- చర్యలు చేపట్టని అధికారులు
- తాజాగా మరో ఇద్దరు మృతి
ఆగని కాళ్లవాపు మరణాలు
Published Sun, Nov 6 2016 12:10 AM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM
రంపచోడవరం:
కాళ్లవాపు వ్యాధితో మరణిస్తున్న గిరిజనుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. శనివారం విలీన మండలంలో మరో ఇద్దరు ఆదివాసీలు ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధితో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12కు చేరుకుంది. రెండు నెలలు కాలంలో 12 మంది ప్రాణాలు కోల్పోయినా అధికారుల్లో ఇంకా కదలిక రాలేదు. వ్యాధి కి కారణాలు, నివారణ చర్యలు, చికిత్స ఏమిటనే అంశాలను వైద్య, ఆరోగ్య శాఖ పట్టించుకోవడం లేదు. తాజా గా చింతూరు మండలం పాలగూడెం గ్రామానికి చెంది న పొడియం మల్లమ్మ (45) శుక్రవారం, మామిళ్లగూడెంకి చెందిన మచ్చిక లక్ష్మయ్య(55) శనివారం ఇంటి వద్ద కాళ్లవాపు వ్యాధితో మృత్యువాత పడ్డారు.
కాళ్లవాపు మరణాలు సంభవించిన తరువాత ప్రతీ గ్రామంలో ఇంటింటి సర్వే చేసి వ్యాధి పీడితులను గుర్తించాలనే అధికారులు నిర్ణయించారు. అయితే ఈ సర్వే ద్వారా అధికార యంత్రాంగం చేసింది శూన్యమానే చెప్పాలి. ఇప్పటి వరకు వీఆర్ పురం మండలంలో 8 మంది, కూనవరం మండలంలో ఒక్కరు, చింతూరులో ముగ్గురు కాళ్లవాపుతో మృతి చెందారు. జాతీయ స్ధాయి వైద్య బృందం విలీన మండలంలో పర్యటించి వ్యాధి నిర్ధారణ కారణాలు వెల్లడిస్తారని ప్రకటించినప్పటికీ నేటికీ ఎటువంటి ప్రకటనా లేదు. హెల్త్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించలేదు.
ప్రత్యేక వైద్యులను నియమించాలి
చింతూరులో ఏర్పాటు చేసిన ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను నియమించాల్సిన అవసరం ఉంది. వారుంటే బాధితులకు సత్వరంగా వైద్య సేవలు అందే అవకాశం ఉంటుంది. కొంత మంది వైద్యులు కాళ్లవాపు కిడ్ని సమస్య వలనే వస్తుందని చెబుతున్నారు. అయితే కాకినాడ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకున్న వారు తిరిగి మరొమారు డయాలసిస్ చేయించుకోవాలంటే చింతూరు ఆసుపత్రిలో డయాలసిస్ యూని ట్ లేదు. కనీసం స్వేచ్ఛమైన తాగునీరు అందించేందుకు కూడా చర్యలు తీసుకోలేదు. ఎంత మంది ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయాకా అధికారులు మేల్కొంటారో చూడాలి.
Advertisement