భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం
Published Sat, Aug 13 2016 12:54 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
మహానంది/ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అహోబిలం, మహానందిలో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. మహానందిలో 230 మంది దంపతులు పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. గణపతిపూజ, పుణ్యాహవాచనం, కలశంలో లక్ష్మీదేవి ఆవాహన, వరలక్ష్మి అమ్మవారికి షోడశోపచార పూజలు, తోరగ్రంధి పూజలు నిర్వహించినట్లు వేదపండితులు రవిశంకర అవధాని తెలిపారు. వ్రతంలో పాల్గొన్న భక్తులకు సకల శుభాలు కలుగుతాయన్నారు. వ్రతంలో పాల్గొన్న భక్తులందరికీ నంద్యాలకు చెందిన బంగారు వ్యాపారి అవ్వారు గౌరీనా«ద్, సరస్వతీ దంపతులు సారె సమర్పించారు. కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ బి.శంకర వరప్రసాద్, ఆలయ పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు పాల్గొన్నారు.
అహోబిలంలో: శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో నియోజవర్గంలోని ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజామునుంచే మహిళలు ఆలయాల వద్ద బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలలు భక్తి శ్రద్ధలతో, శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు.
అహోబిలంలో శ్రీమహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను దేవస్థానం ఎదురుగా కొలువుంచి తిరుమంజనం జరిపారు. నూతన పట్టువస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.lమహిళలు సామాహిక వ్రతం నిర్వహించారు. ఆలయ ముద్రణకర్త శ్రీమాణ్ శఠగోప వేణుగోపాలన్ భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు.
Advertisement