two persons died
బేస్తవారిపేట : స్థానిక జంక్షన్‌లో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు.. చెట్టిచర్ల గ్రామానికి చెందిన మెట్ల వెంకట రమణ (34) జంక్షన్ చెక్‌పోస్ట్‌లో వాచ్‌మన్‌గా కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. భార్య, పిల్లలతో జంక్షన్‌లో ఒంగోలు రోడ్డు వైపున పైమిద్దెలో అద్దెకు ఉంటున్నాడు. రాత్రి పబ్లిక్ ట్యాప్‌కు నీరు వచ్చే సమయంలో నీటి వాలును మార్చేందుకు కిందకు దిగాడు. అప్పటికే మిద్దె ముందు డోమ్ లైట్ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డుపై పడింది. ఇనుప రేకుల షెడ్డు నుంచి కింద ఉన్న సిమెంట్ షాపు ముందు ఉంచిన ఐరన్ రాడ్‌లకు విద్యుత్ సరఫరా జరిగింది. ఐరన్ రాడ్‌ను దాటుతున్న వెంకట ర మణ ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య నాసరమ్మ, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఎస్సై రామానాయక్ వచ్చి వివరాలు సేకరించారు. భర్త మృతితో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
యువ రైతు కూడా..
శ్రీనివాసనగర్ (అద్దంకి) : విద్యుదాఘాతంతో మరో యువ రైతు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మండలంలోని చిన్నకొత్తపల్లి పంచాయతీ శ్రీనివాసగర్‌లో బుధవారం జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. స్థానికంగా నివాసం ఉండే గోరంట్ల అంజయ్య, రమాదేవి కుమారుడు శివలింగారావు (30) ఉదయాన్నే కొష్టం వద్ద ఉన్న మోటార్ స్విచ్ వేసేందుకు ప్రయత్నించాడు. ఎంతకూ మోటార్ ఆన్ కాకపోవడంతో వైర్లు పట్టుకుని కదిలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయాడు. గమనించిన బంధువులు ఆయన్ను హుటాహుటీన స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
చేతికందిన కొడుకయ్యా..
అంజయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో శివలింగారావు పెద్ద వాడు. చేతికి అంది వచ్చిన పెద్ద కుమారుడు విద్యుదాఘాతంతో మరణించడంతో తల్లి రామాదేవి భోరున విలిపిస్తోంది. తమకు ఇక దిక్కెవరంటూ గుండెలవిసేలా ఏడుస్తుండటం స్థానికులకు కంట నీరు తెప్పించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.