వైద్యశాఖ అధికారులతో సమీక్షిస్తున్న ప్రత్యేకాధికారి ప్రవీణ్‌కుమార్
గిరిజనుల ఆరోగ్యంపై అప్రమత్తం
Published Tue, Sep 27 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
శ్రీకాకుళం పాతబస్టాండ్ : గిరిజన ప్రాంతాల్లో ప్రజారోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేకాధికారి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్ అధికారులను అదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం ఆర్‌అండ్‌బీ వసతి గృహంలో నగరపాలక సంస్థ కమిషనర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున పారిశుద్ధ్యంపై శ్రద్ధ కనబరచాలని సూచించారు. వర్షాలు పడుతున్నందున జల కాలుష్యం కాకుండా తాగునీటిపై అవగాహన కల్పించాలన్నారు. గ్రామస్థాయి ఆరోగ్య కార్యకర్త నుంచి ఆశావర్కర్లు, ఆంగన్‌వాడీ సిబ్బంది వరకు అందరినీ భాగస్వాములను చేయాలని ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నందున రోగాలు వ్యాప్తి చెందే అవకాశముందని, గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
దోమల నివారణకు ఫాగింగ్ చేయడంతో పాటు కాలువల్లో పూడికలు తీయించాలన్నారు. ఈ సందర ్భంగా శ్రీకాకుళం నగరంలో చేపట్టిన కార్యక్రమాలను కమిషనర్ పి.ఎ.శోభ వివరించారు. బహిరంగ మలవిసర్జన రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు అక్టోబర్ 2న పలు కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సనపల తిరుపతిరావు మాట్లాడుతూ ఈ నెల 19 నుంచి మొబైల్æక్లినిక్ వాహనాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో అంటువ్యాధులు లేవని చెప్పారు. డెంగీ జ్వర పీడితులు ఉంటే వారికి పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నామని, ఇంతవరకు జిల్లాలో డెంగీ మరణాలు సంభవించలేదన్నారు. అనంతరం కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం ప్రత్యేకాధికారిని కలిసి జిల్లాలో పరిస్థితులను వివరించారు. సమావేశంలో వైద్యశాఖ అధికారులు మెండ ప్రవీణ్, ధవళ భాస్కరరావు, ఎస్.అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement