హమ్మయ్య..ఎట్టకేలకు శిక్షణ ఇస్తున్నారు
హమ్మయ్య..ఎట్టకేలకు శిక్షణ ఇస్తున్నారు
Published Tue, Apr 18 2017 10:47 PM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM
ఎన్నికైన తొమ్మిది నెలలకు ఎస్‌ఎంసీలకు శిక్షణ
జిల్లాలో 67,200 మంది ఎస్‌ఎంసీలు
రాయవరం: ఎన్నికైన ఏడు నెలలకు ఎట్టకేలకు పాఠశాల యాజమాన్య కమిటీలకు శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ నడుం బిగించింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన రెండు నెలలకు కమిటీలను ఎన్నిక చేస్తే..విద్యా సంవత్సరం ముగింపులో శిక్షణ ఇవ్వడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా పాఠశాల యాజమాన్య కమిటీలు ఎన్నికైన వెంటనే వారి విధులు, బాధ్యతలు తెలియజేస్తూ శిక్షణ ఇస్తారని భావించినా పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు బుధవారం నుంచి రెండు రోజుల పాటు ఎన్నికైన సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నారు.
జవాబుదారీతనం పెంచేందుకు..
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నారు. దుస్తులు మొదలుకొని భోజనం కూడా ఉచితంగా అందజేస్తున్నారు. నిష్ణాతులైన ఉపాధ్యాయుల బోధన, వీటిని సమన్వయం చేసుకుంటూ వెళ్లేందుకు పాఠశాల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేశారు. పాఠశాలల సమస్యలను ప్రభుత్వం దష్టికి ఎస్‌ఎంసీ ఛైర్మన్లు, సభ్యులు తీసుకుని వెళ్లి పరిష్కారం దిశగా అడుగులు వేయాలంటే ఎస్‌ఎంసీ సభ్యుల అధికారాలు, బాధ్యతలు వారికి తెలియాల్సి ఉంది. ఎస్‌ఎంసీ చైర్మన్లుగా, సభ్యులుగా ఎన్నికైన వారికి వారి విధులు, బాధ్యతలు తెలిసేలా వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, ఎస్‌ఎంసీ ఎన్నికలు జరిగిన తొమ్మిది నెలలకు శిక్షణ ఇస్తున్నారు.
జిల్లాలో 67,200 మందికి శిక్షణ..
జిల్లా వ్యాప్తంగా 3,982 పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలలో తరగతికి ముగ్గురు వంతున 15 మంది, ప్రాథమికోన్నత పాఠశాలలో 24, ఉన్నత పాఠశాలలో తొమ్మిది వంతున ఎన్నిక చేశారు. వీరు కాకుండా ఆరుగురు సభ్యులను కోఆప్షన్ సభ్యులుగా నియమించారు. జిల్లా వ్యాప్తంగా 1.09లక్షల మంది ఎస్‌ఎంసీ సభ్యులు ఉండగా, వీరిలో ఎన్నికైన 67,200 మందికి మాత్రమే శిక్షణ ఇవ్వనున్నారు. వీరిలో 50శాతం మంది మహిళలే ఉన్నారు.
స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో..
ఎన్నికైన ఎస్‌ఎంసీ సభ్యులకు స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో ఇచ్చే శిక్షణ బుధ, గురువారాల్లో నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 322 స్కూల్ కాంప్లెక్స్‌ల పరిధిలో ఎస్‌ఎంసీ సభ్యులకు విజయవాడలో శిక్షణ పొందిన డీఆర్పీలు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణలో పాల్గొనే సభ్యులకు మాడ్యూల్, పెన్ను, నోట్‌బుక్ అందజేయడంతో పాటు శిక్షణలో పాల్గొనే సభ్యులకు లంచ్ ఏర్పాటు చేస్తారు.
శిక్షణ ఫలప్రదమవుతుందా..
విద్యా సంవత్సరం మరో వారం రోజులు ముగియనుండగా శిక్షణ ఇవ్వడం ఎంత వరకూఉపయోగమనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఎస్‌ఎంసీల్లో ఉన్న వారిలో అధిక శాతం మంది పేద, మధ్య తరగతికి చెందిన వారే. రబీ పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో శిక్షణ ఎంత వరకు ఫలప్రదమవుతుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
సద్వినియోగం చేసుకోవాలి..
ఎస్‌ఎంసీ సభ్యులకు బుధ, గురువారాల్లో ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. ఎస్‌ఎంసీ సభ్యులు హాజరయ్యేందుకు అనువుగా స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో ఏర్పాటు చేశాం. సభ్యులందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంఈవోలకు అదేశాలిచ్చాం.
– మేకా శేషగిరి, పీఓ, ఎస్‌ఎస్‌ఏ, కాకినాడ.
ఏర్పాట్లు పూర్తి చేశాం..
జిల్లా వ్యాప్తంగా ఎస్‌ఎంసీ సభ్యులకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. ఎన్నికైన సభ్యులకు లంచ్‌ను ఏర్పాటు చేశాం. – ఇంటి వెంకట్రావు, సీఎంఓ, ఎస్‌ఎస్‌ఏ, కాకినాడ.
Advertisement
Advertisement