కానిస్టేబుల్ మతదేహం వద్ద సంతాపం వ్యక్తం చేస్తున్న డిప్యూటీ సీఎం, కలెక్టర్, ఎస్పీ
– గుండెపోటుతో పుష్కర విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మృతి
– తీవ్ర సంతాపం తెలిపిన డిప్యూటీ సీఎం, ఐజీ, డీఐజీ, కలెక్టర్, ఎస్పీ
– రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
– కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో కృష్ణాపుష్కరాల ముగింపు రోజు మంగళవారం విషాదం చోటు చేసుకుంది. పుష్కరాల బందోబస్తుకు శ్రీశైలం వచ్చిన కర్నూలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గోపాలకృష్ణ (39) గుండెపోటుతో మృతి చెందాడు. కమ్యూనికేషన్ సిబ్బందికి సహకారం అందించేందుకు నియమించిన గోపాలకృష్ణ ఉదయం 6.30 గంటల సమయంలో విధుల్లో ఉండగా ఒక్కసారిగా తీవ్ర గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే అతని సన్నిహితులు దేవస్థానం ఉచిత వైద్యశాలకు తరలించారు. అక్కడి అపోలో డాక్టర్లు కానిస్టేబుల్‌కు అత్యవసర చికిత్సలు చేసినా ప్రాణాలను కాపాడలేకపోయారు. మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం తెలుసుకున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జిల్లా కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ రవిష్ణ హుటాహుటిన దేవస్థానం వైద్యశాలకు చేరుకుని కానిస్టేబుల్ మృతదేహానికి నివాళులు అర్పించారు. జరిగిన సంఘటన తెలుసుకున్న రాయలసీమ జోన్ ఐజీ శ్రీధర్‌రావు కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 1985వ బ్యాచ్‌కు చెందిన గోపాలకృష్ణ స్వస్థలం కర్నూలులోని కృష్ణానగర్. ఆయనకు భార్య రామలక్ష్మి, కుమార్తె, కుమారుడు ఉన్నారని ఎస్పీ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తరుపున రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా: డిప్యూటీ సీఎం
గుండెపోటుతో మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియాను డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మంగళవారం ప్రకటించారు. స్థానిక దేవస్థానం వీవీఐపీ భ్రమరాంబా అతిథిగహంలో ఆయన జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయస్సులోనే గోపాలకృష్ణ గుండెపోటుతో మరణించడం దిగ్భ్రాంతి కలిగించందని, ఆయన కుటుంబానికి తనప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఒకరికి ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తామని, ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని బుధవారమే వారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బాబు ప్రసాద్, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు టి. నారాయణ పాల్గొన్నారు.
==================
సంగమేశ్వరంలో కానిస్టేబుల్‌కు నివాళి
ఆత్మకూరురూరల్:
శ్రీశైలంలో పుష్కర విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మరణించిన కానిస్టేబుల్ గోపాలకృష్ణకు సంగమేశ్వరం ఘాట్‌లో జేసి హరికిరణ్, డీఎస్పీ వెంకటాద్రి, ఇతర పోలీసు అధికారులు నివాళులర్పించారు.