
మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రీధర్ బాబు
- పోలీసులు గులాబీ కండువాలు కప్పుకున్నట్లున్న ఉంది..
- కాంగ్రెస్ జిల్లా ఇన్‌చార్జ్, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు
- ప్రాజెక్ట్‌ల పేరుతో దోపిడీ ..
వైరా : రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ గాలి పార్టీ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జ్, మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు విమర్శించారు. శనివారం వైరాలో జరిగిన నియోజకవర్గ సమావేశంలో కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ ధోరణి అవలంభిస్తున్నారని, 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే అధికారమన్నారు. టీఆర్‌ఎస్ అధికారాన్ని ఎదిరించిన ఒక్క కాంగ్రెస్సేనని నొక్కివక్కాణించారు. రాష్ట్రంలో పోలీసులు గులాబీ కండువాలు కప్పుకున్నట్లుగా ఉందని, అధికార పార్టీకి పోలీసులు పని చేస్తున్నారన్నారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, ప్రభుత్వాలు వస్తాయి.. పోతాయి.. అధికారులు మాత్రం ఒకే పార్టీకి కొమ్ము కాస్తే రాబోయే రోజుల్లో ఇబ్బందులు పడతారన్నారు.
ప్రాజెక్ట్‌ల పేరుతో టీఆర్‌ఎస్ దోపిడి చేస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. మంత్రి తుమ్మలకు కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. ఒక చెడ్డవాడు ఉంటేనే మంచివాడి విలువ తెలుస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే మదన్‌లాల్ మనవాడేనని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆయనకు ఓట్లు వేశారన్నారు. త్వరలో పది వేల మందితో నియోజకవర్గ సమన్వయ సమావేశం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అయితం సత్యం, జిల్లా అ«ధికార ప్రతినిది పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధి కట్ల రంగారావు, మహిళా అధ్యక్షురాలు మణి, జిల్లా నాయకులు ఎన్.రాంబాబు, వీరయ్య, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రామస్వామి, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బాలాజీ, మండల అధ్యక్షుడు పసుపులేటి మోహనరావు, నాయకులు వెంకటనర్సిరెడ్డి, దానియేలు, హరినాథ్, గోవిందరావు, తదితరులు పాల్గొన్నారు.