పిడుగుపాటుకు యువకుడి మృతి
Published Thu, Sep 1 2016 10:05 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
అమృతలూరు (గుంటూరు) : తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తూ ఉండబట్టలేక తానూ వారి కష్టంలో పాలుపంచుకోవాలని వ్యవసాయ పనుల కోసం జిల్లాలు దాటి వచ్చిన యువకుడు పిడుగుపాటుకు బలయ్యాడు. ఇంకా నూనూగుమీసాల వయసులోనే పట్టుమని పదహారేళ్లు నిండకుండానే విధి ఆ యువకుడిని కబళించింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం, చానమిల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఖరీఫ్ సీజన్ పనులకు చిన్న ట్రాక్టర్లు వేసుకుని దమ్ము చేసేందుకు గోవాడకు పది రోజుల క్రితం వలస వచ్చారు. వారిలో వెజ్జు కార్తిక్ (16) మండల పరిధిలోని గోవాడలో పాంచాళవరం డొంకలోని తుమ్మల కృష్ణాజీ పొలంలో చిన్న ట్రాక్టర్‌తో దమ్ము చేస్తుండగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో పిడుగు పడింది. ఆ పిడుగు చేలోని నీటిలో పడగా కార్తీక్ నీటిలో షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. చెరుకుపల్లి ప్రై వేటు వైద్యశాలకు తరలించగా, మృతి చెందాడని వైద్యులు నిర్ధారించడంతో మృతదేహాన్ని స్వగ్రామం చానమిల్లికి తరలించారు.
Advertisement