- ధ్వంసమవుతున్న వంతెన రక్షణ గోడలు
- పట్టించుకోని అధికారులు
రాయికోడ్:మండల కేంద్రమైన రాయికోడ్ గ్రామ సమీపంలోని వాగుపై నిర్మించిన వంతెన రక్షణ గోడలు ధ్వంసం కావడంతో ప్రయాణం ప్రమాదకరంగా మా రింది. రాయికోడ్–చిమ్నాపూర్ ప్రధాన రహదారిపై ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన వంతెనకు ఇరువైపులా ఉన్న రక్షణ గోడ (రెయిలింగ్)కు ఇనుప చువ్వలు పైకి తేలి కాంక్రీటు పాడైంది. వాహనాలు నడిపేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వాహనాలు వంతెన కింద పడిపోయే ప్రమాదం ఉంది. ఎన్నో ఏళ్ల క్రితం ని ర్మించిన ఈ వంతెనపై ప్రయాణికులు భ యంభయంగా ప్రయాణిస్తున్నారు. ఇప్పటికైనా రక్షణ గోడలు నిర్మించాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
అలాగే ఎప్పుడో నిర్మించిన వంతెనను సంబంధిత శాఖల ఇంజనీర్లు పరిశీలించి వంతెనపై ప్రయాణం ఎంతవరకు భద్రమో తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మండల పరిధిలోని రాయిపల్లి– కర్చల్ రహదారిపై రాయిపల్లి శివారులో ఉన్న మూలమలుపు ప్రాంతంలోని కల్వర్టు ధ్వంసమైంది. అక్కడ రోడ్డు కోతకు గురికావడంతో ప్రయాణం చేసేం దుకు వీల్లేకుండా ఉంది. దీంతో ఈ ప్రాం తంలో తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ఇక్కడ గతంలో పలు ప్రమాదాలు జరగడంతో పలువురు వా హన దారులు, ప్రయాణికులు గాయపడిన సంఘటనలూ ఉన్నాయి. కల్వర్టును నిర్మించి రోడ్డు మరమ్మతు చేయాలని ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేదని కర్చల్, రాయిపల్లి, మామిడిపల్లి, ఇందూర్ తదితర గ్రామాలకు చెందిన వాహన దారులు వాపోతున్నారు. అధికారులు రోడ్డు, కల్వర్టులకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
లోలెవల్ బ్రిడ్జిలతో ఇబ్బందులు
మండలంలోని హుల్గేర, యూసుప్‌పూర్, రాయిపల్లి, కుసునూర్ గ్రామ శివార్లలోని వాగులపై గతంలో నిర్మించిన లో లెవల్ బ్రిడ్జిలతో ఇబ్బందులు వస్తున్నాయి. వర్షాకాలంలో బ్రిడ్జీలపై నుంచి పారుతుండటంతో రోజుల తరబడి వేరే గ్రామాలకు వెళ్లలేని పరిస్థితులు నెలకొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి..
రాయిపల్లి గ్రామ శివారులోని మూలమలుపు వద్ద కల్వర్టు ధ్వంసమై రోడ్డు కోతకు గురికావడంతో ఈ ప్రాంతంలో తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కల్వర్టు మరమ్మతుకు ఎటువంటి చర్యలు చేపట్టడంలేదు. – సంగమేశ్వర్, కర్చల్ గ్రామం
రక్షణ గోడలు నిర్మించాలి..
రాయికోడ్ వంతెనకు రక్షణగా ఉన్న గోడలకు మరమ్మతు చేయాలి. ఇక్కడ రాత్రివేళల్లో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రమాదం పొంచి ఉన్నందున రక్షణ గోడలను పటిష్టం చేసి ప్రయాణికుల భద్రతకోసం చర్యలు తీసుకోవాలి
– రవికుమార్, డ్రైవర్ రాయికోడ్