
అపహరణకు గురైన దివ్య దారుణ హత్య
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా దేవరాపల్లిలో అదృశ్యమైన చిన్నారి దివ్య (7) దారుణ హత్యకు గురైంది. దివ్యకు మేనమామ వరుసయ్యే శేఖర్ అనే వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేశాడు. పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.... దేవరాపల్లికి చెందిన వేపాడ మురుగన్, ధనలక్ష్మి దంపతులకు దివ్య, గణేష్ అనే పాప, బాబు ఉన్నారు.
అయితే మంగళవారం ఉదయం స్కూలుకు వెళ్లిన దివ్య సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు కుటుంబసభ్యులు, పరిచయస్తులు వద్ద వాకబు చేశారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దివ్యను మేనమామ వరుసయ్యే శేఖర్ రాళ్ల క్వారీవైపు తీసుకెళ్తుండగా తాము చూశామని స్థానికులు తెలిపారు. దాంతో పోలీసులు శేఖర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
దీంతో అతడు హత్య చేసినట్లు తన నేరాన్ని ఒప్పుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రైవాడ రిజర్వాయర్ వెనుక వైపు ముళ్లపొదల్లో దివ్య మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కి తరలించారు. స్థానిక ఉషోదయ కాన్వెంట్ లో దివ్య యూకేజీ చదువుతోంది.