షాద్‌నగర్ : రాయికల్ టోల్‌ప్లాజా వద్ద నిలిచిన వాహనాలు
పుష్కర యాత్రికులతో ట్రాఫిక్‌జామ్
Published Sat, Aug 13 2016 9:57 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
– పోలీసుల చొరవతో గేట్లు ఎత్తివేసిన సిబ్బంది
– 2గంటల్లో దాటిన 10వేల వాహనాలు
షాద్‌నగర్ : పుష్కర స్నానం కోసం వెళుతున్న ప్రయాణికుల వాహనాలకు టోల్‌గేట్ వద్ద బ్రేకులు పడ్డాయి. సుమారు రెండుగంటల పాటు వాహనదారులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రెండోరోజు శనివారం పుష్కర భక్తులు పెద్దఎత్తున తమ వాహనాల్లో పుష్కరస్నానం కోసం బయల్దేరారు. ఫరూఖ్‌నగర్ మండలంలోని రాయికల్ టోల్‌ప్లాజా వద్దకు ఒక్కసారిగా పెద్ద ఎత్తున వాహనాలు వచ్చాయి. టోల్ రసీదులు జారీ చేస్తున్నా వాహనాల రాక ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. దీంతో పట్టణ సీఐ రామకష్ణ అక్కడికి చేరుకుని అన్ని గేట్లను ఎత్తివేయించడంతో వాహనదారులు ఎలాంటి టోల్ రుసుము చెల్లించకుండానే వెళ్లిపోయారు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే పదివేల వాహనాలు వెళ్లాయని నిర్వాహకులు తెలిపారు. అనంతరం షాద్‌నగర్ నుంచి జడ్చర్ల వైపు వెళ్లే దారిలో ఉన్న ఆరు, జడ్చర్ల నుంచి ౖహె దరాబాద్ వైపు వెళ్లే దారిలో ఉన్న రెండు టోల్ కౌంటర్ల ద్వారా యాత్రికులను జడ్చర్ల వైపు పంపారు.
రద్దీ పెరిగే అవకాశం
వరుసగా మూడురోజుల పాటు సెలవులు ఉండటంతో పుష్కర యాత్రికులు పెద్దఎత్తున బీచ్‌పల్లి, అలంపూర్ తదితర ఘాట్లకు తరలే అవకాశముంది. టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిని క్రమబద్ధీకరించడానికి బైపాస్ జాతీయ రహదారిలో ఉన్న యమ్మీ హోటల్ సమీపంలో నుంచి చిల్కమర్రి మీదుగా బూర్గుల ఆపై తిరిగి జాతీయ రహదారికి వాహనాలను మళ్లించాలని స్థానికులు కోరుతున్నారు.
Advertisement
Advertisement