వేడుక చూడ.. వెల్లువలా..
-
భక్తులతో కిటకిటలాడిన ‘కోనసీమ తిరుపతి’
-
నయనమనోహరంగా నాలుగో రోజు బ్రహ్మోత్సవాలు
-
సూర్య, చంద్రప్రభ వాహనాలపై స్వామి ఊరేగింపు
వాడపల్లి(ఆత్రేయపురం) :
అటు గౌతమిలో జలం పరవళ్లు.. ఇటు తీరంలో జనం పరవళ్లు.. ‘కోనసీమ తిరుపతి’ వాడపల్లి వేంకటేశ్వరస్వామి బ్రహోత్సవాల్లో నాలుగోరోజు∙శనివారం కావడంతో భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచీ తరలివచ్చిన భక్తులతో గ్రామంలో కిటకిటలాడినట్టయింది. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి సూర్య, చంద్రప్రభ వాహనాలపై గ్రామోత్సవం నిర్వహించారు.
ఉదయం తీర్థపు బిందెతో గోదావరి జలాలను తెచ్చి సుప్రభాతసేవ అనంతరం స్వామివారికి అభిషేకం చేశారు. గోత్రనామాలతో పూజలు, నిత్యహోమాలు, నివేదన, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించి తీర్థప్రసాద వినియోగం చేశారు. ఆగమ భాస్కర ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు 108 కలశాలతో అభిషేకం నిర్వహించి స్వామి వార్ని ప్రత్యేకంగా అలంకరించి సూర్య, చంద్రప్రభ వాహనాలపై ఊరేగించారు. స్వామివారికి విష్వక్సేనæ పూజ, పుణ్యాహవచనం, కుంభపూజ, తిరుమంజనోత్సవం, విశేషారాధన, చతుర్వేద పారాయణం, బాలభోగ నివేదన, అనంతరం స్వామి వారికి అషో్టతర శత కలశాభిషేకం, సహస్ర దీపాలంకరణ సేవ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఏర్పాట్లను ఈవో బీహెచ్‌వీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఆలయ పర్యవేక్షకులు రాధాకృష్ణ, సాయిరామ్, శివ, నరీన్ చక్రవర్తి పర్యవేక్షించారు. వేలాదిమంది భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
నేటితో బ్రహ్మోత్సవాలకు తెర
బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగియనున్నాయి. చివరిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ముత్యాలపల్లకిలో ఉత్సవ మూర్తులను బాణ సంచా కాల్పుల నడుమ గోదావరి తీరానికి వెళ్లి చక్రస్నానం చేయిస్తారు. అనంతరం బాలభోగం, నివేదన, గజవాహన సేవ, అశ్వవాహన సేవ తోపాటు విశేష పుష్పాలతో స్వామివారికి ఉయ్యాలసేవ, పవళింపు సేవ తదితర కార్యక్రమాలు జరుగుతాయి.