పల్నాటి వీరారాధనోత్సవాలు ప్రారంభం
పల్నాటి వీరారాధనోత్సవాలు ప్రారంభం
Published Mon, Nov 28 2016 10:49 PM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM
కారంపూడి: పల్నాటి వీరారాధనోత్సవాలు సోమవారం కారంపూడిలో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభ సూచనగా పల్నాటి వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ వీరులగుడి ముఖద్వారంపై ఎర్రజెండాను ఎగురవేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీరాచార, వీర విద్యావంతులు ఉత్సవ కేంద్రానికి తరలి వస్తున్నారు. వారితోపాటు తీసుకొచ్చిన ఆయుధాలు నిధి మీదకు వస్తున్నాయి. ఆయుధాలను నాగులేరు గంగధారిలో శుభ్రపరచి అలంకారాలు చేశారు. అనంతరం వచ్చిన వారంతా ఊరేగింపుగా పీఠాధిపతి ఇంటికి వెళ్లి ఆయనను వీరులగుడికి తీసుకొచ్చారు. బ్రహ్మనాయుడు ఆయుధం నృరసింహకుంతం ముందు పీఠాధిపతి ఆశీనుడయ్యారు. అనంతరం గుడి ముఖద్వారంపై జెండా ప్రతిష్టించారు. పల్నాటి యుద్ధంలో పాల్గొన్న 77 గోత్రాల వారికి కంకణధారణ చేశారు. అనంతరం ముందుగా కొమ్మరాజులు, పోతురాజులు, కన్నమనీడులు వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
ముగిసిన రాచగావు
మొదటి రోజు ఉత్సవం రాచగావును రాత్రి నిర్వహించారు. రోతురాజుకు లాంఛనంగా గావు చెల్లించారు. అన్నంలో నెత్తురు కలిపి ముద్దలుగా చేసి పోతురాజుకు చెల్లించారు. తర్వాత అలాంటి ముద్దలను గాలిలోకి విసిరారు. రాత్రి 12 గంటల దాకా కార్యక్రమాలు కొనసాగాయి. ఇలా చేస్తే వీరుల ఆత్మలు దానిని స్వీకరిస్తాయని నమ్మిక. వాస్తవంగా రాచగావు అంటే వీరాచారవంతుడు ఒక జంతువు మెడకొరికి పోతురాజుకు అర్పించే ప్రక్రియ. తర్వాత అందరూ పొట్టేళ్లను పోతురాజుకు బలి ఇచ్చే కార్యక్రమం ఇది. జీవకారుణ్య సంఘం అభ్యర్థన మేరకు దీనిని కలెక్టర్ నిషేధిస్తూ 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఉత్తర్వులిస్తున్నారు. మంగళవారం రాయబారం ఉత్సవం నిర్వహిస్తారు.
వసతలు లేవు
గుండ్లపల్లి, అనుపాలెం, చిలకలూరిపేట, మార్టూరు ఇలా అనేక ప్రాంతాల నుంచి వీరాచారవంతులు తరలివచ్చారు. అయితే వీరికి సరైన వసతులు లేవు. వీరులగుడి ప్రాంగణం అంతా లైటింగ్ లేక చీకటిగా ఉంది. చీకట్లో భోజనాలు చేయాల్సి వచ్చింది.
Advertisement
Advertisement