సభ్యులు అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ అతడు మంగళవారం మృతి చెందాడు. అతడికి భార్య భాగ్యలక్ష్మి, ఇద్దరు కుమారులు నాగరాజు, గంగాధరరావు, ఇద్దరు కుమార్తెలు పార్వతీదేవి, దుర్గానాగలక్ష్మి ఉన్నారు. ఆర్థిక సమస్యలతో కుటుంబ పోషణ భారం కావడంతో తన భర్త సతమతమయ్యాడని విలపించింది. కుటుంబంలోని వారంతా వ్యవసాయ కూలీలుగా ఉన్నా తమ బతుకుల్లో మార్పు రాలేదని, మనోనిబ్బరం కోల్పోయిన భర్త క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో తమకు దూరమైపోయారని భార్య భాగ్యలక్ష్మి బోరున విలపించింది. కృష్ణమూర్తి కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు ఏఎస్సై ఎన్.నాగేశ్వరరావు కేసు నమోదు చేశారు. వీఆర్‌ఓ సత్యనారాయణ శవపంచనామా చేసి, మృతదేహానికి అమలాపురం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిపించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మండల రైతుసంఘ ప్రధాన కార్యదర్శి అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, తదితర నాయకులు, గోపవరం సర్పంచ్ అయితాబత్తుల జయ, ఎంపీటీసీ సభ్యురాలు కొంకి లక్ష్మి, ఉప సర్పంచ్ ఆకుల వెంకట రమణలు కృష్ణమూర్తి మృతదేహాన్ని సందర్శించారు. మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు.
రుణమే మృత్యుపాశమై..
Published Wed, Mar 11 2015 2:49 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
Advertisement