
టీఎస్‌పీఎస్సీ చాంబర్ స్వాధీనం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అధికారులు అక్రమంగా తమ కార్యాలయంలోని చాంబర్‌ను స్వాధీనం చేసుకున్నారంటూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) శుక్రవారం హైదరాబాద్‌లోని బేగంబజార్ పోలీసులు ఫిర్యాదు చేశారు. నాంపల్లిలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భవనాన్ని తెలంగాణ రాష్ట్ర విభజనలో భాగంగా రెండుగా విభజించారు. 2వ, 3వ అంతస్తులో టీఎస్‌పీఎస్సీ, 4వ, 5వ అంతస్తులో ఏపీపీఎస్సీ కొనసాగుతున్నాయి.
కాగా 5వ అంతస్తులోని ఒక గదిలో టీఎస్‌పీఎస్సీకి చెందిన అసిస్టెంట్ సెక్రటరీ సీతాదేవి చాంబర్ ఉంది. కార్యాలయంలోని చాంబర్‌ను ఏపీపీఎస్సీ అధికారులు నకిలీ తాళం చెవితో తెరిచి గదిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో తనకు సమాచారం ఇవ్వకుండా చాంబర్‌ను తెరిచారంటూ సీతాదేవి టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతీ సుబ్రమణ్యంకు సమాచారం ఇచ్చారు. ఆమె దీనిపై బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తమ చాంబర్‌ను తెరవడమే కాకుండా అందులోని విలువైన పత్రాలను కూడా మాయంచే సి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ జి.శ్రీధర్ తెలిపారు.