వామ్మో వార్దా
వామ్మో వార్దా
Published Sat, Dec 10 2016 10:36 PM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM
కరెన్సీ కొరత వేళ తుపాను ముప్పు
ఆందోళన చెందుతున్న తీర ప్రాంత జనం
చేతిలో చిల్లిగవ్వ లేక హడలిపోతున్న ప్రజలు
నరసాపురం : వార్దా తుపాను భయపెడుతోంది. కరెన్సీ కష్టాలు రెట్టింపైన వేళ తుపాను ముప్పు పొంచి ఉండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురిస్తే చేతిలో చిల్లిగవ్వలేని వేళ తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే నోట్ల కష్టాలు తీవ్రంగా వెంటాడుతున్నాయని, ఈ నేపథ్యంలో తుపాను అంటే జనజీవనం పూర్తిగా స్తంభిస్తుందని ఆందోళన చెందుతున్నారు.
వణుకుతున్న తీరం
19 కిలోమీటర్ల సముద్రతీరం ఉన్న జిల్లాకు తుపానులు కొత్తకాదు. తుపానుల సమయంలో జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, జనాన్ని ఇళ్ల నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం లాంటివి ప్రభుత్వ ఆదేశాలతో అధికార యంత్రాంగం చేపడుతుంది. అయితే వార్దా తుపానును ప్రత్యేకంగా చూడాలి. నోట్ల రద్దుతో జనం దగ్గర రూపాయి లేని పరిస్థితి. సరిగ్గా సమయం చూసి తుపాను విరుచుకు పడబోతోంది. అందుకే అందరిలో ఒకటే గుబులు. రెండు రోజుల నుంచి గంటల తరబడి బ్యాంకుల ముందు నుంచున్నా కూడా పైసా చేతికి రాలేదు. ఏటీఎంలు ఎక్కడా తెరుచుకోలేదు. శనివారం అయినా ఏటీఎంల్లో సొమ్ములు పెడతారనుకుంటే అదీ జరగలేదు. మరో రెండు రోజుల పాటు బ్యాంకులకు సెలవు. ఈ రెండురోజులు కూడా ఏటీఎంల్లో సొమ్ములు పెట్టకపోతే అడగడానికి బ్యాంకు సిబ్బంది కూడా కనిపించని పరిస్థితి. రాబోయే రెండు రోజులు కూడా ఏటీఎంల్లో సొమ్ములు ఉండవని, జనం మానసికంగా సిద్ధమయ్యారు. తుపాను గండాన్ని ఎలా గట్టెక్కాలోనని ఆలోచిస్తున్నారు.
భారీవర్షాలు కురిసే అవకాశం
ఆది, సోమవారాల నుంచి తుపాను ప్రభావం కనిపిస్తుందని అధికారులు చెబుతున్నారు. రెండు, మూడు రోజులు వరుసగా భారీవర్షాలు పడి ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడితే తీవ్ర ఇబ్బందులు తప్పవు. భారీవర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. అదే జరిగితే ఇంట్లో నుంచి రెండు, మూడు రోజులపాటు బయటకు రాని పరిస్థితి. దీంతో పప్పులు, కూరగాయలు లాంటి నిత్యావసర వస్తువులు కొనుక్కుని, ఇంట్లో పెట్టుకుందామని జనం భావించారు. అయితే శనివారం ఎక్కడా ఏటీఎంలు తెరుచుకోలేదు. కోతలు ఇంకా పూర్తిస్థాయిలో అవ్వకపోవడం, ధాన్యం ఒబ్బిడి జరగక పోవడం లాంటి ఇబ్బందులున్నాయి. కూలీలకు సొమ్ములు ఇచ్చుకోని పరిస్థితిలో రైతులు ఉన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా సొమ్ములు ఇచ్చేందుకు బ్యాంకుల వద్ద ప్రత్యేక కౌంటర్‌లు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. కానీ ఎక్కడా అమలు కాలేదు. ఒక్క రైతులు అనే కాదు. వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికులు ఇలా అన్నివర్గాల ప్రజలకు ఇప్పుడు ఒక్కటే అలోచన. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా తుపాను తాకిడిని ఎలా ఎదుర్కోవాలి. తుపాను రక్షణ చర్యలంటూ రెండు రోజులుగా సమీక్ష సమావేశాలతో హడావిడి చేస్తున్న రెవెన్యూ అధికారులు మరి ఈసారి రక్షణ చర్యల్లో కొత్తగా చేరిన కరెన్సీ కొరతను ఎలా ఎదుర్కొంటారనేదే అసలు ప్రశ్న.
తిరిగొచ్చిన బోట్లు
తుపాను ప్రభావం శనివారం నుంచి కనిసిస్తోంది. నరసాపురం తీరప్రాంతంలో ఆకాశం మబ్బులతో, చల్లటి గాలులు వీస్తున్నాయి. వేటకు వెళ్లిన బోట్లు తుపాను హెచ్చరికలతో తీరానికి చేరాయి. నెల్లూరు, మచిలీపట్నం, కాకినాడ ప్రాంతాలకు చెందిన 70 వరకూ వేట బోట్లు నరసాపురం తీరానికి చేరాయి. సముద్రంలో అలజడి వాతావరణం నెలకొందని మత్స్యకారులు తెలిపారు.
చేతిలో చిల్లిగవ్వ లేదు
నేను చేపలు అమ్ముకుని జీవిస్తున్నాను. తుపాను తీవ్రరూపం దాలిస్తే కొన్ని రోజుల వరకు వ్యాపారం ఉండదు. నోట్ల రద్దు కారణంగా కొంతకాలంగా అమ్మకాలు లేవు. పింఛన్ సొమ్ము కూడా బ్యాంకులోనే ఉంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఈ పరిస్థితుల్లో తుపాను వస్తే తీవ్ర ఇబ్బందులే.
కె.సత్యవతి, మెట్టిరేవు, మొగల్తూరు మండలం
నగదు కొరత లేకుండా చూడాలి
తుపాను ప్రభావం గట్టిగా ఉంటే మాత్రం జనం నానాపాట్లు పడతారు. ఎందుకంటే మూడు రోజులుగా బ్యాంకుల్లో డబ్బులు సరిగా రావడంలేదు. మళ్లీ సెలవులు వచ్చాయి. ఎవరి చేతిలోనూ డబ్బులు లేవు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నగదు కొరత లేకుండా చూడాలి.
డాక్టర్ ఏబీఎస్ మూర్తి, పర్యావరణవేత్త, వైఎన్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్
Advertisement
Advertisement