రెవెన్యూ టికెట్ల కొరత
భువనగిరి
ఆర్థిక లావాదేవీలకు అత్యంత అవసరమైన రెవెన్యూ స్టాంపుల కొరత అక్రమ వ్యాపారుల పంట పండిస్తోంది. ఒక్క రూపాయికి పోస్టాఫీస్‌లో దొరికే రెవెన్యూ టికెట్ ఇప్పుడు బహిరంగ మార్కెట్‌లో ఐదు రూపాయలు పలుకుతోంది. పోస్టల్ శాఖ, రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖల మధ్యన కమీషన్ విషయంలో కుదరని ఏకాభిప్రాయంతో పోస్టాఫీస్‌లకు మూడు నెలలుగా రెవెన్యూ స్టాంపుల సరఫరా నిలిచిపోయింది. భువనగిరి సబ్ డివిజన్ పోస్టాఫీస్ పరిధిలో 12 సబ్‌పోస్టాఫీస్‌లుండగా వాటి పరి«ధిలో 170 వరకు గ్రామీణ తపాల కార్యాలయాలు ఉన్నాయి. వీటన్నింటితో పాటు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
కుదరని ఒప్పందంతో..
రాష్ట్ర రిజిష్ట్రేషన్ల శాఖ, పోస్టల్ శాఖల మధ్యన కమీషన్ల విషయంలో ఒప్పందం కుదర కపోవడంతో రెవెన్యూ స్టాంప్‌ల సరఫరా నిలిచిపోయింది. గత సంవత్సరం కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది.దీంతో స్టాంపులన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచే అమ్మకాలు సాగుతున్నాయి. దీన్ని సాకుగా తీసుకుని భువనగిరి, యాదగిరిగుట్ట, బీబీనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరి«ధిలో కొందరి అక్రమార్కుల పంట పండుతోంది.
ఒక్కో టికెట్ రూ.5కు విక్రయం
రెవెన్యూ టికెట్‌లు పోస్టాఫీస్‌లలో లభించకపోవడంతో వాటికి అక్రమార్కులు డిమాండ్ పెంచేశారు. సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు చెందిన సంబంధిత ఉద్యోగులు తమ ఏజెంట్లకు టికెట్లను విక్రయిస్తున్నారు. దీంతో వారు విచ్చల విడిగా టికెట్లను రూ.ఐదు వరకు అమ్ముతున్నారు. ఎప్పుడూ పోస్టాఫీస్‌ల నుంచి రూపాయికి కొనుగోలు చేసి తెచ్చుకునే టికెట్లు అధిక ధరలకు కొనుగోలు చేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకు రుణాలు, ఫైనాన్స్ వ్యాపారులు,ఎల్‌ఐసీ, చిట్‌ఫండ్స్, ప్రామిసరీ నోట్లు ఇలా పలు రకాల ఆర్థిక లావాదదేవీల కోసం రెవెన్యూ స్టాంపులు అవసరం ఉంటుంది.ప్రతి రోజు వేలాది స్టాంపుల వినియోగం జరుగుతుంది.
మూడు నెలలుగా నిలిచిన సరఫరా
– రవీంద్రమోహన్, హెడ్ పోస్ట్‌మాస్టర్ భువనగిరి
పోస్టాఫీస్‌లకు మూడు నెలలుగా స్టాంప్‌ల సరఫరా నిలిచిపోయింది. మావద్ద ఉన్న స్టాకు నెల క్రితం అయిపోయింది. రోజు స్టాంపుల కోసం జనం వచ్చిపోతున్నారు. ప్రభుత్వం నుంచి సరఫరా లేకపోవడం వల్ల మేము అమ్మలేకపోతున్నాం.
అధిక ధరకు కొనుగోలు చేస్తున్నాం
– రాజు,భువనగిరి
రెవెన్యూ స్టాంప్‌లు పోస్టాఫీస్‌లో దొరకడం లేదు. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లమంటున్నారు. అన్ని సార్లు రిజిస్ట్రేషన్ కార్యాలయం తెరిచి ఉండదుకదా. దుకాణాల్లో అ«ధిక ధరలకు అమ్ముతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్టాంప్‌లను పోస్టాఫీస్‌ల ద్వారా విక్రయించాలి.