నేత్రపర్వంగా ఊంజల సేవ
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : ఇంద్రకీలాద్రిపై ఆది దంపతులకు ఊంజల సేవ నేత్రపర్వంగా సాగింది. తిరుమలలో శ్రీనివాసునికి నిత్యం జరిగే దీపోత్సవ సేవ తరహాలో ఇంద్రకీలాద్రిపై ఆది దంపతులకు ఊంజల సేవను దుర్గగుడి అధికారులు ప్రారంభించారు. కార్తీక మాసాన్ని పురష్కరించుకుని ఈ సేవను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. గణపతి పూజ , పంచహారతుల అనంతరం శ్రీ గంగా పార్వతి సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్లను రాజగోపురం వద్దకు పల్లకిపై ఊరేగింపుగా తీసుకువచ్చారు. రాజగోపురం ఎదుట ఏర్పాటు చేసిన దీపోత్సవ స్టాండ్‌లోని ఊయ్యాలలో ఆది దంపతుల ఉత్సవ మూర్తులను ఉంచి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై తొలిసారిగా నిర్వహించిన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, ఆలయ అధికారులతో పాటు పెద్ద ఎత్తున భక్తజనులు పాల్గొన్నారు. తొలుత అమ్మవారి ప్రధాన ఆలయంతోపాటు మల్లేశ్వరాలయం, నటరాజ స్వామి వారి ఆలయం వద్ద ఆకాశ దీపాలను ఏర్పాటుచేశారు. తుమ్మగూడెం శ్రీ శ్రీనివాస భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు, భక్తి గేయాలు ఆకట్టుకున్నాయి. కార్తీక మాసం నెల రోజులు అమ్మవారికి కళా సేవ చేసేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసినట్లు కళాకారులు పేర్కొన్నారు.
మల్లేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మల్లేశ్వరాలయంలో స్వామి వారికి లక్ష బిల్వార్చన, సహాస్ర లింగార్చన చేశారు. శివ పంచాక్షరీ జపం, లక్ష్మీ గణపతి మంత్రజపం, రుద్రహోమం నిర్వహించారు.