రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
గుత్తి/ కూడేరు: వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో జిల్లాకు చెందిన ఇద్దరు దుర్మరణం చెందారు. మృతుల్లో ఒకరు మెడికో, మరొకరు యువకుడు ఉన్నారు. ఈ ప్రమాదాల్లో మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. గుత్తికి చెందిన సుబ్బమ్మ కుమారుడు గణేష్ (30) కడపలోని ఫాతిమా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. మహాలయ పౌర్ణమి (మాల పున్నమి) పండుగ కోసం ఇటీవల గుత్తికి వచ్చాడు. బుధవారం రాత్రి తిరిగి కడపకు బయల్దేరాడు. అయితే నేరుగా అక్కడికి వెళ్లకుండా మార్గం మధ్యలోని యర్రగుంట్లలో గల తమ బంధువుల ఇంటికి వెళ్లాడు. గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో కడపకు ఆటోలో బయల్దేరాడు. కమలాపురం మండలం తప్పట్ల గ్రామం వద్ద ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. గణేష్‌తోపాటు మరో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. వీరిని హుటాహుటిన కడప ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12 గంటల సమయంలో గణేష్ మృతి చెందాడు. శుక్రవారం గుత్తిలో అంత్యక్రియలు నిర్వహించారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని..
విడపనకల్లు మండలం కరకముక్కలకు చెందిన వన్నూరుస్వామి (25) అత్తగారి ఊరు అయిన కూడేరు మండలం ఇప్పేరుకు వచ్చాడు. అక్కడి నుంచి శుక్రవారం ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి బయల్దేరాడు. ముద్దలాపురం వద్ద అనంతపురం - బళ్లారి రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వన్నూరుస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ఇతడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు.