కస్తూర్బా తరహాలో యూఆర్‌ఎస్‌ | Urs in Kasturba style | Sakshi
Sakshi News home page

కస్తూర్బా తరహాలో యూఆర్‌ఎస్‌

Published Sat, Jun 10 2017 4:53 AM | Last Updated on Fri, Aug 24 2018 6:44 PM

కస్తూర్బా తరహాలో యూఆర్‌ఎస్‌ - Sakshi

కస్తూర్బా తరహాలో యూఆర్‌ఎస్‌

బడిబయట ఉన్న బాలుర కోసం యూఆర్‌ఎస్‌ పాఠశాలల (అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో జిల్లాకు ఒకటి చొప్పున ప్రారంభించనుంది. వీటి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60, 40 శాతం చొప్పున నిధులు కేటాయించున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని, ఇందు కోసం భవనాన్వేషణలో అధికారులు కసరత్తు చేస్తున్నారు.      – సాక్షి, వికారాబాద్‌
 
భవనం లభించగానే ప్రారంభిస్తాం
వికారాబాద్‌కు అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల మంజూరైంది. ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభించే సమయానికే ఈ పాఠశాలను కూడా ప్రారంభించాలని ఉన్నతాధికారులు సూచించినా భవనం లభించలేదు. తాత్కాలిక భవనం కోసం అన్వేషిస్తున్నాం. భవనం లభించగానే ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తాం. ప్రభుత్వ భవనం లభించకపోతే అద్దె భవనంలోనైనా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.
– దీపిక, జిల్లా విద్యాధికారి 
 
సాక్షి, వికారాబాద్‌: ఎటువంటి ఆసరా లేని, బడి బయట ఉన్న బాలికల విద్యాభ్యాసం కోసం ప్రభుత్వం కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాలలు (కేజీబీవీ)లను దశాబ్దకాలం క్రితం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక్కడ బాలికలకు ఉచిత చదువుతో పాటుగా వసతులను కల్పించారు. దీంతో వేలాదిమంది బాలికలు ఇందులో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ ప్రక్రియ సత్ఫలితాలను ఇవ్వడంతో ఇదే తరహాలో బడిబయట ఉన్న బాలుర కోసం యూఆర్‌ఎస్‌ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులను సమకూర్చగా రాష్ట్ర వాటాగా 40శాతం  రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది
 
బాలల గుర్తింపు..
పనులకు వెళుతూ బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి వారికి విద్యాబోధన చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ పాఠశాల పనిచేయనుంది. విద్యాహక్కు చట్టం అమలులో భాగంగానే ఈ తరహా పాఠశాలను ప్రారంభించాలని నిర్ణయించారు. బాలకార్మికులు, తల్లిదండ్రులు లేని అనాథలు, తల్లి, తండ్రి మృతి చెందిన ఎలాంటి ఆసరా లేని పిల్లలు వీటిలో చేరేందుకు అర్హులుగా చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి వారి తెలివితేటలు, సామర్థ్యాలను ఆధారంగా చేసుకొని 6, 7, 8 తరగతుల్లో ప్రవేశం కల్పించి విద్యాబోధన చేయనున్నారు. జిల్లాలోని ఏమండలం వారైనా ప్రవేశానికి అర్హులు. కాగా.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వారిని చేర్చుకోవడానికి అర్హత సాధించాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాలలో సుమారుగా 100 మంది విద్యార్థులను చేర్చుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏడాది తరువాత వారికి నిర్వహించే పరీక్షా ఫలితాలను బట్టి రెగ్యులర్‌ పాఠశాలలో చేరవచ్చు.. లేదా అదే పాఠశాలలో చదివేందుకు అవకాశం ఉంటుంది.
 
తాత్కాలిక భవనం కోసం అన్వేషణ 
ఉన్నతాధికారుల సూచన మేరకు యూఆర్‌ఎస్‌ బాలుర పాఠశాలను పాఠశాలలు తెరిచే 12వ తేదీనే ప్రారంభించాలని ప్రయత్నం చేస్తున్నా భవనం ఇప్పటివరకు లభించలేదు. దీంతో ఈ పాఠశాల భవనం ప్రారంభానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. పాఠశాలకు అనువైన ప్రైవేటు అద్దె భవనం ఏదైనా దొరుకుతుందా.. లేక ప్రభుత్వం భవనాలు ఏవైనా ఖాళీగా ఉన్నాయా అనే కోణంలో అధికారులు అన్వేషణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అనంతగిరిలో ఉన్న జిల్లా ట్రెజరీ కార్యాలయం (డీటీఓ) భవనంలో ఆన్‌లైన్, ఇంటర్‌నెట్‌ అంతరాయం, తదితర సమస్యలు తలెత్తుతున్నందు వల్ల ఈ భవనం వికారాబాద్‌ పట్టణంలోని మార్చారు. దీంతో ఈ డీటీఓ భవనం ఖాళీ అయితే తాత్కాలికంగా అందులో అర్బన్‌ రెసిడెన్షియల్‌ బాలుర పాఠశాలను ఏర్పాటు చేయాలని కూడా అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏదిఏమైనా జిల్లాలో మరో బాలుర రెసిడెన్షియల్‌ పాఠశాల ఏర్పాటు కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement