ఇద్దరు యువ ఇంజినీర్‌లు మృత్యువాత
ఇద్దరు యువ ఇంజినీర్‌లు మృత్యువాత
Published Fri, Mar 24 2017 12:04 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
కుక్కునూరు (పోలవరం): మోటార్ సైకిల్‌ను ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువ ఇంజినీర్‌లు మృతిచెందారు. ఈ దుర్ఘటన కుక్కునూరు మండలంలోని కమ్మరిగూడెం టర్నింగ్ వద్ద గురువారం ఉదయం 7 గంటలకు చోటు చేసుకుంది. ఎస్సై సాధిక్ పాషా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో మరుగుదొడ్లు(ఐహెచ్‌ఎస్‌ఎల్)నిర్మించే బాధ్యతను కేఆర్‌పురం ఐటీడీఏ అధికారులు న్యాక్ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. సంస్థ తరపున ఇంజినీర్‌లు లాడియా తిరుపతి(26), పెనుకా గౌతమ్(24) ఇటీవల మండలానికి వచ్చారు.
వీరిద్దరూ కూలీలను తీసుకువచ్చేందుకు ఉదయం అమరవరం నుంచి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా కమ్మరిగూడెం టర్నింగ్ వద్ద భూర్గంపాడు నుంచి రాజమండ్రి వెళ్తున్న తెలంగాణ రాష్ట్రం మణుగూరు డిపోకు చెందిన బస్సు ఢీ కొంది. ఈ ప్రమాదంలో తిరుపతి అక్కడికక్కడే మృతిచెందగా, గౌతమ్ భద్రాచలం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. మృతులలో తిరుపతి వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన వాడు కాగా గౌతమ్ మహబూబాబాద్ నివాసి అని ఎస్సై తెలిపారు. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
Advertisement
Advertisement