యద్దనపూడి జీవితం నేటి తరం పాత్రికేయులకు స్ఫూర్తిదాయకం
తాడేపల్లిగూడెం(తాలూకా ఆఫీస్ సెంటర్): సీనియర్ పాత్రికేయులు యద్దనపూడి సూర్యనారాయణమూర్తి జీవితం నేటి తరం పాత్రికేయులకు స్ఫూర్తిదాయకమని సాక్షి సీనియర్ న్యూస్ ఎడిటర్ గురునాథ్ అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం సమావేశం హాలులో సీనియర్ జర్నలిస్ట్ యద్దనపూడి 6వ వర్ధంతి సభ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అడపా మాణిక్యాలరావు అధ్యక్షతన నిర్వహించారు. తొలుత సూర్యనారాయణ మూర్తి విగ్రహానికి స్వాంతంత్ర సమరయోధులు ప్రత్తి శేషయ్య, పాత్రికేయులు పూలమాలలు వేసి నివాళ్ళుర్పించారు. సభ కార్యక్రమంలో సాక్షి సీనియర్ న్యూస్ ఎడిటర్ గురునాథ్ మాట్లాడుతూ జర్నలిస్ట్ వృత్తికి వన్నె తెచ్చిన మహనీయుడు సూర్యనారాయణమూర్తి జ్ఞాపకాలు పచ్చగానే ఉన్నాయన్నారు. ప్రతి ఒక్క జర్నలిస్టు యద్దనపూడిని ఆదర్శంగా తీసుకుని వృత్తి నిబధతతో పనిచేయాలని సూచించారు. ప్రత్తి శేషయ్య మాట్లాడుతూ యద్దనపూడితో ఉన్న తన అనుబంధాన్ని గుర్తుకు తెచ్చారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పూర్వ అధ్యక్షులు దూసనపూడి సోమసుందర్ మాట్లాడుతూ నిబద్ధత కలిగిన పాత్రికేయునిగా యద్దనపూడి సమాజానికి సేవలందించారన్నారు. విద్యుత్, టెలికాం, రైల్వే, బస్ సౌకర్యాలు కోసం పోరాటాలు చేసి ప్రజలకు వాటి సేవలనందించారన్నారు. జిల్లా అధ్యక్షులు జీవీఎస్ రాజు మాట్లాడుతూ మంచి కుటుంబాన్ని సమాజానికి అందజేసిన మహానీయుడు సూర్యనారాయణ మూర్తి అన్నారు. జిల్లా తొలి సమావేశపు ప్రాంగణ వేదికకు యద్దనపూడి పేరు పెడతామన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వానపల్లి సుబ్బారావు మాట్లాడారు.
సీనియర్ జర్నలిస్టులకు సన్మానం:
యద్దనపూడి స్మారక అవార్డులో భాగంగా సీనియర్ పాత్రికేయులైన శర్మ, ఐవీ సుబ్బారావు, వాసా సత్యనారాయణలను ఘనంగా సన్మానించారు. అంతేగాక గురునాథ్ ను ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ బాలికల పాఠశాలలో 2016 విద్యా సంవత్సరంలో పదోతరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన మల్లేశ్వరపు స్వాతికి రూ 5, 116 లు, దుస్తులను కుటుంబ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు పైలు శ్రీనివాస్, తేతలి గంగాధర రెడ్డి, చిట్యాల రాంబాబు, పాత్రికేయులు, కుటుంబ సభ్యులు యద్దనపూడి బాల త్రిపుర సుందరి, వైబిఆర్ లక్ష్మి, అన్నపూర్ణ, పద్మావతి, సుబ్బారావు, అనంత లక్ష్మి తదితరులు ఉన్నారు.