సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తల్లి నూతన శిల్పం తెలంగాణ ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అని చెప్పుకొచ్చారు విగ్రహ శిల్పి రమణా రెడ్డి. ఇదే సమయంలో తెలంగాణ చరిత్ర.. అరుదైన పోరాటాల చరిత్ర అన్నారు. నూతన తెలంగాణ తల్లి.. సాంప్రదాయపు స్త్రీ మూర్తిగా, సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షల స్పూర్తిగా, భరతమాత ముద్దు బిడ్డగా తెలంగాణ భావితరాల విశ్వాస స్ఫూర్తిగా, అందరిని ఆకట్టుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదున్నారు.
తెలంగాణ తల్లి శిల్పి రమణారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజల అస్థిత్వం. తెలంగాణ ప్రజల మాతృమూర్తి. తెలంగాణ చరిత్ర.. అరుదైన పోరాటాల చరిత్ర. దశాబ్దాల పోరు తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో వేలాది అమరుల త్యాగాలతో, సోనియమ్మ ఆశీర్వచనాలతో సాధించింది ప్రత్యేక రాష్ట్రం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు సకల బహుజనులు సాధించిన విజయం. నూతన తెలంగాణ తల్లి రూపకల్పన తెలంగాణ సాంప్రదాయాన్ని, బహుజనుల ఉద్యమ భాగస్వామ్యాన్ని, పోరాట స్ఫూర్తిని వ్యక్తపరుస్తుంది.
పూర్వ తెలంగాణ తల్లి రాచరికపు హావభావాలు, వాస్తవ ప్రజానీక సంస్కృతికి భిన్నంగా, ధనిక స్త్రీగా చిత్రీకరించడం జరిగింది. ఈ కారణంగా చాలామంది ప్రజల మన్ననలు పొందలేక పోయిందనడంలో అతిశయోక్తి లేదు. ఒక దేవతామూర్తికి, మాతృమూర్తికి ఎంత వ్యత్యాసం ఉంది. సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక తెలంగాణ తల్లి. బోనాలు, బతుకమ్మ, సమక్క సారలమ్మ, సదర్ పండుగలతో, విశిష్ట శిల్ప సంపదలతో, చేతివృత్తులు, చేనేత ప్రతిభలతో విరజిమ్ము తన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.
నూతన తెలంగాణ తల్లి సాంప్రదాయపు స్త్రీ మూర్తిగా, సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షల స్పూర్తిగా, భరతమాత ముద్దు బిడ్డగా తెలంగాణ భావితరాల విశ్వాస స్ఫూర్తిగా, అందరిని ఆకట్టుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. మొదటి తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన చేసింది కూడా ఫ్రొఫెసర్ గంగాధర్. నాటి ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకే అప్పటి తెలంగాణ తల్లి రూపకల్పన జరిగింది’ అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment