సాక్షి, విశాఖపట్నం: భారత్‌లో పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు లక్ష్యం (రెన్యువబుల్ పవర్ ఆబ్లిగేషన్ (ఆర్‌పీవో))లో 2021–22 నాటికి దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని నెడ్‌క్యాప్ వైస్ చైర్మన్, ఎండీ రమణారెడ్డి తెలిపారు. కర్ణాటక 41.3 శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. 28.5 శాతంతో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ 2021–22 నాటికి ఆర్‌పీవో లక్ష్యాన్ని 21.18 శాతంగా నిర్దేశించగా ఏపీ దాన్ని అధిగవిుంచిందని వివరించారు.
ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), నెడ్‌క్యాప్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్‌లో క్లీన్ గ్రోత్ డ్రైవింగ్ పోర్ట్, ఎనర్జీ ఇంటెన్సివ్‌లో క్లీన్ ఇన్వెస్ట్‌మెంట్, కర్బన ఉద్గారాల నియంత్రణలో పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధన పరిశ్రమల పాత్ర’ అనే అంశంపై శనివారం విశాఖలో సదస్సు జరిగింది. ఇందులో రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 9,008.78 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు.
ఈ రంగంలో దేశంలో ఐదో స్థానంలో నిలిచామని వివరించారు. ఇందులో సోలార్ పవర్ 38.50 గిగావాట్లు కాగా విండ్ పవర్ 44 గిగావాట్లు ఉందని తెలిపారు. దీంతోపాటు వేస్ట్ టు ఎనర్జీ కింద 36.15 మెగావాట్లు, పారిశ్రామిక వ్యర్థాల నుంచి 40.97 మెగావాట్లు, చిన్న హైడ్రో ప్రాజెక్టుల నుంచి 106.80 మెగావాట్లు ఉత్పత్తి అవుతోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పాలసీ దేశానికే ఆదర్శం..
2020లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచి్చన పునరుత్పాదక విద్యుత్ ఎగుమతుల పాలసీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రమణారెడ్డి తెలిపారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల విషయంలోనూ రాష్ట్రం 37 శాతంతో దేశంలో అగ్రగామిగా ఉందన్నారు. దేశంలో ప్రస్తుతం 4,745.60 మెగావాట్ల సామర్థ్యంతో 8 ప్రాజెక్టులు నడుస్తున్నాయని చెప్పారు. మరో 3,260 మెగావాట్ల సామర్థ్యంతో 4 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు.
అలాగే 2,350 మెగావాట్లతో 2 ప్రాజెక్టులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) దశలో, 59,357 మెగావాట్లతో 47 ప్రాజెక్టులు సర్వే దశలో ఉన్నాయని వివరించారు. ఈ మొత్తం 61 ప్రాజెక్టుల్లో 26,050 మెగావాట్ల సామర్థ్యంతో 23 ప్రాజెక్టులు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయని తెలిపారు. పంప్డ్ హైడ్రో ఎలక్ట్రికల్ స్టోరేజ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు.
21 ప్రాంతాల్లో 16.18 గిగావాట్ల ఉత్పత్తికి, 37 ప్రాంతాల్లో 42.02 గిగావాట్ల ఉత్పత్తికి పీఎస్‌పీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రం పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టులకు పూర్తి అనుకూలంగా ఉందన్నారు.
కర్బన ఉద్గారాల నియంత్రణకు భారత్ నడుం బిగించింది..
ఈ సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి డా.యువరాజ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రారంభించిన మిషన్ లైఫ్ కార్యక్రమం ద్వారా విద్యుత్ రంగంలో 51.3 శాతం, రవాణా రంగంలో 13.2 శాతం కర్బన ఉద్గారాల నియంత్రణకు భారత్ నడుంబిగించిందన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ద్వారా ఈ లక్ష్యాన్ని వీలైనంత త్వరగా చేరుకోగలమని ఆకాంక్షించారు. 2030 నాటికి 1 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాల నియంత్రణ దిశగా అడుగులు పడుతున్నాయన్నారు.
అదే ఏడాది నాటికి భారత్‌లో హైడ్రోజన్ డిమాండ్ 13 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందన్నారు. ఇది 2050 నాటికి 28 ఎంఎంటీ దాటుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. దానికనుగుణంగా కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ డైరెక్టర్ ప్రదీప్ జె తారకన్, సీఐఐ చైర్మన్ డా.లక్ష్మీప్రసాద్, పలువురు పారిశ్రామికవేత్తలు, విద్యుత్ పంపిణీ
సంస్థ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment