పాత గోడ.. మృత్యువు అడుగుజాడ..
పాత గోడ.. మృత్యువు అడుగుజాడ..
Published Mon, Oct 10 2016 11:31 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
కూలీలను కబళించిన మృత్యువు ∙
పాత ఇంటిగోడ కూలి ఇద్దరు కూలీలు మృతి ∙
ముంగండ, నరేంద్రపురం గ్రామాల్లో విషాదఛాయలు
పి.గన్నవరం : వారిద్దరూ తమ రెక్కల కష్టంపై కుటుంబాన్ని పోషిస్తున్న వారే. ఏ పూట కూలికి వెళ్లకపోయినా బతుకుబండి ఒడిదుడుకులకు లోనయ్యే పేదలే. పాత ఇంటిని పడగొట్టే పనికి వెళ్లిన వారికి ఆ ఇల్లే సజీవ సమాధి అయింది. కూల్చబోయిన గోడే తమ ప్రాణాల్ని హరించింది. పి.గన్నవరం మండలం రాజులపాలెం శివారు ఐనాలవారిపాలెంలో సోమవారం జరిగిన దుర్ఘటనలో ముంగండ శివారు ఇటికెలమెరకకు చెందిన మట్టపర్తి వెంకటేశ్వరరావు అనే వెంకన్న (42), నరేంద్రపురం శివారు బూరుగుగుంటకు చెందిన గుమ్మడి నాగరాజు(40) దుర్మరణం పాలయ్యారు.
ఐనాలవారిపాలెంలో బొక్కా సాహెబ్‌కు చెందిన పాత ఇంటి కలప, ఇటుక సామగ్రిని ముంగండకు చెందిన మట్టపర్తి సుధాకరరావు(బాబ్జీ) రూ.30 వేలకు కొనుగోలు చేశాడు. నాలుగు రోజులుగా వెంకటేశ్వరరావు, నాగరాజు(40), ముంగండకు చెందిన మామిడిశెట్టి వేణుగోపాలరావు పాత ఇంటిని విప్పుతున్నారు. ఇటీవల పాత ఇళ్లను పొక్లెయిన్‌తో తొలగిస్తున్నారు. ఇంటి ఇటుకలు తిరిగి ఉపయోగించే స్థితిలో ఉండటంతో కూలీలతో పనిచేయిస్తున్నారు. సోమవారం ఇంటిగోడను గునపాలతో కూల్చేందుకు ప్రయత్నిస్తుండగా ఇటీవల వర్షాలకు నానిఉన్న గోడ ఒక్కసారిగా ఒకవైపున ఉన్న వెంకన్న, నాగరాజులపై పడిపోయింది. తప్పించుకునే అవకాశం లేక ఆ ఇద్దరూ శిథిలాల కిందపడి మరణించారు. గోడకు రెండోవైపున ఉన్న వేణుగోపాలరావు ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
మమ్మల్ని అనాథల్ని చేసి వెళ్లిపోయావా!
‘ఇద్దరు ఆడపిల్లల్నీ, నన్నూ అనాథలను చేసి వెళ్లిపోయావా..’ అంటూ వెంకటేశ్వరరావు భార్య పద్మ గుండెలవిసేలా రోదించిన తీరు అందరినీ కంట తడిపెట్టించింది. తండ్రి మృతదేహం చూసి కుమార్తెలు మీన, అరుణ సొమ్మసిల్లి పోయారు. ఈ కుటుంబానికి కనీసం ఇంటి స్థలం కూడా లేదు. ఇటికెలమెరకలో ఆక్రమణ స్థలంలో గుడిశె వేసుకుని నివసిస్తున్నారు. మీన ఇంటివద్దే ఉంటుండగా, అరుణ పదో తరగతి చదువుతోంది.
నీ భార్యకు ఏం చెప్పను?
మరో మృతుడు నాగరాజు సంపాదన అంతంత మాత్రంగానే ఉండటంతో భార్య నాగలక్ష్మి ఏడాది క్రితం గల్ఫ్‌లో పనికి వెళ్లింది. నాగరాజు, తండ్రి గనిరాజు కలిసి ఉంటున్నారు. ‘నీ భార్యకు ఏం సమాధానం చెప్పా’ లంటూ గనిరాజు రోదించాడు.
విషాదఛాయలు
ఈ సంఘటనతో ముంగండ, నరేంద్రపురం గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. బాధిత కుటుంబాలను వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి డొక్కా నాథ్‌బాబు, ఎంపీటీసీ సభ్యులు నేలపూడి సత్యనారాయణ, నక్కా వీవీ సత్యనారాయణ పరామర్శించారు. రావులపాలెం సీఐ పీవీ రమణ, డిప్యూటీ తహసీల్దార్ డి.శ్రీనివాస్, ఎస్సై పి.వీరబాబు సహాయక చర్యలు చేపట్టారు.
Advertisement