రెండు ఎలుగుబంట్లు మృతి
-
వ్యవసాయ బావిలో పడ్డ మూడు ఎలుగుబంట్లు
-
రెండు మృతి, కనిపించని మరో పిల్ల ఎలుగుబంటి
వీణవంక : గుట్టలు, అడవుల్లో ఉండాల్సిన ఎలుగుబంట్లు మంచినీటి కోసమో లేక ఆహారం కోసమో కానీ దారితప్పాయి. ఓ తల్లి ఎలుగుబంటితోపాటు రెండు పిల్ల ఎలుగులు వ్యవసాయ బావిలో పడ్డాయి. ఎవరో ఒకరు కాపాడకబోతారా అని 24 గంటలకు పైగా బావిలో ఎదురుచూశాయి. కానీ ఏ ఒక్క అధికారి పట్టించుకోకపోవడంతో చివరికి తల్లి, పిల్ల ఎలుగుబంటి బావిలోనే వృతి చెందగా, మరో పిల్ల ఎలుగుబంటి జాడ కనిపించడంలేదు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని శ్రీరాములపేట గ్రామానికి చెందిన కురిమిండ్ల కనకయ్య అనే రైతు చెందిన వ్యవసాయ బావిలో ఆదివారం రాత్రి తల్లి, రెండు పిల్ల ఎలుగుబంట్లు ప్రమాదవశాత్తు బావిలో పడ్డాయి. గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, సోమవారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో బావి వద్దకు చేరుకొని బావిలో నిచ్చెన వేశారు. బావిలో నీళ్లు ఎక్కవగా ఉండటంతో వాటిని బావిలోనే వదిలేసివెళ్లారు. మంగళవారం ఉదయం రైతు కనకయ్య వెళ్లి చూసేసరికి తల్లి, పిల్ల ఎలుగుబంటి మతి చెంది నీటిలో తేలాయి. సమాచారం అందుకున్న ఫారెస్ట్ సెక్షన్ అధికారి భరణి, బీట్ అధికారి వేణు సంఘటన స్థలానికి చేరుకొని మతి చెందిన ఎలుగుబంట్లను బయటకి తీశారు. మరో ఎలుగుబంటి కోసం బావిలో గాలించినా జాడ తెలియలేదు. నిచ్చెన సహాయంతో బయటికి వెళ్లిపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు. పశువైద్యుడు రవీందర్‌రెడ్డి బావి దగ్గరే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వాటిని ఖననం చేయడానికి అటవీశాఖ అధికారులు తీసుకెళ్లారు. అధికారులు సకాలంలో స్పందించి ఉంటే భల్లూకాలు బతికి ఉండేవని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. సామాజికి కార్యకర్త నలబాలు వేణుగోపాల్ సంఘటన స్థలంలో అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. మనుషులకు ప్రమాదాల జరిగితే 108, 100కు డయిల్ చేస్తాం.. అలాగే జంతువులు ప్రమాదంలో చిక్కినప్పుడు సమాచారం అందించడానికి టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించి అంతరించి పోతున్న వన్యప్రాణులను కాపాడాలని కోరారు.