చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
-
రూ.7.32 లక్షల సొత్తు స్వాధీనం
-
నిందితులిద్దరూ నీటి పారుదలశాఖలో లస్కర్లు
కోవూరు : చోరీ కేసులో నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు నెల్లూరు రూరల్ డీఎస్పీ డాక్టర్ తిరుమలేశ్వరరెడ్డి తెలిపారు. స్థానిక సీఐ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితుల నుంచి రూ.7.32 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 2016 మే 25వ తేదీన సూళ్లూరుపేట మహాదేవయ్యనగర్‌కు చెందిన ఉక్కు సురేష్ తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఓ ధాన్యం దళారీ దగ్గర గుమస్తాగా పనిచేస్తూ పరిసర ప్రాంతాల్లోని రైతుల వద్దకు వెళ్లి వచ్చేవారు. సమీప ప్రాంతంలో ఉన్న రైసుమిల్లర్ల వద్ద నుంచి ధాన్యం డబ్బులు రూ.8 లక్షలు తీసుకుని తిరిగి సూళ్లూరుపేటకు బస్సులో బయల్దేరారు. ఈ విషయాన్ని నల్లగొండ జిల్లా నేరేడుచెర్లలో చెందిన మోహన్‌రెడ్డి, మిర్యాలగూడ ఇస్లాంపురానికి చెందిన నేరిళ్ల నరసింహ పసిగట్టారు. సురేష్‌ను వెంబడిస్తూ అతను బస్సు ఎక్కగా, వీరు కూడా బస్సులో బయల్దేరారు. ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉండగా, పసిగట్టిన దుండగలు ఇద్దరు బస్సు కొడవలూరు మండలం కమ్మపాళెం ప్రాంతానికి వచ్చే సరికి తెల్లవారు జామున 4 గంటల సమయంలో మోహన్‌రెడ్డి డ్రైవర్ వద్దకు వెళ్లి బూత్‌రూమ్‌కు వెళ్లాలని బస్సును ఆపాలని కోరడటంతో డ్రైవర్ బస్సును ఆపాడు. వెంటనే మరో వ్యక్తి నరసింహ సురేష్ వద్ద ఉన్న నగదు బ్యాగును తీసుకుని ఇద్దరు పారిపోయారు. సురేష్ కొడవలూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ నారాయణరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసి నిందితులను గుర్తించామన్నారు. నిందితులిద్దరూ నల్గొండ జిల్లా గరిడేపల్లిలో ఉన్నట్లు సమాచారం అందటంతో మంగళవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని విచారించి అరెస్ట్ చేశామన్నారు. ఇద్దరు నేరేడుచెర్ల మండలంలో నీటిపారుదలశాఖలో లస్కర్‌గా పనిచేస్తూ క్రికెట్ బెట్టింగులు, పేకాట ఇతర వ్యసనాలకు బానిసై అప్పులు కావడంతో ఎక్కడ అప్పులు పుట్టక దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన కోవూరు సీఐ మాధవరావు, కొడవలూరు ఎస్‌ఐ నారాయణరెడ్డి, పోలీసు సిబ్బంది సత్యం, కేవీ సుధాకర్, కృష్ణ, విజయప్రసాద్, రియాజ్, శ్రీనివాసులురెడ్డి, ఏ ప్రసాద్, వినోద్, రవిచంద్ర, పి.రమేష్‌బాబును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వీరికి రివార్డులు ప్రకటించేందుకు ఎస్పీకి సిపార్సు చేస్తామన్నారు.