మోస్ట్‌వాంటెడ్ స్మగ్లర్ అరెస్ట్
Published Sun, Feb 19 2017 10:21 PM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM
బద్వేలు అర్బన్: పోరుమామిళ్ల మండలం రేపల్లె గ్రామానికి చెందిన చవ్వా రమణారెడ్డి అనే మోస్ట్‌వాంటెడ్ స్మగ్లర్‌ను అరెస్ట్ చేసినట్లు మైదుకూరు డీఎస్పీ బి.ఆర్.విజయ్‌కుమార్ తెలిపారు. ఆదివారం స్థానిక సర్కిల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గత నెల 13వ తేదీన గోపవరం మండలం లక్కవారిపల్లె గ్రామ సమీపంలోని కట్టెల వరువ కాలువ అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న విషయం తెలుసుకుని సీఐ, రూరల్ ఎస్‌ఐలు తమ సిబ్బందితో వెళ్లి దాడులు చేసిన సమయంలో ఎం.శ్రీను మొఘల్ నాయబ్‌లు పట్టుబడగా రమణారెడ్డి పోలీసులపై గొడ్డళ్లు, రాళ్లు రువ్వుతూ పారిపోయాడు. ఈ క్రమంలో ఆదివారం గోపవరం మండలంలోని కాలువపల్లె గ్రామానికి వెళ్లే ఆర్చివద్ద రమణారెడ్డి ఉన్నట్లు సమాచారం రావడంతో వెళ్లి అరెస్టు చేసినట్లు తెలిపారు. అతన్ని విచారించగా గోపవరం మండల పరిధిలో లక్కవారిపల్లె గ్రామ సమీపంలో గల తెలుగుగంగ కాలువ వద్ద ఎర్రచందనం దుంగలు దాచి ఉంచినట్లు తెలపడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితునిపై పోరుమామిళ్ల స్టేషన్‌లో ఐదు కేసులు, పోరుమామిళ్ల ఫారెస్టు రేంజ్‌లో రెండు కేసులు , బద్వేలు ఫారెస్టు రేంజ్‌లో ఐదు కేసులు , బి.కోడూరు పోలీసు స్టేషన్‌లో రెండు కేసులు, బద్వేలు అర్బన్ స్టేషన్‌లో ఒక కేసు చొప్పున 15 కేసులు ఉన్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా 2015లో పోరుమామిళ్ల పోలీసులు ఇతనిపై పీడీయాక్ట్ కూడా పెట్టగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండి తిరిగి వచ్చిన తర్వాత కూడా కూలీల సహాయంతో ఎర్రచందనం చెట్లను నరికించి అంతర్జాతీయ స్మగ్లర్లకు అందజేస్తుండేవాడని విచారణలో తేలిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ రామాంజినాయక్, రూరల్ ఎస్‌ఐ నరసింహారెడ్డి, హెడ్‌కానిస్టేబుళ్లు మూర్తి, చెంచురామయ్య, ఫారెస్టు బీట్ ఆఫీసర్ రమణయ్య, ఏబీవో కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement