ఏసీబీ వలలో ట్రాన్స్‌కో ఏఈ
Published Sat, Aug 13 2016 12:31 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
మర్రిపాడు:మండలంలో ట్రాన్స్‌కో ఇన్‌చార్జి ఏఈగా పనిచేస్తున్న శ్రీకాంత్ రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు శుక్రవారం పట్టుబడ్డాడు. బాధిత రైతు కథనం మేరకు మండలంలోని బూదవాడ గ్రామానికి చెందిన సిరిగిరి మహేశ్వరరెడ్డి, వెంకటేశ్వర్లు, రమణయ్య 2015 నవంబర్‌లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కోసం అప్పట్లో ప్రభుత్వానికి రూ.37 వేలను చెల్లించారు. అప్పట్లో ఏఈగా ఉన్న ఖుద్దూస్‌కు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కోసం రూ.5 వేలు లంచం కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఖుద్దూస్ సస్పెండ్ అయి ఉండడంతో దుత్తలూరులో విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్‌ను మర్రిపాడు ఇన్‌చార్జి ఏఈగా నియమించారు. ఈ నేపథ్యంలో బాధిత రైతులు ఏఈ శ్రీకాంత్‌ను కలిసి ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరారు. రూ.10 వేలు ఇస్తేనే ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేస్తామని ఏఈ సమాధానమిచ్చారు. దీంతో ఈ నెల 10వ తేదీన బాధిత రైతు వెంకటేశ్వర్లు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు ఏఈ శ్రీకాంత్‌కు రైతు వెంకటేశ్వర్లు రూ.10 వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ సిబ్బందితో కలసి శుక్రవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
కావలిఅర్బన్: ట్రాన్స్‌కో ఏఈ శ్రీకాంత్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. స్థానిక రామ్మూర్తిపేట కేతిరెడ్డివారి వీధిలోని అతని ఇంటిలో ఏసీబీ సీఐ ప్రతాప్, ఏఎస్‌ఐ కరీ ముల్లా, సిబ్బంది సోదాలు చేశారు. రూ.28వేల నగదు, మూడు జతల కమ్మలు, ఇతర ఆస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. డా క్యుమెంట్ల విలువ సుమారు రూ.కోటిలు ఉంటుందని అంచనా వేస్తున్నా రు. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను ఏసీబీ డీఎస్పీకి అందజేస్తామని అధికారులు తెలిపారు.
Advertisement