ఆందోళన వ్యక్తం చేస్తున్న గిరిజన వేతనదారులు
-
ఉపాధి వేతనదారులకు తప్పని వెతలు
-
పది కిలోమీటర్లు కొండెక్కాలి
-
రెండేళ్లుగా ఉపాధి లేని బిల్లగూడ కాలనీ వాసులు
సీతంపేట : ఉపాధి హామీ సిబ్బంది చేసిన తప్పిదానికి రెండేళ్లుగా ఆ గిరిజనులకు ఉపాధి పనుల్లేకుండా పోయాయి. మా జాబ్‌కార్డులు ఒక చోట పనులు మరోచోట కల్పిస్తున్నారు, జాబ్‌కార్డులు మార్చాలంటూ పదేపదే అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేదని మండలంలోని కుశిమి పంచాయితీ బిల్లగూడ కాలనీకి చెందిన గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం వీరంతా మండల పరిషత్ కార్యాలయ అధికారులను ఆశ్రయించారు. వివరాలు పరిశీలిస్తే... మండలంలోని కుశిమి పంచాయతీ పరిధిలో బిల్లగూడ కాలనీలో 30 వరకు గిరిజన కుటుంబాలు నివశిస్తున్నాయి. మూడు శ్రమశక్తి గ్రూపులు ఉండగా 21 జాబ్‌కార్డులుండగా 60 మంది ఉపాధి హామీ పనిలో పాల్గొంటున్నారు. వీరందరికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శంబాం పంచాయతీ బిల్లగూడలో జాబ్‌కార్డులు ఉండడంతో అక్కడ వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. వేతనాల కోసం వెళ్లాలంటే కొండలు దాటి పది కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉందని గ్రామానికి చెందినవేతనదారులు బాబురావు, శ్యామలరావు, సిమ్మయ్య తదితరులు తెలిపారు. 2007 నుంచి ఇదే సమస్య ఉందని తెలిపారు. ఈ సమస్యతో రెండేళ్లుగా ఉపాధి పనులకు కూడా వెళ్లడం లేదన్నారు. ఉపాధి అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా పరిష్కారం లేదని తెలిపారు. ఇప్పటికైనా స్పందించి మాకు న్యాయం చేయాలని గిరిజనులు కోరుతున్నారు.